అవీ.. ఇవీ కావు.. ఈ చట్నీలనూ తినండి ఆరోగ్యంగా ఉంటారు..
భారతీయ చట్నీలు రుచికరంగానే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంతకీ మనల్ని ఆరోగ్యంగా ఉంచే చట్నీలేంటో తెలుసుకుందాం పదండి.

భారతీయ ఆహారాలు.. కేవలం మనదేశానికే పరిమితం కాలేదు.. ఇతర దేశాల్లో కూడా ఎంతో ప్రసిద్ధి పొందాయి. రుచికరమైన దోసెలు, పరాఠాలు, స్వీట్లు, వేయించిన ఆహార పదార్థాలను ఇండియన్స్ ఎక్కువగా తింటారు. అంతేకాదు మన దేశంలో కొన్ని రకాల చట్నీలు కూడా ప్రసిద్ధి చెందాయి. మన దేశంలో దోశ, ఇడ్లీ, పరాఠా, చపాతీ, పులావ్, చిత్రాన్నం ఇలా ఏది తిన్నా.. అందులోకి చట్నీని వేసుకుంటేనే బలే టేస్టీగా అనిపిస్తుంది. అందుకే జనాలు ఇలా తినడానికు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతెందుకు బజ్జీలు, పకోడీలు, సమోసాలు మొదలైనవి తినేటప్పుడు కూడా స్పైసీ చట్నీని ఖచ్చితంగా తింటుంటారు.
అయితే కొన్ని సింపుల్ చట్నీలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ.. ఇన్నీ కాదు. ఎక్కువ చక్కెర, ఉప్పు లేదా ప్రిజర్వేటివ్లు లేని.. ఇంట్లో తయారుచేసిన చట్నీలను తింటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. 2018 లో ప్రచురించబడిన జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ ప్రకారం.. ఊరగాయల మాదిరిగా.. ఇంట్లో ఉండే తాజా కూరగాయలతో చేసిన చట్నీల్లో ఎన్నో పోషకాలుంటాయి. ఏయే చట్నీలు తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం పదండి..
పుదీనా- కొత్తిమీర చట్నీ
పుదీనా, కొత్తిమీర ల్లో ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఈ చట్నీల్లో ఎక్కువ మొత్తంలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఈ చట్నీకి పచ్చిమిర్చి, వెల్లుల్లి వంటి పదార్థాలను జోడించడం వల్ల పోషకాలు మరింత ఎక్కువ అవుతాయి.
వెల్లుల్లి చట్నీ
2020 లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. వెల్లుల్లిలో నమ్మలేనన్ని పోషకాలుంటాయని కనుగొన్నారు. ఇది అనేక వ్యాధులను తగ్గించే నివారణా లక్షణాలను కలిగి ఉందని తెలిసింది. వెల్లుల్లిని ప్రతిరోజూ తినడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని వెల్లడైంది. సాధారణంగా వెల్లుల్లి చట్నీలో కొబ్బరి, శనగలు, ఎండుమిర్చి కలిపి తీసుకుంటే ఈ యాంటీ ఆక్సిడెంట్ల సాంద్రత బాగా పెరుగుతుంది.
టొమాటో చట్నీ
టొమాటోల్లో విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండటమే కాకుండా లైకోపీన్ అనే బయో యాక్టివ్ కాంపౌండ్ కూడా ఉంటుంది. లైకోపీన్ మీ కణాలను దెబ్బతినకుండా సంరక్షిస్తుంది. ఇది వ్యాధిని నిరోధించే ఏజెంట్ కూడా. అయితే ఈ చట్నీల్లో షుగర్ ను మాత్రం ఉపయోగించకండి. కావాలనుకుంటే బెల్లం లేదా ఖర్జూరాలను ఉపయోగించండి.
కొబ్బరి చట్నీ
కొబ్బరిలో కొవ్వు ఎక్కువగా ఉన్నప్పటికీ మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్లు కూడా ఉంటాయి. ఇవి మాంసాల ద్వారా పొందిన సంతృప్త కొవ్వుల కంటే చాలా ఆరోగ్యకరమైనవి. కొబ్బరిలో కాపర్, ఫైబర్, మాంగనీస్, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం అధిక మొత్తంలో ఉంటాయి. అయితే వీటిలో విటమిన్లు సమృద్ధిగా లేకపోయినా.. పోషకాహారం ఇది.
వేరుశెనగ చట్నీ
వేరుశెనగలో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. అయితే కార్బోహైడ్రేట్లు మాత్రం తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. సాధారణంగా వేరుశెనగ చట్నీలో టమోటాలను, ఉల్లిపాయలను, వెల్లుల్లిని వేస్తారు. ఇవి ఈ చట్నీకి ఎక్కువ పోషకాలను జోడిస్తాయి.
చింతపండు పచ్చడి
చింతపండులో విటమిన్ బి1, బి2, బి3, బి5 లతో పాటు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్,ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చింతపండులో ఫ్లేవనాయిడ్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చింతపండు చట్నీలో అల్లం పొడిని కూడా వేస్తారు. ఈ చట్నీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
ముడి మామిడి చట్నీ
ముడి మామిడి కాయలో విటమిన్ ఎ,విటమిన్ సి , విటమిన్ ఇ లు అధికంగా ఉంటాయి. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. పుల్లగా ఉందని చక్కెరను మాత్రం కలపకూడదు. కావాలనుకుంటే వీటికి బదులుగా బెల్లాన్ని కలపండి.