పవన్ ‘వకీల్ సాబ్’ రివ్యూ
దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ తెరపై కనిపించనున్న సినిమా ‘వకీల్ సాబ్‘. 2016 లో అమితాబ్ బచ్చన్ – తాప్సి ప్రధాన పాత్రల్లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ పింక్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమాని రూపొందించారు
పవన్ కళ్యాణ్, ‘పవనిజం’ ఈ మాట వినపడితే చాలు లక్షలాదిమంది అబిమానులు ఓ ప్రత్యేకమైన అనుభూతికి లోనవుతారు. తెరపై తమ హీరో నటనకు ఫిదా అవడమే కావటమే కాక,ఆయన వ్యక్తిత్వాన్ని అంతకు మించి అభిమానులు ఆరాధిస్తుంటారు. ఈ క్రమంలో ‘ఇక ప్రజా సేవకే ఈ జీవితం అంకితం.. ఇకపై సినిమాలు చేయను..’ అని జనసేన పార్టీ అధినేత, పవన్ కళ్యాణ్ చెప్పడంతో నిరాశపడ్డ అభిమానులు ‘వకీల్ సాబ్’ సినిమా ప్రకటన రాగానే.. కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకున్నారు. ఈలోగా ఆ సినిమా బాలీవుడ్ హిట్ ‘పింక్’ రీమేక్ అనేసరికి ఆశ్చర్యపోయారు. అయితే సినిమాలో అభిమానులకు నచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయని ‘వకీల్ సాబ్’ ట్రైలర్ హామీ ఇచ్చింది. అప్పటినుంచే సినిమాపై ఎక్సపెక్టేషన్స్ మరింతగా పెంచుకున్నారు. రకరకాల కారణాలతో ఈ సినిమా కాస్త లేటైనా ఈ రోజు మొత్తానికి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆకాశమే హద్దుగా అనిపించే అభిమానుల అంచనాలను ఈ సినిమా ఎంత వరకూ అందుకోగలిగింది! ఈ సమ్మర్‌లో బాక్సాఫీస్ హీట్‌ను పెంచే సినిమా అవుతుందా. ‘పింక్’ సినిమాకూ, ఈ సినిమాకు తేడా ఏమిటి, అసలు రీఎంట్రీకు ఎంచుకునేటంత విషయం ఈ సినిమాలో ఏముంది ..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి...
పల్లవి(నివేదితా థామస్),దివ్య (అనన్య), జరీనా(అంజలి) ముగ్గురూ మంచి ప్రెండ్స్. వర్కింగ్ ఉమెన్స్ అయిన వీళ్లు ముగ్గరూ హైదరాబాద్ లో ఒక ప్లాట్ అద్దెకు తీసుకుని ఉంటూంటారు. ఓ రోజు రాత్రి ఇంటికి వెళ్తూ క్యాబ్ బుక్ చేసుకుంటే అది మధ్యలో బ్రేక్ డౌన్ అయ్యి ఆగిపోతుంది. దాంతో వాళ్లు ఆ రాత్రి పూట...ఏం చేయాలో తోచక లిప్ట్ అడుగుతూంటే ... ఓ ఎంపి కొడుకు అటుగా కారులో వెళ్తాడు. ఆ కారులో పల్లవి క్లాస్ మేట్ అయిన మరో వ్యక్తి కూడా ఉండటంతో కారు ఆపి లిప్ట్ ఇస్తారు. అయితే ఆ ప్రయాణం అంత సజావుగా సాగదు. ఆ తర్వాత వారు ఓ రిసార్ట్ కు డిన్నర్ చేసి వెళ్దామని తీసుకెళ్తారు. అక్కడ వీళ్లు ముగ్గురుని ఆ కారులో ఉన్న ముగ్గురూ కలిసి లైంగికంగా లొంగ తీసుకోబోతారు. అప్పుడు ఆ ఎంపి కొడుకుని పల్లవి కొట్టి ...అక్కడ నుంచి ముగ్గురు తప్పించుకుంటారు. ఆ తర్వాత పోలీస్ లను ఎప్రోచ్ అవుతారు.
