ఆ దేశాల్లో అత్యాచారం చేస్తే తల తీసేస్తారు. విషపు ఇంజెక్షన్లు ఇస్తారు: ఎక్కడో తెలుసా
భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అత్యాచారం చేస్తే నేరస్థులకు మరణశిక్ష విధిస్తున్నారు. కొన్ని దేశాల్లో ఈ శిక్ష అమలు చేసే విధానం చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి దేశాల వివరాలు, శిక్షల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
చౌరస్తాలో శిరచ్ఛేదం...
సౌదీ అరేబియాలో శిక్ష అమలు చాలా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ షరియా చట్టం అమలులో ఉంది. ఇస్లామిక్ చట్టాలను అనుసరించే ఈ దేశంలో అత్యాచారం, హత్య వంటి నేరాలకు ఇక్కడ మరణశిక్ష విధిస్తారు. నేరస్థుడిని బహిరంగంగా చౌరస్తాలో శిరచ్ఛేదం చేస్తారు. అంతేకాదు నిందితుడికి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది.
ఇరాన్‌లో కూడా మరణశిక్ష
ఇరాన్‌లో కూడా ఇస్లామిక్ చట్టాల ప్రకారం అత్యాచార నేరస్థులకు శిక్ష విధిస్తారు. ఇక్కడ బహిరంగంగా ఉరి తీయరు. అయితే జైలులోనే ఉరితీస్తారు. ఇరాన్‌లో చట్టపరమైన పారదర్శకతపై ప్రపంచ దేశాల నుంచి నిరంతరం విమర్శలు వస్తున్నాయి.
పాకిస్తాన్‌లో కూడా ఉరిశిక్ష
పాకిస్తాన్ కూడా 2020లో తన చట్టాలను సవరించింది. అత్యాచార నేరస్థులకు ఇక్కడ ఉరిశిక్ష విధించేలా చర్యలు తీసుకుంది. ముఖ్యంగా సామూహిక అత్యాచారం, మైనర్లపై అత్యాచారం వంటి కేసుల్లో మరణశిక్ష కచ్చితంగా అమలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో నిందితులకు రసాయనాల ద్వారా అంగచ్ఛేదం కూడా చేస్తారు.
ప్రజా ఉద్యమాలతో బంగ్లాదేశ్‌లో మరణశిక్ష
బంగ్లాదేశ్ 2020లో మహిళలు, పిల్లలపై అత్యాచారాల నిరోధక (సవరణ) బిల్లును ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం అత్యాచార నేరస్థులకు మరణశిక్ష విధించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ జీవిత ఖైదు శిక్షే ఎక్కువగా విధిస్తున్నారు.
ఈజిప్ట్‌లో మైనర్లపై అత్యాచారానికి మరణశిక్ష
ఈజిప్ట్‌లో మైనర్‌పై అత్యాచారం చేయడం, కిడ్నాప్ చేసి అత్యాచారం చేయడం చేస్తే నేరస్థుడికి మరణశిక్ష విధిస్తారు. ఈజిప్ట్‌లో షరియా సూత్రాలతో పాటు సివిల్ చట్టాలు కూడా అమలులో ఉన్నాయి. అయితే మరణశిక్ష కూడా ఇక్కడ అమలులో ఉంది.
నిర్భయ కేసు తర్వాత భారత్‌లోనూ ఉరిశిక్ష
నిర్భయ కేసు తర్వాత భారతదేశంలో కఠిన చట్టాలు వచ్చాయి. 2018లో భారత శిక్షా స్మృతిని సవరించారు. 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చారు. అయితే భారతదేశంలో అత్యాచారానికి మరణశిక్ష అరుదుగానే విధిస్తున్నారు.
యుఏఈలో కఠిన చట్టాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ)లో అత్యాచార నేరానికి శిక్ష చాలా కఠినంగా, భయంకరంగా ఉంటుంది. ముఖ్యంగా మైనర్‌పై అత్యాచారం జరిగితే దానిని మరింత తీవ్రంగా పరిగణిస్తారు. ఇక్కడ అత్యాచార నేరస్థులకు మరణశిక్ష విధిస్తారు. వారిని ఉరితీయడం లేదా బహిరంగంగా కాల్చివేయడం చేస్తారు.
చైనాలో విష ఇంజెక్షన్‌తో మరణం
చైనాలో అత్యాచారాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఇక్కడ కూడా అత్యాచార నేరస్థులకు మరణశిక్ష విధిస్తారు. వారిని కాల్చివేయడం లేదా విష ఇంజెక్షన్ ఇచ్చి చంపుతారు.