వ్యాక్సిన్ లేకుండానే కరోనా కట్టడికి కొత్త డ్రగ్: చైనా శాస్త్రవేత్తలు
కరోనా వైరస్ ను నిరోధించేందుకు సాగుతున్న పరిశోధనల్లో చైనా అడుగును ముందుకేసింది. వ్యాక్సిన్ లేకుండానే డ్రగ్ ను అభివృద్ధి చేసినట్టుగా చైనా తెలిపింది.
కరోనాను కట్టడి చేసేందుకు ఔషధాన్ని అభివృద్ధి చేస్తున్నట్టుగా చైనీస్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ డ్రగ్ కరోనా రోగులపై సత్పలితాలు ఇస్తోందని చైనీస్ శాస్త్రవేత్తలు తెలిపారు.
కరోనా వైరస్ ను నిరోధించేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నాయి. కరోనాను అరికట్టేందుకు గాను పలు రకాల ప్రయత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని సంస్థలు తమ ప్రయోగాలు సత్పలితాలతో ముందుకు సాగుతున్నట్టుగా ప్రకటించాయి.
చైనాలోని ప్రతిష్టాత్మక పెకింగ్ యూనివర్శిటీలో ఈ డ్రగ్ ను పరీక్షించినట్టుగా చైనా ప్రకటించింది. గత ఏడాది చివరలో చైనాలోని వుహాన్ లో కరోనా వైరస్ ను స్థానిక వైద్యులు గుర్తించారు.
కరోనా వైరస్ కు ద్రవ రూపంలో కాకుండా టాబ్లెట్ రూపంలో మందు కనిపెట్టేందుకు పరిశోధనలు సాగిస్తున్నట్టుగా చైనా ప్రకటించింది. జంతువులపై తాము చేసిన ప్రయోగాలు ఫలించినట్టుగా బీజింగ్ అడ్వాన్స్ డ్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ జెనోమిక్స్ డైరెక్టర్ సన్నీ షీ ప్రకటించారు.
కరోనా వైరస్ సోకిన ఎలుకలకు న్యూట్రలైజింగ్ యాంటీ బాడీస్ ఎక్కించినట్టుగా చెప్పారు. ఐదు రోజుల తర్వాత కరోనా వైరస్ ప్రభావం 2500 యూనిట్లకు పడిపోయిందని తమ పరిశోధనల్లో తేలిందన్నారు. ఈ డ్రగ్ ను కరోనా చికిత్స విధానంలో ఉపయోగించుకోవచ్చని ప్రకటించారు.
కరోనా వైరస్ సోకిన 60 మంది పేషెంట్ల నుండి యాంటీబాడీలు సేకరించామని వాటి ఆధారంగా డ్రగ్ ను అభివృద్ధి చేశామని సన్నీ ప్రకటించారు. క్లినికల్ ట్రయల్స్ జరిపి వచ్చే ఏడాది వరకు దీనిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా వెల్లడించారు.
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు న్యూట్రలైజ్డ్ యాంటీబాడీస్ ప్రత్యేకమైన డ్రగ్ లా ఉపయోగపడుతుందని భావిస్తున్నామన్నారు. కరోనా నుండి కోలుకొన్న ప్లాస్మా విధానంతో చాలా మంది పేషెంట్లు కోలుకొంటున్నారని అయితే మొత్తంలో ప్లాస్మా అందుబాటులో లేనందున డ్రగ్ వాడకం ఉపయోగకరంగా ఉంటుందని సన్నీ తెలిపారు.
ప్రభావంతమైన ఔషధాన్ని తయారు చేయడం ద్వారా వ్యాక్సిన్ లేకుండానే కరోనా వైరస్ ను వ్యాప్తి చేయకుండా దోహదం చేసే అవకాశం ఉందని చైనా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.