పన్ను నొప్పి అని ఆసుపత్రికి వెళ్లగా.. ప్రొస్టేట్ క్యాన్సర్ అని తేలింది. అసలేం జరిగిందంటే..
క్యాన్సర్ మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా వేలాది మంది క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు. ఇక శరీరంలో క్యాన్సర్ మొదలైందన్న విషయాన్ని కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే పంటి నొప్పి క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చని మీకు తెలుసా? తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది..
పంటి నొప్పి క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.? అవును నిజమే పంటి నొప్పి పురుషుల్లో క్యాన్సర్‌కు ప్రాథమిక లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఈ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 78 ఏళ్ల ఆరోగ్యవంతమైన ఓ వ్యక్తి ఎడమవైపు దిగువ దవడలో పంటి నొప్పి, పన్ను కదలడం వంటి సమస్యతో బాధపడ్డాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన అతను ఓ దంత వైద్యుడుని సంప్రదించాడు.
బాధితుడిని చూసిన వైద్యులు నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభించాలంటే పన్నును తొలగించడమే ఉత్తమ పరిష్కారమని తెలిపారు. దీంతో వెంటనే ఊగుతున్న పన్నును తొలగించాడు. అయితే పన్నును తీసిన తర్వాత దవడలో వాపు కనిపించడం ప్రారంభమైంది. కొన్ని రోజుల తర్వాత తిరిగి నొప్పి రావడంతో మళ్లీ వైద్యుడుని సంప్రదించాడు. దీంతో సిటీ స్కాన్ చేయగా దవడలో గాయం ఉందని, అది మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణమని వైద్యులు తేల్చి చెప్పారు.
పురుషుల్లో వచ్చే ఈ క్యాన్సర్ జననేంద్రియాల్లో వస్తుంది. ప్రోస్టేట్ గ్రంధిలో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు సైతం వ్యాపిస్తుంది. ఇలా వ్యాపించడాన్ని మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారు. ఇతర క్యాన్సర్ల మాదిరిగానే ప్రొస్టేట్ క్యాన్సర్ దవడకు వ్యాపించే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. దవడ ఎముకకు సమృద్ధిగా రక్త సరఫరా, క్రియాశీల ఎముక మజ్జ ఉండడం కారణంగా మెటాస్టాటిక్ క్యాన్సర్ కణాలు ఏర్పడటానికి, పెరగడానికి ఇది అనుకూలమైన ప్రదేశంగా మారుతుందని అంటున్నారు.
అయితే దవడంలో మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా అరుదుగా సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ విస్తృతంగా వ్యాపిస్తోందని చెప్పేందుకు ఇది సంకేతంగా భావించాలి. ఈ లక్షణం తర్వాత చికిత్సలో ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుందని అంటున్నారు.
లక్షణాలు..
దవడలో నిరంతర వాపు, నొప్పి, స్పష్టమైన కారణం లేకుండా దంతాలు వదులుగా మారడం లేదా దంతాలను తొలగించిన తర్వాత వాపు రావడం వంటివి మెటాస్టాటిక్ క్యాన్సర్ ప్రాథమిక లక్షణాలుగా నిపుణులు చెబుతున్నారు. అలాగే దవడలో తిమ్మిరి లేదా జలదరింపు లాంటి లక్షణాలు కనిపించినా ఇది నరాల సంబంధిత సమస్యకు సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.
కాగా ప్రోస్టేట్ క్యాన్సర్ కారణంగా ఏటా ఏకంగా 4 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 40 ఏళ్లు దాటిన పురుషుల్లో ఎక్కువగా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, స్మోకింగ్, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండడం వల్ల ఈ సమస్య బారిన పడకుండా తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.