ఏం తింటే గుండెపోటు వస్తుందో తెలుసా?
ప్రస్తుత కాలంలో చిన్న చిన్న పిల్లలకు కూడా హార్ట్ ఎటాక్ వస్తోంది. ఒకప్పుడు ఇది కేవలం వృద్ధులకే మాత్రమే వచ్చే సమస్యగా భావించేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారింది. ఇలా ఎందుకు అయ్యిందో తెలుసా?
heart attack
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. నేడు చిన్న వయసు వారికి కూడా గుండెపోటు వస్తోంది. అనారోగ్యకరమైన జీవనశైలే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలు గుండె జబ్బులకు కారణమవుతాయి. గుండెపోటును ప్రేరేపిస్తాయి. అంతేకాదు ఇవి ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులకు కూడా దారితీస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఉప్పు
ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య వస్తుంది. ఇదే గుండెపోటుకు అసలు కారణం. ఉప్పు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ లో ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే మీకు గుండెపోటుతో పాటుగా ఇతర గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే వీటిని మీ ఆహారంలో చేర్చకండి. మీ రోజువారి ఆహారంలో ఉప్పు మొత్తాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయంగా కొన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలను ఉపయోగించండి.
ప్రోటీన్ ఫుడ్
ప్రతి ఒక్కరి శరీరానికి ప్రోటీన్లు అవసరం. అలాగని ప్రోటీన్ ఫుడ్ ను మరీ ఎక్కువగా తినకూడదు. దీనివల్ల మూత్రపిండాల సమస్యలు వస్తాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే మాంసం, చేపలు, పౌల్ట్రీ, పాల ఉత్పత్తులను లిమిట్ లో మాత్రమే తినండి. వీటికి బదులుగా మీరు కాయధాన్యాలు, బీన్స్, టోఫు వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్ ఫుడ్ ను తినొచ్చు. ఇవి మీ శరీరానికి అవసరమైన ప్రోటీన్ ను అందించడమే కాకుండా.. మిమ్మల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి.
చక్కెర
చక్కెర ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు లేనిపోని సమస్యలు వస్తాయి. ఇది మీ శరీర బరువును పెంచుతుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్ వచ్చేలా చేస్తుంది. ఇది గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకాలలో ఒకటి. స్వీట్లు, సోడా, పేస్ట్రీలు, ఇతర తీపి పదార్థాలు ఎంత టేస్టీగా ఉన్నా.. వాటిని ఎక్కువగా తిన్నారంటే లేనిపోని సమస్యలను కొని తెచ్చకున్న వారవుతారు. అందుకే వీటిని లిమిట్ లోనే తినండి. తీపి కోరికలను తగ్గించడానికి ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లను తినండి. ఇవి మీ హెల్త్ ను కాపాడుతాయి.
సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్స్
సంతృప్త, ట్రాన్స్ కొవ్వులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను బాగా పెంచుతాయి. ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగితే మీకు గుండె జబ్బులొచ్చే ప్రమాదం చాలా వరకు పెరుగుతుంది. అందుకే రెడ్ మీట్ , పూర్తి కొవ్వు పాల ఉత్పత్తులు, హైడ్రోజనేటెడ్ నూనెతో తయారైన ఆహార పదార్థాలను తీసుకోవడం తగ్గించాలని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. మీరు వీటికి బదులుగా బాదం, వాల్నట్స్, ఆలివ్ ఆయిల్, అవొకాడో వంటి మోనోశాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు ఉన్న ఆహార పదార్థాలను తినండి.
బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం
తరచుగా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేసే అలవాటు మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను అసమతుల్యంగా చేస్తుంది. అలాగే మీకు గుండె సంబంధిత వ్యాధులొచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అదే మీరు ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తింటే మీరు రోజంతా శక్తివంతంగా ఉండటమే కాకుండా.. పగటిపూట అతిగా తినకుండా కూడా ఉంటారు. ఇది మీరు బరువు పెరగడాన్ని తగ్గిస్తుంది.