రజనీ రాజకీయాలకి గుడ్ బై:కారణం ఆరోగ్యం కాదా? సర్వేనా?
‘‘రజనీకాంత్..’’ ఈ పేరులోనే చాలా వైబ్రేషన్ ఉంది. ఆయన పేరు చుట్టూ చాలాకాలంగా రాజకీయాలు తిరుగుతున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా తమిళ రాజకీయాలతో ఏమాత్రం విడదీయరాని అనుబంధం ఉంది! ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రజనీకాంత్ ప్రస్తావన తప్పకుండా వస్తుంది. ఆయన ప్రత్యక్ష మద్దతు కాదుకదా.. కనీసం పరోక్ష మద్దతు కోసం కొమ్ములు తిరిగిన పార్టీలు కూడా ఎదురుచూస్తూంటాయి. రజనీకాంత్ ఒక్క మాట చెప్పినా రాజకీయాల్లో శాసనంగా మారుతాయని చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. దాంతో స్వయాన ఆయనే ఎప్పుడు పార్టీని ఆరంభిస్తారోనని ‘తలైవా’ అభిమానులు కోటి ఆశలతో ఎదురుచూసారు. ‘ప్రాణాలు పోయినా.. వెనుకడుగు వేయను.. పార్టీని ఆరంభిస్తా’నని చెప్పిన సూపర్‌స్టార్ ఇప్పుడు గుడ్‌బై చెప్పడం ఆశ్చర్యంగా మారింది. తమిళ రాజకీయాల్లో ఇదో అత్యంత కీలకమైన పరిణామంగా మారింది. అందుకు కారణం అనారోగ్యమే అని రజనీకాంత్ స్వయంగా చెప్తున్నా ఎవరూ నమ్మటం లేదు. దాని వెనక బలమైన కారణం ఉందని తమిళ రాజకీయ,సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం ఏమిటి..అందులో నిజా నిజాలేమిటో ఓ సారి చూద్దాం.
‘నాన్నా.. నాకు రాజకీయాలు కొత్తకాదు. ఎప్పటినుంచో రాజకీయాలు నా చుట్టూ తిరిగాయి’ అంటూ ఇటీవల ఓ మీడియా మనిషి మాట్లాడే తీరుని చూసి రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇప్పుడే కాదు.. 1990 నుంచి కూడా రజనీకాంత్ మాట రాజకీయాల్లో తూటాల్లా పేలాయనడంలో సందేహం లేదు. 1991లో పోయెస్‌గార్డెన్‌లోని తన ఇంటికి వెళ్తున్న రజనీకాంత్ వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఆయనలోని అసలు రాజకీయం పురుడు పోసుకుంది.
జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న ఆ తరుణంలో అణ్ణాడీఎంకేపై తీవ్ర ఆగ్రహాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆ తర్వాతి సంవత్సరం విడుదలైన ‘అణ్ణామలై’ చిత్రంలో రాజకీయపరమైన డైలాగులకు ఏమాత్రం కొదవ లేకుండా పాలకపార్టీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
నిజం చెప్పాలంటే ఆ సినిమా పోస్టర్లను అతికించడానికి కూడా పలు సమస్యలు ఎదురయ్యాయి. వాటన్నింటినీ అధిగమించి భారీ హిట్‌తో తమిళనాట తనకున్న క్రేజీని చెప్పకనే చెప్పారు సూపర్‌స్టార్.
1995లో రజనీ హీరోగా తెరపైకి వచ్చిన ‘బాషా’ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. సక్సెస్ మీట్లో ‘తమిళనాడులో బాంబుల సంస్కృతి’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారాన్ని రేపాయి.
ఇక రజనీకాంత్ కెరీర్లో, తమిళనాడు రాజకీయాల్లో మరిచిపోలేని అంశం.. 1996 ఎన్నికలు. జయలలిత తీరుపై నిప్పులు చెరుగుతూ ‘అణ్ణాడీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తే.. ఈ తమిళనాడును దేవుడు కూడా కాపాడలేరు’ అని రజనీ సంచలన ప్రకటన చేశారు.
ఆ వెంటనే డీఎంకే- తమిళ్ మానిల కాంగ్రెస్‌కు మద్దతుగా తన వాణిని వినిపించారు. ఆ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఏకంగా 221 నియోజకవర్గాల్లో విజయం సాధించడం గమనార్హం. అణ్ణాడీఎంకే కేవలం నాలుగు సీట్లకే పరిమితం అయింది. రజనీకాంత్ మాటకు ఎంత పవర్ ఉందో ఈ ఎన్నికలే ఉదాహరణగా నిలిచాయి.
