రోజుకి 20వేల అడుగులు వేస్తే ఏమౌతుంది?
నడక ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ప్రతిరోజూ 2 నుంచి 2 వేల అడుగులు వేస్తే.. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం....
ప్రతిరోజూ శరీరానికి కనీస వ్యాయామం ఉండాలి. ఇది చాలా అవసరం. నడక కూడా మంచి వ్యాయామం. రోజుకు 10,000 అడుగులు నడిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చాలామందికి తెలుసు. కనీసం 30 నిమిషాలు నడిచినా మంచి వ్యాయామం అవుతుంది. 10 వేల అడుగులు ఎలాగైతే శరీరానికి మేలు చేస్తాయో, అదేవిధంగా 20,000 అడుగులు నడిస్తే రెట్టింపు ప్రయోజనం కలుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
బరువు తగ్గాలనుకునేవారు రోజుకు 20 వేల అడుగులు నడిస్తే వారి బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది. త్వరలోనే శరీర బరువు కూడా గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా మంచి నిద్ర పట్టడానికి 20,000 అడుగులు నడక వ్యాయామం చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఒకే రోజులో 20 వేల అడుగులు నడవాలని లక్ష్యం పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
ప్రారంభ దశలో 2 నుండి 3 వేల అడుగులు నడిచి 10 వేల అడుగుల లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఆ తర్వాత దశలవారీగా 20 వేల అడుగులు నడవడానికి ప్రయత్నించవచ్చు. ఇలా నడక వ్యాయామం చేయడం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. మీరు ఎందుకు 20 వేల అడుగులు నడవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మెదడు ఆరోగ్యం:
2019లో జమా (JAMA) అనే న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, రోజుకు 8,900 అడుగులు నడిచే వారిలో మెదడు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని తెలిపింది. 3 నుండి 5 వేల అడుగులు నడిచేవారికి ప్రయోజనాలు లేవని చెప్పలేము. వారు కూడా ప్రయోజనం పొందుతారు. కానీ ఎక్కువగా నడిచేవారికి ప్రయోజనాలు ఎక్కువగా లభిస్తాయి.
గుండె ఆరోగ్యం:
యూరోపియన్ జర్నల్ అయిన ప్రివెంటివ్ కార్డియాలజీలో గుండె , నడకకు సంబంధించిన ఒక అధ్యయనం ప్రచురితమైంది. దీని ప్రకారం, రోజుకు కనీసం 3,967 అడుగులు నడిచే వారికి మరణ ప్రమాదం తగ్గుతుందట. రోజుకు కనీసం 2,337 అడుగులు నడిచినా గుండె జబ్బుల వల్ల మరణించే ప్రమాదం తగ్గుతుందని అది చెబుతోంది.
మైక్రో వాక్ అంటే ఏమిటి
చిన్న నడకలు:
రాయల్ సొసైటీ బి-జర్నల్ (Proceedings of the Royal Society B Journal) లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో, సుదీర్ఘ నడకల కంటే చిన్న నడకలు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయని తేలింది. అంటే, మైక్రోవాక్ చేసేటప్పుడు మీ శక్తిలో 60% వరకు ఉపయోగించగలమట. ఎక్కువసేపు, ఎక్కువ దూరం నడవడం కంటే ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం అని సమయాన్ని విభజించి చిన్న నడకలు చేయడం శక్తిని పెంచడానికి , కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది.
దీనితో పాటు, అనేక అధ్యయనాలు రోజుకు 20 వేల అడుగులు నడిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నాయి. దాన్ని తర్వాత చూద్దాం.
మానసిక ఆరోగ్యం:
మానసిక శాస్త్రం ప్రకారం, మీరు రోజుకు 20 వేల అడుగులు నడక వ్యాయామం చేస్తే మీ ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. 20,000 అడుగులు మీ శారీరక శ్రమను మాత్రమే కాకుండా, మీ మానసిక స్థితిని కూడా మారుస్తాయి. మానసిక నిరాశ, ఆందోళన వంటివి ఉన్నవారికి ఇది మంచి ఫలితాలను ఇస్తుందని మానసిక అధ్యయనాలు చెబుతున్నాయి.
20,000 అడుగులు నడిస్తే మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి
కీళ్ల బలం:
ప్రతిరోజూ మీ శరీరం చురుగ్గా పనిచేయడం వల్ల శరీరంలోని భాగాలు బలపడతాయి. మీరు వారానికి ఒక్కసారైనా 20 వేల అడుగులు నడవడం ప్రారంభిస్తే, కీళ్లు బలపడటం మీరు గమనించవచ్చు. ఆస్టియోపోరోసిస్ వంటి కీళ్ల సమస్యలను నివారించే అవకాశం ఉంది. నడక వ్యాయామం మీ కండరాలు, కీళ్లను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడం:
నడక వ్యాయామం సాధారణంగా కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడే వ్యాయామం. రోజుకు 20 అడుగులు నడిస్తే కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి. దీనివల్ల బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే బరువు తగ్గడం ప్రతి ఒక్కరి శరీరాన్ని బట్టి మారుతుంది. ఒక వ్యక్తి బరువు, నడిచే వేగం, నడక వ్యాయామం చేసే ప్రదేశం బట్టి బరువు తగ్గడం మారవచ్చు. సాధారణంగా 20 వేల అడుగులు నడిస్తే 500 నుండి 1,000 కేలరీలు బర్న్ అయ్యే అవకాశం ఉంది.
20,000 అడుగులు నడిస్తే చక్కెర స్థాయిలు తగ్గుతాయి
డయాబెటిస్ నియంత్రణ:
ప్రతిరోజూ నడక వ్యాయామం చేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. ప్రతిరోజూ 10 వేల నుండి 20 వేల అడుగులు నడిస్తే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ప్రతిరోజూ భోజనం తర్వాత చిన్న నడక చేయడం వల్ల గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుకోవచ్చు.
20 వేల అడుగులు అద్భుతం!
మీరు 20 వేల అడుగులు నడిస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, రక్తపోటు ఎక్కువగా ఉంటే తగ్గే అవకాశం ఉంది. స్ట్రోక్, కొలెస్ట్రాల్ సమస్యలు రావు.
20,000 అడుగులు నడక జాగ్రత్తలు
జాగ్రత్తగా ఉండవలసిన విషయం:
రోజుకు పదివేల అడుగులు అనేది ఒకరు సాధించగల లక్ష్యం. కానీ 20 వేల అడుగులు కాస్త అసాధ్యమైనదే. ఒకే రోజులో 20 వేల అడుగులు నడవడం వల్ల చాలా అలసిపోయినట్లు అనిపించవచ్చు. కాబట్టి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి ఎక్కువ నీరు త్రాగాలి. శరీరానికి అవసరమైన పోషకాలను అందించడం కూడా ముఖ్యం. సరైన బూట్లు ధరించడం తప్పనిసరి. లేకపోతే ఎముకలు దెబ్బతినవచ్చు. కాళ్లలో నొప్పి, గాయాలు రావచ్చు.
ఈ సమస్య ఉంటే...
ఇప్పటికే శరీరంలో దీర్ఘకాలిక నొప్పి, కీళ్ల సమస్యలు, గుండె జబ్బులు, కీళ్లనొప్పులు వంటి సమస్యలు ఉన్నవారు నడక వ్యాయామాన్ని దశలవారీగా చేయవచ్చు. ఒకే రోజులో 10 వేలు, 20 వేల అడుగులు నడవాలని ప్రయత్నించడం వల్ల దుష్ప్రభావాలు కలగవచ్చు.