బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ సంచలనం..ఒత్తిడిలో పవన్, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, బన్నీ ?
కండల వీరుడు సల్మాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను హీరోగా నటిస్తున్న `రాధే` చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ఆయన ప్రకటన పవన్, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, బన్నీ వంటి స్టార్ హీరోలపై ఒత్తిడి పెంచుతోంది.
సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన చిత్రం `రాధే`. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా గతేడాది మేలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యంలో వాయిదా పడింది.
ఇక ఈద్ పండుగని పురస్కరించుకుని మే 13న సినిమాని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు సల్మాన్. ఏప్రిల్ 22(రేపు) సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్నారు. ఓ రకంగా సల్మాన్ పెద్ద సాహసమే చేస్తున్నారని చెప్పొచ్చు. కరోనా మహారాష్ట్రలో విజృంభిస్తోంది. దేశంలోని సగం కేసులో మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. ఇంతగా కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో సల్మాన్ ధైర్యం చేసి విడుదల తేదీని ప్రకటించడం విశేషం.
ఓ రకంగా సల్మాన్ కరోనాతో యుద్ధం చేయబోతున్నారని చెప్పొచ్చు. కరోనాని థియేటర్లలో ఎదురించబోతున్నారు. తన అభిమానులతో కలిసి ఆయన ఈ పోరాటం చేయబోతుండటం విశేషం. ఇలాంటి కఠిన సమయంలో సల్మాన్ తన సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా, హాట్ టాపిక్‌గా మారింది.
సల్మాన్ కేవలం థియేటర్లలోనే కాదు, ఏకకాలంలే ఓటీటీ, డిజిటల్‌లోనూ విడుదల చేయబోతున్నారు. అంటే ఒకేసారి మూడు మాధ్యమాల్లో సినిమా విడుదల కాబోతుంది. ఇలాంటి సాహసం గతంలో `విశ్వరూపం2` సమయంలో కమల్ హాసన్ చేయాలని భావించారు. కానీ కుదరలేదు. ఇక ఇన్ని రోజులకు సల్మాన్ ముందుకు వచ్చి ప్రయోగం చేయబోతుండటం విశేషం. పైగా భారీ బడ్జెట్ సినిమాలు చేసే సల్మాన్ ఇంతటి సాహసం చేయడం మరో విశేషం.
ఇదిలా ఉంటే ఇప్పుడిది టాలీవుడ్ స్టార్స్ పై ఒత్తిడి పెంచుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఇలానే తమ సినిమాలు విడుదల చేయాలనే ఒత్తిడి ఇప్పుడు మరింతగా పెరిగింది. అయితే ఇలాంటి ఆలోచనలో చాలా రోజులుగానే ఉన్నా, ఇప్పుడు సల్మాన్ లాంటి పెద్ద హీరోనే ఇంతటి సాహసం చేయబోతుండటంతో అది మన హీరోలపై ఒత్తిడి పెంచేందుకు దోహదపడుతుంది.
మన హీరోల సినిమాలు ఫస్ట్ థియేటర్లలోనే విడుదలవుతుంటాయి. థియేటర్లలో రావాల్సినన్ని కలెక్షన్లు వచ్చాకే ఓటీటీ, డిజిటల్లో ప్రసారమవుతుంటాయి. అంటే ఎప్పటికోగాని ఓటీటీ, డిజిటల్లో స్టార్ హీరోల సినిమాలు రావు. దాన్ని సల్మాన్ బ్రేక్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
తెలుగులో బడా నిర్మాతల చేతుల్లోనే 70-90శాతం థియేటర్లున్నాయి. స్టార్ హీరోల సినిమాలను ఆయా నిర్మాతలు(ఎగ్జిబిటర్లే) విడుదల చేస్తుంటారు. అంటే తమ లీజుడబ్బులు, తమ లాభాలు రావాలంటే సినిమా కచ్చితంగా థియేటర్లోనే రావాలి. అందుకే డిజిటల్‌కి మొగ్గు చూపడం లేదు. ఇకపై ఈ ట్రెండ్ మారే అవకాశం ఉండబోతుంది. మరి సల్మాన్ మాదిరిగానే మన హీరోలు కూడా ఏకకాలంలో తమ సినిమాలను థియేటర్లతోపాటు ఇతర మాధ్యమాల్లోనూ విడుదలకు ఒప్పుకుంటారా? లేదా? అన్నది చూడాలి.