Cristiano Ronaldo: రొనాల్డో పై రేప్ కేసు.. కీలక తీర్పు వెల్లడించిన కోర్టు
Cristiano Ronaldo Rape Case: సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తనను రేప్ చేసినట్టు పదకొండేండ్ల క్రితం యూఎస్ లోని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది.
ఫుట్బాల్ గురించి అవగాహన ఉన్నవారికెవరికైనా మాంచెస్టర్ యూనైటైడ్ ఫుట్బాల్ స్టార్, పోర్చుగల్ జట్టు కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో పేరు తెలియని వారుండరు. ఆటలో ఎన్నో ఘనతలను సాధించిన ఈ సాకర్ దిగ్గజం ఆటపరంగా క్లీన్ గా ఉన్నా అతడిని చాలా కాలంగా ఓ రేప్ కేసు వేధిస్తున్నది.
2009 లో లాస్ వెగాస్ లోని ఓ హోటల్ లో తనపై రొనాల్డో అత్యాచారం చేశాడని కేత్రిన్ మోయెర్గా అనే మహిళ స్థానిక కోర్టులో కేసు వేసింది. పదేండ్లుగా ఈ కేసులో విచారణ సాగుతున్నది.
పదేండ్ల సుదీర్ఘ విచారణ అనంతరం లాస్ వెగాస్ కోర్టు ఈ కేసులో తీర్పు వెల్లడించింది. బాధితురాలు తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఈ కేసుకు సంబంధించిన సరైన ఆధారాలను ప్రవేశపెట్టలేకపోయాడని తెలిపింది.
42 పేజీల తీర్పు కాపీలో ఈ విషయాన్ని వెలువరిస్తూ.. కేసును కొట్టివేస్తున్నట్టు వెల్లడించింది. దీంతో రొనాల్డోకు భారీ ఊరట లభించింది. కేసును కొట్టివేయడమే గాక మళ్లీ దాఖలు చేయడానికి వీళ్లేకుండా ఆదేశాలు జారీ చేసింది.
ఇక ఆటపరంగా చూస్తే పోర్చుగల్ జట్టుకు సారథ్యం వహిస్తున్న రొనాల్డో.. ఈ ఏడాది ఖతర్ వేదికగా జరుగనున్న ఫుట్బాల్ ప్రపంచకప్ లో ఆడనున్నాడు. కొద్దిరోజుల క్రితం అర్హత ప్రక్రియలో భాగంగా మ్యాచులలో పోర్చుగల్ క్వాలిఫై అయింది. 2022 ఫిఫా వరల్డ్ కప్.. రొనాల్డో కెరీర్ లో ఆఖరుదని భావిస్తున్న తరుణంలో అతడు తన జట్టును విజేతగా నిలపాలని కోరుకుంటున్నాడు.