అక్కడ నుంచి ఎంపి తన పలుకుబడితో రివర్స్ కేసు పెడతారు ఆమెపై. దాంతో పల్లవిని జైల్లో పెడతారు. ఆమెకు బెయిల్ రాకుండా చేస్తారు. అప్పుడు వారికి ఏం చేయాలో తోచని స్దితిలో తమ కాలనీకి వచ్చిన వకీల్ సాబ్ కె సత్యదేవ్(పవన్ కళ్యాణ్) గురించి తెలుస్తుంది. సత్యదేవ్..ప్రజలకోసం ఏదైనా చేయాలి, సామాన్యులకి న్యాయం జరగాలని ఎప్పుడూ తాపత్రయపడుతూంటాడు. అయితే ఆయన ఇప్పుడు తాగుడుకు బానిసై లాయిర్ వృత్తికి దూరంగా ఉంటాడు. ఆయన ఈ కేసు ఎఫైఆర్ చూసి కొన్ని సలహాలు ఇస్తాడు. అయితే సత్యదేవ్ ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతున్నాడనే విషయం తెలుసుకున్న ఎంపి వెళ్లి వకీల్ సాబ్ కు వార్నింగ్ ఇస్తాడు. దాంతో కోపం తెచ్చుకున్న వకీల్ సాబ్..ఈ కేసుని టేకప్ చేస్తాడు. కోర్టులో మరో టాప్ లాయిర్ నంద(ప్రకాష్ రాజ్)తో పోటీ పడతాడు. ఈ క్రమంలో వకీల్ సాబ్ కు ఏ విధమైన అడ్డంకులు వచ్చాయి.వాటిని ఎలా అధిగమించి కేసు గెలిపించాడు. అసలు సత్యదేవ్ ఎందుకు తాగుబోతుగా మారాడు. ఈ సినిమాలో శృతిహాసన్ క్యారక్టర్ ఏమిటి..తనకెంతో ఇష్టమైన న్యాయవాద వృత్తిని ఎందుకు వదిలేసాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ ..
నిజానికి ఆడవాళ్లు ఇలాగే ఉండాలి, ఇలాంటి దుస్తులే తొడగాలి,సంప్రదాయాన్ని వారు మాత్రమే అనుసరించాలి, కనపడని కట్టుబాట్లు వెనక మగ్గిపోవాలి అని చెప్పటం ఓ తరతరాలుగా జరుగుతోంది. మాటల గారడీతో దేన్నయినా సాధ్యం చేయొచ్చనే ఓ విధమైన భావజాలమే ఇలాంటి భాషా ప్రయోగాలకు మూల కారణం కావచ్చు. లేకపోతే ఆడవారి మాటలను, చేష్టలను వేరే అర్థాలు ఉండాల్సిన అవసరం లేదు. ఆడైనా,మగైనా అవునంటే అవునని, కాదంటే కాదనే ఒకే అర్థం ఉంటుంది, ఉండాలి. కానీ, ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే స్త్రీలకు ఆ హక్కు లేనట్టుగా అర్దమవుతుంది. స్నేహం, ప్రేమ, వివాహం, శారీరక సంబంధం .. ఇలాంటి విషయాల్లో మహిళలపై జరుగుతున్న దాడులును ఈ సినిమా ప్రశ్నిస్తుంది. ఆ దాడుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోతే, మరికొంతమంది తీవ్ర మానసిక వేదనలతో, శారీరక హింసతో జీవితం వెళ్లదీస్తున్నారనే విషయం గుర్తు చేస్తుంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తోందనే విషయం లోతులకు వెల్తుంది.
దాడులు జరిగినప్పుడే మాత్రమే వాటి గురించి బయటి ప్రపంచానికి తెలుస్తుంది. తిరస్కరించడం ద్వారా దాడులకు గురవ్వడమనేది చాలా కాలంగా గృహహింసలో నెలకొన్న చీకటికోణం. ఈ విషయాన్ని ఈ సినిమా స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ఏ విషయంలోనైనా ఒక మనిషి ఆమోదానికి విలువ ఇవ్వాలనే స్పృహ లేకపోవటం, మహిళలను, దిగువ తరగతుల వారిని తమకే సొంతమైన వస్తువుల్లో ఒకటిగా చూడడం ఈ ఆధిపత్య అహంకారానికి కారణం. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడూ రావాలి. సినిమాల ద్వారా మార్పు వస్తుందా అంటే... కనీసం కొద్దిమందిలో అయినా ఆలోచన కలుగుతుంది. ఇలాంటి కథనాలు స్టార్స్ చెప్పినప్పుడు మరింతగా జనాల్లోకి వెళ్లే అవకాసం ఉంది. ఈ కోణంలోంచి చూస్తే ఈ సినిమా పవన్ చేసిన ది బెస్ట్ సినిమా అని చెప్పాలి. మనమంతా ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ఉన్నాము, ఉండాలనే స్పృహ పెంచటమే ఈ సినిమా ఉద్దేశ్యం.
