Walking Benefits: తిన్న తర్వాత నడిస్తే ఇన్ని లాభాలున్నాయా..!
Walking Benefits: తిన్న తర్వాత అలాగే కూర్చోకూడదని.. కాసేపు అలా అలా నడుస్తూ ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇంతకి అలా నడిస్తే ఏమౌతుందో తెలుసా..

Walking Benefits: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి తన ఆరోగ్యాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తీరికలేని పనుల వల్ల ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఉదయం అలా తింటారో లేదో అప్పుడే పనిలో పడిపోతుంటారు. మధ్యాహ్నం సంగతి కూడా ఇలాగే ఉంటుంది. ఇక రాత్రైందంటే చాలు ఇంత తిని పడుకుంటారు.
తిన్న వెంటనే ఇలా పడుకోవడం అస్సలు మంచిది కాదు. తిన్న తర్వాత కాసేపు నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి తిన్న తర్వాత నడిస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.. భోజనం చేసిన తర్వాత కాసేపు నడిస్తే అతని రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రించబడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఊబకాయం తగ్గుతుంది.. ఊబకాయం లేదా శరీరంలో అధిక కొవ్వుతో బాధపడేవారు భోజనం చేసిన తర్వాత ఒక గంట లేదా అరగంట పాటు నడవడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇలా నడిస్తే శరీరంలోని ఎక్స్ ట్రా కొవ్వులు తగ్గుతాయట.
నిద్రలేమికి చెక్.. ప్రస్తుత కాలంలో నిద్రలేమి సమస్యతో బాధపడేవారి సంఖ్య బాగా పెరిగింది. అయితే ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారు ప్రతిరోజూ తిన్న వెంటనే అరగంట సేపు నడవడం వల్ల నిద్ర బాగా పడుతుందట. అంతేకాదు దీనివల్ల నిద్రలేమి సమస్యకు పూర్తిగా చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.
మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.. శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే తిన్న తర్వాత కాసేపు నడవాలంటున్నారు నిపుణులు. మానసిక ఆరోగ్యం జీవక్రియను పెంచడానికి ఎంతో సహాయపడుతుంది.
మలబద్దకం తగ్గుతుంది.. తిన్న తర్వాత నడిచే వారిలో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు మలబద్దకం సమస్యలు కూడా తగ్గిపోతాయి.
రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.. భోజనం చేసిన వెంటనే కాసేపు నడవడం వల్ల శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది. అంతేకాదు మన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.