కాఫీ ఎక్కువైందో.. మీ పని అంతే ఇక..
కాఫీని మోతాదుకు మించి తాగితే చర్మ సమస్యలు, మొటిమలు రావడమే కాదు.. చర్మం పొడిబారుతుంది. అలాగే డీ హైడ్రేషన్ బారిన కూడా పడతారు. ముఖ్యంగా కాఫీని ఎక్కువగా తాగితే పెద్ద వయసు వారిగా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు.

కాఫీని తాగనిదే పొద్దున బెడ్ కూడా దిగని వాళ్లు చాలా మందే ఉంటారు. మరికొంత మంది వర్క్ టైంలో గంట లేదా రెండు గంటలకోసారి పక్కాగా కాఫీలను లాగిస్తుంటారు. ఏదైనా మోతాదులో తీసుకుంటే ఎటువంటి నష్టం జరగదు. కానీ పరిమితి మించి తీసుకుంటేనే అసలుకే ఎసరులా తయారువుతుంది.
కాఫీని ఎక్కువగా తాగితే మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంటి నుంచి చర్మం వరకు ఎన్నో సమస్యలను కొనితెచ్చుకున్నట్టేనంటున్నారు.
మోతాదుకు మించి కాఫీని తాగడం వల్ల మెదడుపై చెడు ప్రభావం పడుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. దీనివల్ల మెమోరీ పవర్ తగ్గే అవకాశం 58 శాతం ఉంటుందని తేల్చారు.
అంతేకాదు స్ట్రోక్ ప్రమాదం కూడా ఉందని తెలుపుతున్నారు. ఇవే కాకుండా కాఫీని అధికంగా తాగడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం పదండి..
కాఫీలో ఉండే కెఫిన్ అనే మూలంగా మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది మోతాదులో తీసుకుంటే ఎటువంటి ప్రమాదం లేదు. కానీ ఎక్కువైతేనే మెదడుపై చెడు ప్రభావం పడుతుంది.
ఆకలి తగ్గుతుంది.. కాఫీలో ఉండే కెఫిన్ శరీరంలో కలిసిపోయినప్పుడు శారీరకంగా, మానసికంగా శక్తిని పొందుతాము. దాంతో మనము అలసిపోకుండా పనిచేస్తాము. ఆ సమయంలో మనం అలసిపోయినట్టుగా కూడా తెలియదు. కానీ అదె పనిగా కాఫీని తీసుకుంటే ఒంట్లో కెఫిన్ శాతం పెరిగి ఆకలి పూర్తిగా మందగిస్తుంది. దీంతో మీరు బరువు తగ్గిపోతూ ఉంటారు.
నిద్రకూడా సరిగ్గా పట్టదు. అంతేకాదు మన ఒంట్లో నుంచి మూత్రం విసర్జన ఎక్కుగా జరుగుతుంది. దీంతో మీ శరీరంలో నీటి కొరత ఏర్పడి డీహైడ్రేషన్ బారిన పడతారు.
అంతేకాదు కెఫిన్ వల్ల ఒంట్లో శక్తి పెరగడం ఏ మాత్రం మంచిదికాదు. దీనివల్ల రక్తపోటు సమస్య రావొచ్చు. కాబట్టి హైబీపీ సమస్య ఉన్న వాళ్లు కాఫీని ఎక్కువగా తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కాఫీని ఎక్కువగా తాగితే.. డీహైడ్రేషన్ సమస్య బారిన పడాల్సి వస్తుంది. అంతేకాదు కెఫిన్ వల్ల చర్మం పొడిబారుతుంది. ముఖంపై మొటిమలు కూడా వస్తాయి. అలాగే చిన్నవయసైనా పెద్దవారిలా కనిపిస్తారు.
కాఫీనీ ఎక్కువగా తాగితే మెదడు, దానిచుట్టూ ఉన్న రక్తనాళాలు సంకోచం చెందుతాయి. ఒకవేళ మీరు రోజు తాగే సమయానికి కాఫీ తాగకపోతే వెంటనే తలనొప్పి స్టార్ట్ అవుతుందంటున్నారు నిపుణులు. ఈ తలనొప్పి కాస్త మైగ్రేన్ కు దారితీస్తుందట. ఇక తలనొప్పిగా అనిపించినప్పుడల్లా కాఫీని తాగుకుంటూ పోతే మీరు కాఫీకి బానిస అయిపోతారు.
అతిగా కాఫీ తాగేవారిలో షుగర్ లెవెల్స్ పెరగడం, చేతులు వణకడం, కండరాల తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కెఫిన్ వల్ల రక్తపోటు సమస్య తలెత్తితే కంటి సమస్యలు కూడా వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు కొంతమందిలో అయితే కెఫిన్ వల్ల కంటి రెటీనా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.