‘రాజకీయాల్ని బాధ్యతగా తీసుకున్నాను. అందుకే, సినిమాలకు దూరమయ్యాను. కానీ, అదే రాజకీయ పార్టీ నడపడానికి, నా కుటుంబం నడవడానికీ, నాకు తెలిసిన విద్య నటించడమే.. అందుకే, సినిమాల్లో నటిస్తున్నాను..’ అని చెప్పి రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు తెలుసు తన సినిమాపై ఏ స్దాయి ఎక్సపెక్టేషన్స్ ఉంటాయో. వాటికి తగ్గట్లుగానే స్క్రిప్టుని మార్చుకుంటూ వెళ్లారు. ఆల్రెడీ ప్రూవ్ అయిన ఓ సబ్జెక్ట్ ని మార్చి స్క్రిప్టు రాయాలంటే చాలా భయాలు ఉంటాయి.
ఒరిజనల్ కంటెంట్ కు ఎక్కడ దెబ్బ తలుగుతుందో అని..అలాగే మూలం లో వర్కవుట్ అయ్యినవి ..ఇక్కడ కూడా వర్కవుట్ అవ్వాలని డ్రస్ తో సహా మొత్తం ఎత్తుకొస్తూంటారు. అయితే అలాంటి సాహసాలు చెయ్యలేదు ఈ సినిమాలో. కమర్షిల్ ఎలిమెంట్స్ కోసం,పవన్ ఇమేజ్ కోసం కొన్ని మార్పులు చేసారు కానీ అవి కథా గమనాన్ని ఇబ్బంది పెట్టలేదనే చెప్పాలి. ముఖ్యంగా కామెడీ ట్రాక్ లు పెట్టడం, రొమాంటిక్ సీన్స్ ట్రై చేయటం వంటివి చేయలేదు. క్లైమాక్స్ కు లీడ్స్ వేసుకుంటూ సబ్ ప్లాట్స్ ని బాగా రన్ చేసారు. పవన్ కళ్యాణ్ కోసం రాసిన కథలాగే అనిపించింది. అయితే కొన్ని చోట్ల అది కోర్టు ఆర్గుమెంట్స్ సమయంలో కాస్త ఓవర్ గా అనిపిస్తుంది అయితే ఓవరాల్ గా ప్లోలో అది కనపడదు
స్క్రీన్ ప్లే పరంగా చూస్తే ... సినిమా ప్రారంభమైన పావు గంటకు పవన్ ఎంట్రీ ఉంటుంది. అప్పటిదా ఆయన కోసం వెయిటింగ్ ఉంటుంది. ఆ వెయిటింగే...ఇంట్రడక్షన్ సీన్ కు ఓ రేంజిలో వెయిట్ ఇచ్చింది. అయితే అక్కడ నుంచి పెద్దగా ఏమీ జరగదు. పవన్ కళ్యాణ్ ని ఓ తాగుబోతు లాయిర్ గా, అన్యాయంకు ఎదురు తిరిగే వ్యక్తిగా చూపెడుతూ ఫస్టాఫ్ సెటప్ చేసుకుంటూ వెళ్తారు. అయితే ఫస్టాఫ్ మొత్తం అదే అంటే కష్టం కాబట్టి...పవన్ కళ్యాణ్ అలా తాగుబోతు గా ఎందుకు మారాడు అన్న విషయాలు చెప్తూ ప్లాష్ బ్యాక్ చెప్పారు. అయితే ఆ ప్లాష్ బ్యాక్ పరమ రొటీన్ గా ఉంది. దాదాపు అందరూ ఊహించేయగలిగేదే. దాంతో ఆ ప్లాష్ బ్యాక్ లేకపోయినా సినిమాకు వచ్చే నష్టం ఏమీ లేదనిపిస్తుంది.