ఆ తర్వాత 1998లో ‘కోవై బాంబు పేలుడు’ ఘటనపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2002లో రజనీకాంత్ నటించిన ‘బాబా’ సినిమా విడుదలయ్యేటప్పుడు అందులోని ప్రచార పోస్టర్లపై పీఎంకే అభ్యతరం వ్యక్తం చేసింది. అందుకు తగ్గట్టుగా కూడా ఆయన అభిమానులు స్పందించారు.
అదే సంవత్సరం కావేరి జలాల పంపకాలకు సంబంధించి మాట్లాడుతూ... ఇందుకు ‘నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారం’ అంటూ ఉటంకించారు.
2012లో డిసెంబరు 12న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో సమావేశమయ్యారు. ‘మీకోసం తప్పకుండా ఏదైనా చేస్తా’ అంటూ పార్టీకి సంబంధించి పరోక్షమైన సూచనలిచ్చారు.
2014లో ‘మోడి ఓ గొప్ప నేత’ అని కీర్తించడంతో భాజపా పక్షాన రజనీకాంత్ చేరుతారేమోనని వార్తలు వినిపించాయి. 2017లో డిసెంబరులో మళ్లీ అభిమానులతో సమావేశం అయ్యారు.
రజనీకాంత్ ఆ తర్వాతి రోజుల్లో ‘యుద్ధం వచ్చేటప్పుడు చూసుకుందాం’ అని చెప్పారు. అదే నెల 31న ‘రాజకీయాల్లోకి రావడం ఖాయం’ అంటూ స్పష్టమైన వ్యాఖ్యలు చేసి అభిమానుల్లో ఆనందాన్ని నింపారు.
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ‘నా లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలే.. ఇవి కావు’ అని చెప్పారు. అదే ఏడాది ఏప్రిల్‌లో ‘అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా’నని ఇంకాస్త ఉత్సాహాన్ని నింపారు.
ఇక 2020లో తాను పార్టీ ప్రారంభిస్తానని ఇటీవల ప్రస్తావించడం రజనీకాంత్ మక్కల్ మండ్రంలో నిర్వాహకులను నియమించడం, ఎన్నికలు సిద్ధం కావాల్సిందిగా పిలుపునివ్వడం, బూత్‌ల వారీ నేతలను నియమించడం వంటి పనులు పలు పార్టీల్లో కాస్త కలవరం రేపాయి. ముఖ్యంగా డీఎంకే, అణ్ణాడీఎంకేలకు ఈ పరిణామాలు కంటిమీద కునుకు లేకుండా చేశాయి.
రాజకీయాల్లోకి రానని మంగళవారం రజనీ చేసిన తాజా ప్రకటన డీఎంకేకే అత్యంత అనుకూలంగా మారిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రజనీకాంత్ అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నా.. డీఎంకే గెలుపోటములను తప్పకుండా నిర్ణయించే శక్తిగా రజనీకాంత్ ఉంటారని ప్రచారం సాగింది.
ఆరోగ్యపరంగా రజనీ రాజకీయాలకు గుడ్ బై నిర్ణయం తీసుకున్నందున అందరూ గౌరవించాలని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.అయితే తమిళ విశ్లేషకులు మాత్రం పాతికేళ్ల క్రితమే రాజకీయాల్లోకి అడుగుపెడితే బాగుండేది కానీ ఇప్పుడు ఆయనకు అంత క్రేజ్ లేదని గమనించే ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు.
వాళ్లు చెప్పే వెర్షన్ ఏమిటంటే... కొన్నాళ్లుగా రజనీ సినిమాలు ఆడడం లేదు. ఆయనకు గతంలో ఉన్న ఇమేజ్, క్రేజ్ లేదు. ఇప్పుడున్న తమిళ యూత్ ఆయన మాటలని నమ్మే పరిస్దితి లేదు. సీనియర్ సిటిజెన్స్ కి కూడా ఆయన పెద్దగా నమ్మకం లేదు . దానికి తోడు రజినీకాంత్ బీజేపీ ఏజెంట్ అన్న మాట తమిళనాట బలంగా స్థిరపడిపోయింని చెప్తున్నారు.
రజనీకాంత్ ఈ మధ్యన తన పార్టీ బలాలు, గెలుపు ఓటమిలపై ఒక సర్వే చేయించుకున్నారట. అందులో … జనం ఆయన పార్టీ పెడతాడని కానీ, ఆయన పార్టీ గెలుస్తుందని నమ్మడం లేదని తేలిందట. దాంతో రజనీ ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో దిగితే 5 శాతానికి మించి ఓటు షేర్ రాబట్టుకోలేరని సర్వే చెప్పిందట. అందుకే గౌరవంగా తప్పుకున్నాడంటున్నారు. ఇందులో ఎంత నిజముందో తెలియాలి.