ఒక్క కాల్ చేసుకుంటానంటే అపరిచితులకు మీ ఫోన్ ఇస్తున్నారా? మీ డబ్బులు పోయినట్టే..
మీకు హెల్పింగ్ నేచర్ ఎక్కువా? ఒక్క ఫోన్ చేసుకుంటానని ఎవరైనా ఫోన్ అడిగితే వెంటనే ఫోన్ ఇస్తున్నారా? చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లోనే ఆన్ లైన్ ఫ్రాడ్స్ చేసి అకౌంట్స్ లో డబ్బులు దోచేస్తున్నారు. అందరూ అలా ఉంటారని కాదు. కాని మంచితనానికి రోజులు లేవు అన్న సామెతను ఇలాంటి సంఘటనలు నిజం చేస్తున్నాయి. అసలు కాల్ చేయడానికి ఫోన్ తీసుకున్న వారు అకౌంట్ లో డబ్బులు ఎలా కొట్టేస్తున్నారో, ఇలాంటి మోసాలను ఎలా ఆపాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
సాధారణంగా మీరు ఏదైనా ఊరు వెళ్లడానికి బస్టాండ్, రైల్వే స్టేషన్ వంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు కొందరు చాలా అమాయకంగా పేస్ పెట్టుకొని మీ దగ్గరకు వచ్చి ఫోన్ అడుగుతారు. ఫోన్ ఇంటిలో మర్చిపోయానని, ఒకసారి ఫోన్ చేసుకుంటానని అడుగుతారు. జాలి పడి ఇచ్చారా.. మీ ఫోన్ లో ఉన్న బ్యాంకు సంబంధించిన డిటైల్స్, మెసేజ్ లను దొంగతనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇవే కాకుండా దారి ఖర్చుకు డబ్బులు లేవని, భోజనం చేయడానికి సహకరించండి అని కొందరు వ్యక్తులు రిక్వస్టింగ్ గా అడుగుతారు. మీకు శక్తి ఉంటే దానం చేయొచ్చు. లేదా ఇవ్వలేమని చెప్పొచ్చు. అయితే ఫోన్ ఇచ్చే విషయంలో కూడా చాలా మంది ఏం ఆలోచిస్తరాంటే.. ఒక్క ఫోన్ కాల్ మాట్లాడితే ఏం ఖర్చు అవుతుందిలే అనుకొని ఫోన్ ఇస్తారు.
ఇక్కడే మీరు మోసపోవడానికి సిద్ధమవుతున్నట్లు లెక్క. ఎందుకంటే మీ ఫోన్ ఒకసారి తెలియని వ్యక్తికి ఇస్తే బ్యాంకు అకౌంట్స్ ఖాళీ చేసి తిరిగి ఇస్తున్నారు. అమ్మకు ఆరోగ్యం బాగోలేదని, అర్జెంట్ గా తన ఫ్యామిలీ మెంబర్స్ తో ఒక్క కాల్ చేసి మాట్లాడతానని అడుగుతారు. ఇలాంటి సందర్భంలోనే ఆన్ లైన్ మోసం ఎలా జరుగుతుందో ఇక్కడ డిటైల్ గా తెలుసుకుందాం.
ఇటీవల బెంగళూరులో గుర్తు తెలియని ఓ వ్యక్తి ఓ కిరాణా దుకాణానికి వెళ్లాడు. తన ఫోన్ ఇంటిలో మర్చిపోయానని, ఒకసారి మీ ఫోన్ ఇస్తే కాల్ చేసి జాగ్రత్త చేయమని తన వైఫ్ కి చెబుతానని షాప్ ఓనర్ ను రిక్వస్ట్ చేశాడు. అర్జెంట్ ఏమో అనుకొని ఆయన ఫోన్ ఇవ్వడంతో పక్కకు వెళ్లి రెండు నిమిషాల తర్వాత వచ్చాడు. ఫోన్ ఇచ్చేసి థ్యాంక్యూ చెప్పేసి వెళ్లిపోయాడు. ఒక అరగంట తర్వాత షాప్ ఓనర్ ఫోన్ కు మెసేజ్ వచ్చింది. రూ.99 వేలు మీ అకౌంట్ లోంచి కట్ అయ్యాయని దాని అర్థం.
ఆ మెసేజ్ చూడగానే షాప్ ఓనర్ విపరీతంగా టెన్షన్ పడ్డాడు. ఎన్ క్వైరీ చేస్తే ఫోన్ మాట్లాడిన వ్యక్తి చేసిన పని ఇది అర్థం చేసుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కాల్ చేస్తానని ఫోన్ తీసుకున్న వ్యక్తి షాప్ ఓనర్ ఫోన్ లో కాల్ ఫార్వడింగ్ ఆప్షన్ లో తన ఫోన్ నంబర్ ఎంటర్ చేశాడు. తర్వాత ఫోన్ లోనే ఉన్న బ్యాంకు డీటైల్స్ కాపీ చేసి దొంగిలించాడు. బ్యాంకు డీటైల్స్ ఉపయోగించి అమౌంట్ విత్ డ్రా చేయడానికి ట్రై చేశాడు. సెక్యూరిటీ చెకింగ్ కింద బ్యాంకు ఓటీపీ పంపింది. కాల్ ఫార్వడ్ ఆప్షన్ వల్ల ఓటీపీ మెసేజ్ ఫ్రాడ్ చేసిన వ్యక్తి ఫోన్ కు వచ్చింది. దీంతో అకౌంట్లో రూ.99 వేలు దొంగతనం చేశాడు.
ఇలాంటి కాల్ ఫార్వడింగ్ స్కామ్ ల బారిన మీరు కూడా పడకుండా ఉండాలంటే అర్జెంట్ గా మీ ఫోన్ లో కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలి. అవేంటంటే..
మీ మొబైల్ లో *#21# డయల్ చేయండి. దీని వల్ల కాల్ ఫార్వడింగ్ ఆప్షన్ ఆన్ లో ఉందో లేదో తెలుస్తుంది.
డిజబుల్డ్ అని వస్తే మీరు సేఫ్ గా ఉన్నట్లే.
ఒకవేళ కాల్ ఫార్వర్డ్ అని వస్తే వెంటనే మీరు ##002# అని డయల్ చేయండి. దీని వల్ల అన్ని కాల్ ఫార్వర్డ్, మెసేజ్ ఫార్వడింగ్ ఆప్షన్స్ అన్నీ డిజబుల్డ్ అయిపోతాయి. దీంతో మీరు, మీ ఫోన్ కూడా సెక్యూర్ గా ఉండొచ్చు. ఇలాంటి మోసాల నుంచి జాగ్రత్తగా ఉండండి.
అందరూ మోసాలు, దొంగతనం చేసే వారు ఉండరు. మరి సాయం అడిగిన వారికి సాయం చేయకపోతే సమాజంపై నమ్మకం పోతుంది. సాయం చేసినప్పుడు ఇలాంటి ఆన్ లైన్ మోసాలు జరగకుండా ఉండాలంటే మీ ఫోన్ ఇచ్చి మీ ముందే ఫోన్ మాట్లాడమని చెప్పండి. కుదిరితే మీరే ఫోన్ పట్టుకొని లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడమని చెప్పండి. నిజంగా సాయం కోరిన వారైతే మీరు ఎలాంటి రూల్స్ పెట్టినా అవసరం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడే మీకు విషయం అర్థం అవుతుంది. ఆన్ లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి.