రివ్యూ : జీవా ‘జిప్సి’
జోకర్(తమిళ)సినిమాతో నేషనల్ అవార్డ్ పొందిన డైరక్టర్ కొత్త సినిమా అంటే ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది. అందులోనూ జోకర్ సినిమా ఏదో అవార్డ్ సినిమాలాగ బోర్ కొట్టదు. మన సొసైటీ వీపు చరిచి, అవసరమైతే చెంపలు వాచేలా కొట్టి మనను సుషుప్త్యావస్థ నుంచి జాగ్రదవస్థలోకి తీసుకొస్తుంది. మరి ఈ సినిమా కూడా ఆ పనే చేస్తుందా లేక, మనని గాఢ నిద్రలోకి పంపి, స్వప్నావస్థ కలగచేస్తుందా , ఈ జిప్సీ కథేంటి, వలస జీవులైన జిప్సీల జీవితానికి ఈ సినిమాకు సంభందం ఉందా, ఇదేమన్నా చారిత్రక కథా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి
జిప్సీ (జీవా) పసికూనగా ఉన్నప్పుడే పరాయోడి పంచన బ్రతకాల్సి పరిస్దితి ఏర్పడుతుంది. ఓ బాటసారి అతన్ని పెంచే భాధ్యత తీసుకుంటాడు. ఆ బాటసారి ఇల్లూ వాకిలి ఉన్న మనలాంటోడు కాదు. దేశం మొత్తం తిరిగే సంచారి. దాంతో జిప్సీ కూడా పెంచిన తండ్రితో అలాగే తిరుగుతూ ...పెరుగుతాడు. వీళ్లకు తోడు చే అనే పేరుగల ఓ తెల్ల గుర్రం. కాలం గడుస్తుంది. జిప్సీకు పసికూన కాస్తా పెద్దోడు అవుతాడు. అన్ని ప్రాంతాలు తిరిగాడు. అన్ని భాషలు మాట్లాడగలడు. పాకిస్దాన్ క్రికెట్ టీమ్ కూడా గెలవాలని కోరుకునేటంత విశాలమైన మనస్దత్వం ఉన్నవాడు.
పనిలో పనిగా...వయస్సు లక్షణంగా ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమే వహీదా(నటాషా సింగ్). సంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందిన ఆమె కూడా మన జిప్సీతో ప్రేమలో పడుతుంది. ఈ లోగా ఆమెకు పెళ్లి నిర్ణయమవుతుంది. దాంతో తమ ప్రేమను నిలబెట్టుకునేందుకు లేచిపోతారు. ఆమె కుటుంబం నుంచి ఎదురయ్యే అడ్డంకులను నుంచి తాత్కాలికంగా తప్పించుకుని ఓ ఇంట్లో కాపురం పెడతారు. ఇదంతా ఇల్లూ,వాకిలి లేని జిప్సీకు విచిత్రంగా ఉంటుంది. కానీ ఎంజాయ్ చేస్తాడు. అతని జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. జిప్సీ ఫ్యామిలీ పెట్టాడు.
ఈ సారి ఇద్దరూ కలసి ట్రావెల్ చేస్తూ ఎంజాయ్ చేస్తూంటారు. ఈ లోగా వహీదా నెల తప్పుతుంది. ఇక రేపో మాపో డెలవరీ అనగా...మత విద్వేషాలు,.అల్లర్లు మొదలవుతాయి. హింస పెచ్చరిల్లుతుంది. శాంతి కోసం, రక్షణ కోసం ఇద్దరూ పరుగెట్టాల్సిన పరిస్దితి. ఇల్లు తగలడిపోతున్నాయి. ద్వేషంతో ప్రపంచం రగిలిపోతోంది. మత రాజకీయం జరుగుతోందని అందరికి తెలుసు. కానీ దాన్ని ఆపేదెవరు.. ఈ క్రమంలో ఇద్దరూ విడిపోయి తప్పిపోతారు.
ఓ సంవత్సరం తర్వాత ఆమె ఇంకా ఆ దారుణమైన రాత్రికి సంభందించిన జ్ఞాపకాలే వేధిస్తూంటాయి. ఆమె మనస్సు మొత్తం అవే ఆక్రమించేసాయి. ఆమె పూర్తిగా డిస్ట్రబ్ అయ్యింది. ఆమె తండ్రి (లాల్ జోస్)..ఏ సైకాలజిస్ట్ దగ్గరకో తీసుకెళ్లకుండా విడాకులకు అప్లై చేయమని చెప్తాడు. కానీ జిప్సీ మాత్రం వహీదాని, ఆమె పిల్లాడని కోరుకుంటాడు. అయితే అతనికి ప్రపంచం అండగా నిలుస్తుందా...అతను గెలుస్తాడా..అది జరిగే పనేనా..వంటి విషయాలన్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ఏం చెప్పదలుచుకున్నారు
జిప్సీ ఓ ఫ్రీ బర్డ్ లా ఎక్కడకి కావాలంటే అక్కడకి వెళ్తూ...పాట పాడుకుంటూ పొట్టపోసుకుంటూ తన జీవితం తాను బ్రతకాలనుకున్నాడు. కానీ అతని స్వేచ్చకు వహీదా ప్రేమ అడ్డుపడింది. కానీ దాన్ని అతను అడ్డుగా భావించక, ఓ ఆనందంగా భావించి కుటుంబ జీవనంలో సెటిల్ అవుదామనుకున్నాడు. తన నిరంతర ప్రయాణాలకు ఫుల్ స్టాఫ్ పెడదామనుకున్నాడు. హాయిగా గడుపుదామనుకున్నాడు. అయితే కులం, మతం అంటూ విడిపోయి, ఎప్పుడూ వివాదాలతో చెలరేగిపోయే సమాజం అతనికా అవకాసం ఇవ్వదలుచుకోలేదు. అందుకు అతను కలతపడ్డాడు. కలవరపడ్డాడు. స్వేచ్చగా ,హాయిగా ఎగిరే పక్షిలాంటి మనిషికు ఈ సమాజంలో మనుగడ సాధ్యమేనా..మనిషి తన మొదట రోజుల నాటి ప్రాకృతిక సిద్దాంతాలతో జీవించగలడా?
ఏమైంది
డైరక్టర్ చెప్పాలనుకున్నది బాగుంది.కాకపోతే దాన్ని చెప్పే విధానంలోనే స్పష్టత కొరబడింది. ఎప్పుడైతే సమాజం ఏర్పడిన నియమాలని ఓ స్వేచ్చాయిత జీవి ప్రశ్నించాలనుకున్నాడో అప్పుడే కాంప్లిక్ట్ ఏర్పడింది. అయితే కథను ఆ దిశగా పూర్తిగా నడపలేకపోయాడు. అందులోనూ ఇది వైడ్ స్పాన్ ఉన్న సబ్జెక్ట్. ఆబ్జెక్టు కు అందనిది. ప్రశ్నలే కానీ సమాధానం గా సంతృప్తి కానరానిది.
ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలకు ప్రతీ ఒక్కరి దగ్గరా ఒక్కో సమాధానం ఉంటుంది. ఆ ప్రశ్న...మనలని సినిమాలోంచి బయిటకు తీసుకువచ్చేస్తుంది. దానికి తోడు ఈ కథకు విధి విలన్ గా కనపడుతుంది. పోనీ దీన్ని సమాజం అనే విషయం మర్చిపోయి కథగా చూద్దాముు అంటే...భాధ్యత, బరువు లేని ఓ అవారా లాంటి కుర్రాడు..ఓ క్లాస్ అమ్మాయితో ప్రేమ వ్యవహారం మనకు కొత్తా కాదు..వింత అసలే కాదు. పరమ రొటీన్.
చూస్తే ఏంటి ఆనందం
సినిమా కథ, క్యారక్టర్స్, కాంప్లిక్ట్ వంటివి ప్రక్కన పెడితే మనకు తెరపై కనపడే విజువల్ బ్యూటీ మాత్రం బాగుంటుంది. పొగమంచుతో కూడిన కొండలు, అడవులు, వాటర్ ఫాల్స్, వారణాసి, కాశ్మీర్ , కేరళ లలో అదిరిపోయే లొకేషన్స్ మన కళ్లెదుట కనపడి కనువిందు చేస్తాయి. ఆ జిప్సీ కళ్లతోటే మనమూ చూస్తూ నయనానందం పొందచ్చు. అయితే అదే సమయంలో డైరక్టర్ హిందూ...ముస్లీ విభేధాలు మనకు గుర్తు చేస్తూ ఆ ఫీల్ ని సాధ్యమైనంత పోగొట్టే ప్రయత్నం కూడా చేస్తారు.
డైరక్షన్ , ఇతర విభాగాలు
ఈ కథలో చెప్పుకోదగ్గ విషయం దర్శకుడు నిజాయితీ. ఎక్కడా కమర్షియల్ హంగులకు పోకుండా కథని చెప్పుకుంటూ వెళ్లాడు. చాలా సార్లు అమాయికులైన జనం...ఎవరో ఎక్కడో ఉండి నడిపించే రాజకీయ కుట్రలకు ఎలా బలి అవుతారో చెప్పాడు. అయితే ఇది చెప్పే క్రమంలో చాలా సార్లు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా మారింది. కొన్ని చోట్ల మణిరత్నం బొంబాయి, మరికొన్ని చోట్ల కమల్ హే రామ్ గుర్తుకు తెస్తుంది. ఇక క్లైమాక్స్ చాలా హడావిడిగా ముగించేసినట్లు అర్దమవుతుంది.
కెమెరా వర్క్ చాలా బాగుంది. కొన్ని షాట్స్ మళ్లీ కర్శర్ తో వెనక్కి వెళ్లి చూడాలనిపించాయి. ఇక సంగీత దర్శకుడు అందించిన సంగీతం కూడా పర్వాలేదనిపించింది. రీరికార్డింగ్ అంతంత మాత్రమే. ఎడిటింగ్..మరికొంత షార్ప్ గా ఉండచ్చు. గుర్రం ఉన్న సీన్స్ కూడా నత్త నడక నడిచాయి. తెలుగు డైలాగులు విజిల్స్ వేసేటంత లేవు. అయినా థియోటర్స్ లేకపోతే ఆ ఎక్సపీరియన్స్ తెలియదు. జీవా..జీవించాడు అనలేం కానీ బాగా చేసాడు. కొత్తమ్మాయి హీరోయిన్ ..చూపులకు బాగుంది.
ఫైనల్ థాట్
జీవా నటించిన ప్రతీ సినిమా రంగం కాదు...రాజ్ మురగన్ డైరక్ట్ చేసిన ప్రతీది జోకర్ కాదు
--సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5
--
నటీనటులు : జీవా, నటాషా సింగ్, లాల్ జోష్ తదితరులు
దర్శకత్వం : రాజు మురుగన్
నిర్మాత : అంబేద్ కుమార్
సంగీతం : సుశీల రామన్, సంతోష్ నారాయణన్