సాయి పల్లవికి చురకలంటించిన విజయశాంతి.. కొంచెం ఆలోచించాలి అంటూ రాములమ్మ ఫైర్
కాశ్మీర్ పండిట్ల అంశంపై విరాట పర్వం చిత్ర ప్రమోషన్స్ లో సాయి పల్లవి చేసిన కామెంట్స్ తీవ్ర వివాదంగా మారాయి. సాయి పల్లవి కామెంట్స్ పై ప్రస్తుతం దేశం మొత్తం చర్చ జరుగుతోంది.

కాశ్మీర్ పండిట్ల అంశంపై విరాట పర్వం చిత్ర ప్రమోషన్స్ లో సాయి పల్లవి చేసిన కామెంట్స్ తీవ్ర వివాదంగా మారాయి. సాయి పల్లవి కామెంట్స్ పై ప్రస్తుతం దేశం మొత్తం చర్చ జరుగుతోంది. దీనితో సోషల్ మీడియాలో సాయి పల్లవి తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది.
సాయి పల్లవి నక్సలిజం, కమ్యూనిజం భావజాలం గురించి మాట్లాడుతూ కశ్మీర్ ఫైల్స్ మూవీ గురించి కూడా కామెంట్స్ చేసింది. ఇటీవల కశ్మీర్ ఫైల్స్ చిత్రం వచ్చింది. ఆ చిత్రంలో కశ్మీర్ పండిట్లని ఎంత దారుణంగా చంపారో చూపించారు. నేను ఇటీవల ఒక న్యూస్ చూశాను. ఆవుల్ని తరలిస్తున్న ముస్లింపై హిందువులు జై శ్రీరామ్ అంటూ దాడి చేశారు.
కశ్మీర్ పండిట్లకి జరిగింది తప్పు అయితే.. గోవుల్ని తీసుకెళుతున్న ముస్లింలపై మనం చేస్తున్నది కూడా తప్పే అంటూ సాయి పల్లవి వ్యాఖ్యానించింది. దీనితో హిందూ వాదులు, నెటిజన్లు తీవ్రస్థాయిలో సాయి పల్లవిపై విరుచుకుపడుతున్నారు. ఆమెపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. కశ్మీర్ పండిట్లపై నరమేధానికి పాల్పడిన టెర్రరిరిస్టులని.. పవిత్రంగా పూజించే గోవుల్ని సంరక్షించే వారిని ఒకే గాడిన కడుతూ సాయి పల్లవి మాట్లాడింది అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు.
సాయి పల్లవి వ్యాఖ్యలపై సినీ నటి, బిజెపి నాయకురాలు విజయశాంతి తాజాగా స్పందించారు. అవగాహన లేకుండా మాట్లాడిన సాయి పల్లవికి రాములమ్మ చురకలంటించారు. మతోన్మాదంతో పండిట్లపై మారణకాండ సృష్టించడం.. ధర్మం కోసం దైవసమానమైన గోవులను కాపాడుకునేందుకు గోరక్షకులు చేసే పోరాటం ఒకటే ఎలా అవుతాయో కాస్త ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది.డబ్బు కోసం దోపిడీ దొంగ ఎవరినైనా కొట్టడం.... తప్పు చేసిన పిల్లవాడిని తల్లి దండించడం ఏవిధంగా ఒకటవుతాయి? ఆ దోపిడి దొంగను, తల్లిని ఒకేలా చూస్తారా? అంటూ విజయశాంతి సాయి పల్లవిని ప్రశ్నించింది.
ఏదైనా అంశం గురించి మాట్లాడే ముందు అవగానే లేకుంటే దానిని పక్కన పెట్టడం మంచిది. అంతే కానీ అవగాహనా లేకుండా ఎలా పడితే అలా మాట్లాడకూడదు. మనల్ని చుట్టూ ఉన్న సమాజం గమనిస్తోంది విషయాన్ని గుర్తుంచుకోవాలి. చిన్న పొరపాటు చేసినా వేలెత్తి చూపే సమాజంలో ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు.
సినిమా ప్రచారంలో భాగంగా పబ్లిసిటీ కోసం సాయి పల్లవిని అనవసరంగా ఈ వివాదంలో ఇరికించినట్లు అనిపిస్తోంది. అంటూ విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.