ఇంట్రవెల్ కు వచ్చేసరికి పవన్ కళ్యాణ్...అన్యాయమైన ఆడపిల్లల కేసు తీసుకుంటాడు..సెకండాఫ్ లో ఆర్గుమెంట్స్ అంటూ లీడ్ తో ఇచ్చారు. ఆ మేరకు స్క్రీన్ ప్లే పరంగా ఫస్టాఫ్ యావరేజ్ అని చెప్పాలి. అయితే సెకండ్ లో కోర్ట్ రూమ్ డ్రామా డైలాగులు బాగా పండాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ లో పవన్ డైలాగులు ప్రత్యేకంగా రాసారు. మూలం చెడకుండా కొత్తగా ట్రై చేసారు. వాటికి మంచి రెస్పాన్స్. అలాగే ఫైట్స్ కూడా కథలో భాగంగా బాగానే ఇమిడాయి. పొలిటికల్ డైలాగులు ఇండైరక్ట్ గా ఒకటిరెండు వదిలారు.
‘పింక్’ టు వకీల్ సాబ్.. వయా ‘నేర్కొండ పార్వాయ్’
బాలీవుడ్ సినిమా ‘పింక్’ మంచి హిట్ అవ్వగానే , తమిళంలోకి ‘నేర్కొండ పార్వాయ్’ టైటిల్ తో రీమేక్ అయ్యింది. హిందీలో అమితాబ్ పోషించిన పాత్రని తమిళంలో అజిత్ పోషించాడు. ఆ క్రమంలో తమిళ వెర్షన్ కోసం కొన్ని కమర్షియల్ మార్పులు చేయాల్సి వచ్చింది. అవి భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ అయ్యాయి కూడా. అయితే తెలుగుకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ వెర్షన్ గా పింక్ ని మార్చారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని మరిన్ని కమర్షియల్ మార్పులు చేసారు. అవే ఇప్పుడు సినిమాకు హైలెట్స్ గా నిలుస్తున్నాయి. మక్కీ టు మక్కీ కట్ అండ్ పేస్ట్ రీమేక్ గా కాకుండా చాలావరకూ మార్చారు.
అలాగే హిందీ ‘పింక్’, తెలుగు ‘వకీల్ సాబ్’కి తేడా విషయానికి వచ్చేసరికి.. ‘పింక్’ లో అమితాబ్ బచ్చన్ వృద్ధుడిగా కనిపిస్తాడు. ఆయన వయసుకు తగ్గ పాత్ర అది. తమిళంలో మధ్య వయస్కుడిగా అజిత్ కనిపించినా, జుట్టు మాత్రం తెల్లగానే వుంచారు. ఆ లుక్ అజిత్ స్పెషల్ స్టైల్ గా మారింది. ఇక తెలుగు వెర్షన్ విషయంలో మాత్రం, పవన్ కళ్యాణ్.. గెడ్డం పెంచినా సినిమాలో చాలా చోట్ల యంగ్ లుక్ తోనే కనిపిస్తారు. తమిళ వెర్షన్ కంటే కూడా హీరో పాత్రని బాగా ఎలివేట్ చేసారు. దాంతో హిందీ,తమిళ వెర్షన్ లు చూసిన వారు కూడా తెలుగు వెర్షన్ చూస్తే తెలిసిన కథే అయినా చాలా కొత్తగా ఉంటుంది. అలాగే హిందీ, తమిళ వెర్షన్లతో పోల్చితే, తెలుగు వెర్షన్ పాటలు విషయానికొచ్చినప్పుడు పాటలు ఎక్కువగానే వున్నాయి.
హెలెట్స్
పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్
సెకండాఫ్ లో పవన్,ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే వాదోపవాదాలు,
ఆ టైమ్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్
నివేదా థామస్ నిక్కచ్చైన నటన
ఎమోషనల్ కనెక్టవిటీ
మెట్రో ఫైట్ సీన్
మైనస్ లు
ఫస్టాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్
పింక్ చూసిన వాళ్లకు మరీ ఎక్కువ అయ్యాయి అనిపించే కమర్షియల్ ఎలిమెంట్స్
ఫస్టాఫ్ ఎడిటింగ్
టెక్నికల్ గా ...
