బియ్యానికి పురుగులు పట్టొద్దంటే ఏం చేయాలి?
ఎక్కువ రోజులు నిల్వ ఉంటే పప్పులు, కారంలోనే కాదు బియ్యంలో కూడా పురుగులు తయారవుతాయి. ఇలా కాకూడదంటే ఏం చేయాలో తెలుసా?
మన ఇండియాలో మూడు పూటలా బియ్యాన్నే ఆహారంగా తింటారు. అందుకే భారతదేశంలో బియ్యమే ప్రధాన ఆహారం. చాలా మందికి అన్నం ఒక్కపూట తినకపోయినా కడుపు ఖాళీగా ఉన్నట్టు, ఏదీ తిననట్టు అనిపిస్తుంటుంది.
ఎందుకంటే ఇడ్లీ, దోశ, అన్నం ఇలా.. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి భోజనం వరకు ఇండియన్స్ బియ్యాన్నే తింటారు.కానీ బియ్యం ఎక్కువ రోజులు నిల్వ ఉంటే వాటిలో కీటకాలు, పురుగులు ఏర్పడుతుంటాయి. వీటిని అంత సులువుగా క్లీన్ చేయ్యలేం. అందుకే బియ్యానికి పురుగులు పట్టకుండా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మనలో చాలా మంది బియ్యాన్ని ఒకేసారి ఒకేమొత్తంలో కొని ఇంట్లో నిల్వ చేస్తుంటారు. కానీ దీనివల్ల కొన్ని రోజుల్లోనే బియ్యానికి పురుగులు పడుతుంటాయి. ఈ పురుగులను బియ్యంలోంచి తీసేసి శుభ్రం చేసుకుని తినడం చాలా కష్టంగా ఉంటుంది.
బియ్యంలో ఒక్క పురుగు ఉన్నా అవి వందలుగా, వేలుగా మారుతాయి. ఇంట్లో ఉన్న బియ్యాన్నంతా తింటూ పనికి రాకుండా చేస్తాయి. పురుగుల పట్టిన బియ్యాన్ని తినడం మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఒకవేళ మీరు ఉపయోగించే బియ్యంలో పురుగులు ఉన్నా వాటిని ఎలా తొలగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బియ్యంలో పురుగులు రాకుండా ఉండేందుకు చిట్కాలు:
ఎండలో ఉంచండి:
పురుగులు పట్టిన బియ్యాన్ని వండుకుని తినడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందులో పురుగులు పట్టిన బియ్యం చూడటానికి కూడా అసహ్యంగా అనిపిస్తాయి. అయితే బియ్యంలో పురుగులు లేకుండా చేయాలంటే వాటిని కొద్దిసేపు ఎండలో ఉంచండి. ఎండవల్ల బియ్యంలోని పురుగులు పారిపోతాయి. అయితే ఇది తాత్కాలిక పరిష్కారమే అయినప్పటికీ ఇది బియ్యంలో వెంటనే పురుగులను తరిమికొడుతుంది. ఎండకు బియ్యంలోని పురుగులు చనిపోతే.. బియ్యాన్ని కడుగుతున్నప్పుడు ఈజీగా తొలగిపోతాయి.
వేపాకు:
వేపాకులో ఎన్నో ఔషధ గుణాలుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. వేపాకును తరచుగా ఉపయోగించడం వల్ల మీ శరీరానికి ఎన్నో వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. అయితే ఈ ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు బియ్యంలో పురుగులు పట్టకుండా చేయడానికి కూడా సహాయపడతాయి. వేపాకులను బియ్యంలో ఉంచితే ఆ వాసనకు పురుగులు బియ్యంలోకి అస్సలు రావు. ఉన్నవి కూడా పారిపోతాయి. వేపాకు వేసి బియ్యాన్ని కాసేపు ఎండలో ఉంచితే పురుగులు పారిపోతాయి.
గాలి తగలని పాత్రలు:
మీకు తెలుసా? పురుగులు ఎక్కువగా తేమ ఉన్న ప్రదేశాల్లోనే ఉంటాయి. అందుకే బియ్యాన్ని ఎప్పుడూ కూడా తేమలేని ప్రదేశంలోనే నిల్వ చేయాలి. బియ్యాన్ని గాలి తగలని పాత్రల్లో నిల్వ చేస్తే పురుగులు పట్టే అవకాశమే ఉండదు.
మిరియాలు
బియ్యంలో పురుగులు పట్టకుండా చేయడానికి మిరియాలు కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.కానీ మంచి నాణ్యమైన మిరియాలను వాడితేనే బియ్యానికి పురుగులు పట్టకుండా ఉంటాయి. పూర్వకాలంలో ఈ పద్ధతిని ఎక్కువగా ఫాలో అయ్యేవారు.
లవంగాలు:
లవంగాలతో కూడా మీరు బియ్యంలో ఒక్క పురుగు కూడా లేకుండా చేయొచ్చు. పురుగులు మొత్తమే పట్టకుండా చేయొచ్చు. ఇందుకోసం నిల్వ చేసిన బియ్యంలో 8 నుంచి 9 లవంగాలను వేయండి. బియ్యాన్ని చీకటి, గాలి వెల్లని ప్రదేశంలో ఉంచండి. లవంగాల వాసనకు పురుగులు బియ్యంలోకి వచ్చే సాహసం చేయవు. ఎందుకంటే లవంగాల వాసన పురుగులకు అస్సలు నచ్చదు. లవంగాలు మాత్రమే కాదు వెల్లుల్లి కూడా పురుగులను తరిమికొడుతుంది. బియ్యంలో వెల్లుల్లిని ఉంచినా పురుగులు పట్టవు.
అగ్గిపెట్టే
అగ్గిపుల్లలను ఉపయోగించి కూడా మీరు బియ్యానికి పురుగులు పట్టకుండా చేయొచ్చు. ఇందుకోసం బియ్యాన్ని నిల్వ చేసిన సంచిలో అగ్గిపుల్లలను పెట్టండి. అగ్గిపుల్లకు అతికించిన గంధకం పురుగులను బియ్యంలోకి రాకుండా చేస్తుంది. బియ్యాన్ని వండుకునే ముందు వాటిని వేడి నీటితో శుభ్రంగా కడిగి ఉపయోగించండి. దీనివల్ల అగ్గిపుల్లలోని గంధకం ప్రభావం బియ్యంపై ఉండదు. పురుగుల బాధ కూడా ఉండదు.
బిర్యానీ ఆకులు:
బిర్యానీ ఆకులు ఒక్క వంటలకు మాత్రమే కాదు.. బియ్యంలోని పురుగులను తరిమికొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆకు వాసన పురుగులకు అస్సలు నచ్చదు. నిజానికి లవంగాలు, బిర్యానీ ఆకు వంటి మసాలాల వాసన పురుగులకు నచ్చదు. కాబట్టి బియ్యంలో పురుగులు రాకుండా ఉండాలంటే కొన్ని బిర్యానీ ఆకులను తీసుకుని ముక్కలు ముక్కలుగా కోసి బియ్యం ఉంచిన పాత్రలో వేయండి.