యోగి ఆదిత్యనాథ్ కాళ్లు పట్టుకోవడంపై.. రజినీకాంత్ క్లారిటీ.. ఏమన్నారంటే?
సూపర్ స్టార్ రజినీకాంత్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాదాలకు నమస్కరించడంతో విమర్శలు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎందుకు అలా చేశారో క్లారిటీ ఇచ్చారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ‘జైలర్’తో భారీ సక్సెస్ ను అందుకున్నారు. అభిమానులకు గ్రాండ్ ట్రీట్ అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం హవానే కొనసాగుతోంది. ఈ సక్సెస్ ను అందుకున్న రజినీపై ఫ్యాన్స్, తోపాటు సాధారణ ఆడియెన్స్ కూడా ప్రశంసలు కురిపిస్తున్న తరుణంలో.. తలైవా ఓ వివాదంలో చిక్కుకున్నారు.
‘జైలర్’ పది రోజుల్లో రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక భావన కలిగిన రజినీ హిమాలయాలు వెళ్లి, అక్కడి పుణ్య క్షేత్రాలను సందర్శించారు. ఈ క్రమంలోనే యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ (Yogi Adityanath) ను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.
లక్నో పర్యటనలో భాగంగా యోగి ఆదిత్యానాథ్ ను కలిసిన సందర్భంలో ఆయన పాదాలను తాకి నమస్కరించారు. దీంతో తమిళుల ఆత్మగౌరవాన్ని నార్త్ ఇండియా పొలిటీషన్ వద్ద భంగపరిచారంటూ పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. తనకంటే వయస్సులో చిన్నవాడి రజినీ కాళ్లు పట్టుకోవడం ఏంటంటూ ట్రోల్స్ వచ్చాయి. ఈ వివాదంపై తాజాగా రజినీ స్పందించినట్టు తెలుస్తోంది.
యోగి ఆదిత్యానాథ్ కాళ్లు పట్టుకోవడంపై తలైవా క్లారిటీ ఇచ్చారు. ‘నాకంటే వయస్సులో చిన్నవాళ్లు అయినప్పటికీ.. వాళ్లు యోగి అయినా, సన్యాసి అయినా వారి పాదాలకు నమస్కరించడం నాకు అలవాటు. అదే చేశాను.’ అంటూ వివరణ ఇచ్చారు. ఇక రజినీ ఆధ్యాత్మికతకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో తెలిసిందే. ఈ క్రమంలోనే అలా చేశారని చెప్పుకొచ్చారు.
ఇక రజినీ ఇచ్చిన సమాధానంతో తమిళులు సంతృతి చెందుతారో లేదో చూడాలి. ఏదేమైనా ‘జైలర్’తో మాత్రం తన అభిమానులు, సాధారణ ఆడియెన్స్ ను తలైవా ఖుషీ చేశారు. యాక్షన్ తో అదరగొట్టారు. చాలా కాలం తర్వాత రజినీకాంత్ ఫ్యాన్స్ కు ‘జైలర్’ రూపంలో ఫుల్ మీల్స్ అందినట్టైంది.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ‘జైలర్’ చిత్రంలో రజినీ - తమన్నా జంటగా నటించారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్యామియో రోల్స్ లో మెరిశారు. అనిరుధ్ సంగీతం అందించారు. తర్వాత ‘లాల్ సలామ్’, ‘Thalaivar 170’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.