దర్శకుడుగా వేణు శ్రీరామ్ ..ఈ రీమేక్ విషయంలో బాగా సక్సెస్ అ్యయాడనే చెప్పాలి. పింక్ లాంటి మల్టిప్లెక్స్ సినిమాని మాస్ సినిమాగా మార్చగలిగాడు. సినిమాలో ఉన్న కోర్ కంటెంట్ ని ఎక్కడా చెడకుండా ప్రెజెంట్ చేసారు. కోర్ట్ రూమ్ డ్రామా అంటే ఏ మాత్రం బోర్ కొట్టినా భరించటం. దాంతో ఎక్కడా లాగ్ లేకుండా లాక్కెళ్లిపోయాడు. అయితే పింక్ చూసిన వాళ్లకు కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఫోర్స్ గా ఇమిడ్చాడు అనే ఫీల్ కూడా వస్తుంది. డైరక్ట్ గా ఈ సినిమానే చూస్తే ఆ ఇబ్బంది రాదు.
ఇక ఈ సినిమాకు పెద్ద ఎసెట్ తమన్. ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా అయ్యాక కూడా మన చెవుల్లో మారుమ్రోగుతుంది. అలాగే పియస్ వినోద్ సినిమాటోగ్రఫీ నీటుగా ఉంది. అయితే ఎందుకో ప్లాష్ బ్యాక్ సీన్స్ ఆ కెమెరానుంచే వచ్చినట్లు లేవు. ఎడిటింగ్ జస్ట్ ఓకే. ఫస్టాఫ్ ని మరింత ట్రిమ్ చేయచ్చు. డైలాగులు అద్బుతం కాదు కానీ బాగున్నాయి. కోర్టులో మరింత మంచి లాగ్వేజ్ వాడి ఉండచ్చు. వాస్తవానికి దూరంగా ఉన్నాయి చాలా డైలాగులు. వాస్తవం అనిపించే సంఘటని డీల్ చేస్తున్నప్పుడు అలాంటి మాటలే రాస్తే బాగా పండుతాయి.
నటీనటుల్లో .. పవన్ కల్యాణ్ దే ప్రధమ స్దానం. ఆయన సినిమాను ఎలా చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారో అలాంటి మాస్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. ప్రతి ఫ్రేములోనూ శ్రీరామ్ వేణు.. పవన్‌ను యూత్, మాస్ సహా అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా చక్కగా ఎలివేట్ చేశాడు. ఇక శృతి హాసన్ విషయానికి వస్తే క్రాక్ లో మరిపించిన ఆమె ఇక్కడ తన మ్యాజిక్ ని రీక్రియేట్ చేయలేకపోయింది. ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే సినిమాకు కీలకంగా నిలిచారు. ఆయన లేకపోతే ఇంకెవరూ అంత గొప్పగా చేయలేరనిపించింది. నివేదా థామస్, అంజలి, అనన్య ముగ్గరూ కథని లిటరల్ గా మోసారు. పవన్ సీన్ లో లేనప్పుడు ఆ లోటు తెలియకుండా చేయగలిగారు.
ఫైనల్ థాట్
'గబ్బర్ సింగ్' స్దాయి మ్యాజిక్ కాదు కాని...ఖచ్చితంగా చూడాలనిపించే లాజిక్ అయితే ఉంది.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 3
--
ఎవరెవరు..
బ్యానర్ :శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్
నటీనటులు: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల,ప్రకాష్ రాజ్ తదితరులు.
సంగీతం: ఎస్.ఎస్.తమన్,
సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్,
ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్,
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి,
డైలాగ్స్: తిరు,
యాక్షన్ రవివర్మ,
వి.ఎఫ్.ఎక్స్: యుగంధర్,
కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి,
సమర్పణ: బోనీ కపూర్,
నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్ ,
దర్శకత్వం: శ్రీరామ్ వేణు
రన్ టైమ్:2 గంటల 35 నిమిషాలు
విడుదల తేదీ: ఏప్రిల్ 9, 2021