ఆకాశంలో అద్భుతమైన ఉల్కాపాతం.. ఈ నెలలోనే ఎప్పుడో తెలుసా?
తోకచుక్కలు(comets) విశ్వంలో ఒక అద్భుతం. వీటి గురించి వినే ఉంటారు. ఇవి నిరంతరం మండుతూ విశ్వంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉండే అగ్ని గోళాలు. వీటి వెనుక నిప్పు రవ్వలతో ఉండే భారీ తోక ఉంటుంది. అందులోని నిప్పు రవ్వలు తరచూ దాని నుంచి విడిపోయి భూమి వాతావరణంలోకి వస్తుంటాయి. నిరంతరం మండుతూ ఉండే ఆ రాళ్లు భూ వాతావరణంలోకి వచ్చాక పేలిపోతాయి. భూమిపై చెల్లాచెదురుగా పడతాయి. దానినే ఉల్కాపాతం(Meteor Shower) అంటారు. అలాంటి వాటిలో ఒక అద్భుతమైన పెర్సీడ్ ఉల్కాపాతం(Perseid Meteor Shower) ఈ నెలలో మనం చూడబోతున్నాం. ఖగోళ సంఘటనల్లో ఇది ఒక అద్భుతం. అదెప్పుడో తెలుసుకుందాం రండి.
గంటకు సుమారు 100 ఉల్కలు..
పెర్సీడ్ తోకచుక్క ఇప్పుడు భూమికి దగ్గరగా వెళ్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ఇది సంభవిస్తూ ఉంటుంది. భూ వాతావరణంలోకి వచ్చినప్పుడు ఉల్కలు పేలిపోయి ఉల్కాపాతం ఏర్పడుతుంది. గంటకు సుమారు 100 వరకు ఉల్కలు ఏర్పడతాయి.
పెర్సీడ్ ఉల్కాపాతం విశిష్టత ఏమిటంటే..
పెర్సీడ్ ఉల్కాపాతం చాలా కాంతివంతమైనది. వేగంగా కదిలే ఉల్కలను సృష్టిస్తుంది. ఒక్కోసారి మండుతూ ఉండే రాళ్లను కలిగి ఉంటుంది. ఈ ఉల్కలను చూసేందుకు టెలిస్కోపులు, బైనాక్యులర్లు ఉపయోగించాల్సిన అవసరం లేదు. కాలుష్యం ఉన్న ప్రాంతాల్లోనూ పెర్సీడ్ ఉల్కాపాతం కనిపిస్తుంది.
పురాణ కథనం ఏమిటంటే..
పెర్సీడ్ ఉల్కాపాతం గ్రీకు పురాణాలతో ముడిపడి ఉంది. బంగారపు వర్షం కురుస్తున్న సమయంలో పెర్సీయస్ తల్లి అయిన ‘డానా’ను ‘జ్యూస్’ దర్శిస్తుందని గ్రీకు ప్రజలు నమ్ముతారు.
ఎప్పుడు చూడొచ్చంటే..
పెర్సీడ్ ఉల్కాపాతం ఆగస్టు 12న భూమికి దగ్గరగా రావడం మొదలవుతుంది. ఆగస్టు 13న గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఈ తోకచుక్క నుంచి రాలిపడే ఉల్కలను చూడవచ్చు. పట్టణాల కంటే పల్లెల్లో రాత్రివేళ చీకటి వాతావరణం ఉంటుంది. అక్కడైతే.. ఈ ఉల్కలు బాగా కనిపిస్తాయి.