కోర్టు మెట్లు ఎక్కిన మహానటి సావిత్రి, అదో తీరని అవమానం, ఇంతకీ ఏం జరిగింది?
మహానటి సావిత్రి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కోర్టు రూమ్ లో ఆమె కొంత సమయం నిందుతురాలిగా కూర్చోవాల్సి వచ్చింది. ఈ ఘటన ఆమెను కలచి వేసింది.
Savitri
సావిత్రి సౌత్ ఇండియాను ఏలిన లెజెండరీ హీరోయిన్. తరాలు మారినా ఆమెను సినిమా ప్రేమికులు మర్చిపోరు. తెలుగు అమ్మాయి అయిన సావిత్రి నాటకాలు ఆడేవారు. అదే ఆమెను చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టేలా చేసింది. సావిత్రి పెదనాన్న ఆమెకు నృత్యంలో శిక్షణ ఇప్పించాడు.
Savitri
పెదనాన్నతో పాటు మద్రాస్ వెళ్లిన సావిత్రి సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టింది. మరీ చిన్న వయసు కావడంతో మొదట్లో ఆమెకు ఆఫర్స్ రాలేదు. పాతాళ భైరవి చిత్రంలో చిన్న పాత్ర చేసింది. 1952లో సావిత్రికి ఫిమేల్ లీడ్ రోల్ చేసే అవకాశం దక్కింది. పెళ్లి చేసి చూడు చిత్రంలో ఎన్టీఆర్ కి జంటగా నటించింది. ఆ మూవీ కమర్షియల్ గా కూడా హిట్ అయ్యింది.
దేవదాసు మూవీతో సావిత్రి ఫేమ్ రాబట్టింది. నాగేశ్వరరావు హీరోగా నటించిన ఈ ట్రాజిక్ లవ్ డ్రామా బ్లాక్ బస్టర్ అందుకుంది. ఏఎన్నార్, సావిత్రి చాలా గొప్పగా నటించారు. ఇక మిస్సమ్మ చిత్రంలో సావిత్రి చేసిన మేరీ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది. మిస్సమ్మ మూవీ ఒక విధంగా లేడీ ఓరియెంటెడ్ మూవీలా ఉంటుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఉన్నప్పటికీ సావిత్రి పాత్ర డామినేషన్ ఎక్కువగా ఉంటుంది.
మాయాబజార్ మూవీలో సావిత్రి శశిరేఖ పాత్ర చేసింది. ఆ పాత్రలో సావిత్రి నటనకు సౌత్ ఇండియన్ ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యారు. ఒక దశలో సావిత్రి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్. ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు కూడా అంత ఇచ్చేవారు కాదు. సావిత్రికి అంత డిమాండ్ ఉండేది. ఈ క్రమంలో భారీగా ఆస్తులు ఆమె ఆర్జించారు.
మద్రాస్ లో పెద్ద భవంతి నిర్మించుకున్నారు. గృహప్రవేశానికి తెలుగు, తమిళ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులందరినీ సావిత్రి ఆహ్వానించారు. నగలు, పట్టు చీరలు , సిరి సంపదలతో సావిత్రి తుల తూగింది. అదే సమయంలో అధిక సంపాదన ఆమె కొంప ముంచింది. ఆదాయపన్ను వంటి విషయాలపై పెద్దగా అవగాహన లేని సావిత్రి చట్టపరమైన సమస్యలు ఎదుర్కొన్నారు. ఆమె కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.
సావిత్రి సకాలంలో ఆదాయ పన్ను చెల్లించకపోవడంతో ప్రభుత్వం ఆమెకు నోటీసులు పంపింది. ఈ క్రమంలో సావిత్రి నేరుగా కోర్టుకు హాజరు కావాల్సి వచ్చిందట. కోర్ట్ రూమ్ లో అరగంటకు పైగా సావిత్రి కూర్చోవాల్సి వచ్చిందట. సావిత్రి అవమానంతో కుంగిపోయారట. తనలాంటి దుస్థితి మరొకరికి రాకూడదని ఆమె ఆ సమయంలో అనుకున్నారట.
సావిత్రి దాన గుణం కూడా ఆమె పతనానికి దారి తీసింది. దగ్గరకు చేరి ఆమె డబ్బులు దోచుకున్నవారు కొందరు ఉన్నారు. అదే సమయంలో దేహి అని వచ్చిన వారికి కాదనకుండా సావిత్రి సహాయం చేసేవారట. నిర్మాత మారడం కూడా సావిత్రిని ఆర్థికంగా కృంగదీసింది. ఎంతో వైభవం చూసిన సావిత్రి చివరి రోజుల్లో కఠిన పరిస్థితులు చూశారు.
80ల నాటికి ఆమెకు స్టార్డం లేదు. సపోర్టింగ్ రోల్స్ చేసేవారు. అనారోగ్యం బారిన పడిన సావిత్రి 19 నెలలు కోమాలో ఉన్నారు. అనంతరం 1981లో డిసెంబర్ 26న కన్నుమూశారు. సాదాసీదాగా సావిత్రి అంత్యక్రియలు ముగిశాయి. దేవుడు మావయ్య ఆమె చివరి చిత్రం.
సావిత్రి బయోపిక్ మహానటి టైటిల్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. 2018లో విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ కొట్టింది. సావిత్రిగా కీర్తి సురేష్ నటించింది. కీర్తి సురేష్ కి ఉత్తమ జాతీయ నటి అవార్డు దక్కింది. కీర్తి సురేష్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రంగా మహానటి ఉంది. దుల్కర్, విజయ్ దేవరకొండ, సమంత ఇతర కీలక రోల్స్ చేశారు.