కొత్త లీక్ :రజనీ పార్టీ గుర్తు “ సైకిల్ ”కాదట ...మరి?
కేవలం తమిళనాట మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ సూపర్‌స్టార్ రజనీకాంత్ కు వీరాభిమానులు ఉన్నారు. దాంతో వారంతా ఆయన ప్రకటించబోయే రాజకీయ పార్టీ గురించే చర్చల్లో మునిగి తేలుతున్నారు. డిసెంబర్ 31న తన రాజకీయ పార్టీ గురించి మరిన్ని విషయాలు ప్రకటిస్తానని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ పార్టీకి సంబంధించిన ఎలాంటి చిన్నవార్త కూడా బయటికి రాకూడదని తన టీమ్ కి గట్టిగానే సూచించారట. ఇదంతా ఇలా ఉండగా.. ఆయన పార్టీ గుర్తు ఫలానా అంటూ వినిపిస్తున్న వార్తలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇప్పటికే సైకిల్ అని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడది కాదు అంటున్నారు. మరేంటి ఆయన గుర్తు అనేది హాట్ టాపిక్ గా మారింది.
గత నాలుగు రోజులుగా ఆయన పార్టికు సైకిల్ గుర్తుని ఎంచుకున్నారని వార్తలు వచ్చాయి. ‘అన్నామలై’ సినిమాలో రజనీకాంత్ సైకిల్‌పై తిరుగుతూ పాలు విక్రయిస్తూ కనిపించారు. ఈ సినిమాతో రజనీకి మాస్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. అందుకే ఆ సినిమా స్ఫూర్తిగా సైకిల్ గుర్తును ఎంచుకునే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే రజనీకాంత్ అడిగింది సైకిల్ గుర్తు కాదు ఆటో అని తెలిసింది.
“నేను ఆటోవాన్ని ఆటోవాన్ని…”అంటూ రజినీకాంత్ పాడే పాట, ఆ పాటకు ఆయన వేసిన స్టెప్ అప్పట్లో సెన్సేషన్. “బాషా” సినిమాలోని ఈ పాట రజినీకాంత్ ని తమిళనాడులోని ప్రతి ఆటోవాలాని అభిమానిగా మార్చేసింది.
దాంతో అప్పటికే మాస్ హీరోగా టాప్ రేంజులో ఉన్న రజినీకాంత్… ఈ సినిమాతో సౌతిండియా సూపర్ స్టార్ గా నిలిచారు. ఇప్పుడు రజినీకాంత్ 70 ఏళ్ళు. ఈ వయసులో ఆయన పార్టీ పెడుతున్నారు. పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తున్నది ఏంటంటే రజినీకాంత్ తన పార్టీ సింబల్ గా ఆటో గుర్తు కావాలని కోరారని టాక్.
రజనీ సైకిల్ గుర్తుకి ప్రయత్నిస్తున్నారు అని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. కానీ “ఆటో” అయితేనే తన ఇమేజ్ కి బెటర్ అని ఆయన ఫిక్స్ అయ్యారట. ఎన్నికల సంఘం కూడా దీనికి ఒప్పుకున్నట్లు సమాచారం.
అలాగే ఆయన చివరిసారిగా మీడియా ముందు కనిపించినప్పుడు ‘రాక్ ఆన్’ ఎమోజీ (బాబా సినిమా లోగో) అభిమానులకు చూపిస్తూ అభివాదం చేశారు. చూపుడు వేలు, చిటికెన వేలు మాత్రమే తెరచి.. మిగిలిన వేళ్లను మూడిచి ఉండే రాక్ ఆన్ ఎమోజీనే ఆయన పార్టీ గుర్తు అయి ఉండవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, రజినీకాంత్ పార్టీ పేరు గురించి ఎన్నో ఊహాగానాలు సాగుతున్నాయి. “మక్కల్ సేవై కచ్చి” (ఎం.ఎస్.కే) అనే పేరు దాదాపుగా ఖరారు అయిందని అంటున్నారు.
ఇటీవల ఢిల్లీ వెళ్లి తన పార్టీని ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేయించుకున్నారు. ఐతే పార్టీ పేరుని రజినీకాంత్ నెక్స్ట్ మంత్ ప్రకటిస్తారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మాత్రం.. పార్టీ అధికారిక ప్రకటన వెలువడే వరకూ వేచి చూడాల్సిందే.
మరో ప్రక్క రజనీకాంత్ పార్టీ ప్రకటనకు వేదికను ఎంపిక చేసే పనిలో పడిపోయింది ఆయన టీమ్.. తిరుచ్చి లేదా మదురై అయితే బాగుంటుందని భావిస్తున్నారట..!
అయితే, కోవిడ్ కారణంగా భారీ బహిరంగ సభకు అనుమతి ఇస్తారా? లేదా..? అనుమతి ఇవ్వకపోతే ఏం చేద్దాం.. అనుమతి ఇస్తే ఎలా నిర్వహిద్దాం అని కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారట.
ఈ నెల 31న రాజకీయ పార్టీ ప్రకటన, జనవరిలో పార్టీతో ప్రజల్లోకి రజనీ రావడం ఖాయమై పోయింది.. డిసెంబరు 31న పార్టీకి సంబంధించిన తొలి ప్రకటన వస్తుందని, మరిన్ని వివరాలు జనవరిలో వెల్లడిస్తానని ఇప్పటికే వెల్లడించారు రజనీ.. దీంతో.. పార్టీ జెండా, ఎజెండా, ఎన్నికల గుర్తు.. తదితర అంశాలపై రకరకాల చర్చలు హాట్ టాపిక్ అయ్యాయి.
తలైవా నటిస్తున్న ‘అన్నాథె’ సినిమా చిత్రీకరణ కరోనా మహమ్మారి వల్ల ఆగిపోయింది. వచ్చే జనవరిలో తిరిగి చిత్రీకరణలో పాల్గొంటానని రజనీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ సినిమాలో ఆయన ఓ పవర్ఫుల్ గ్రామ సర్పంచ్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. అందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా ఓ గ్రామ నమూనాలో సెట్ ఏర్పాటు చేశారు. ‘విశ్వాసం’ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్ కథానాయిక. ప్రకాశ్‌రాజ్, ఖుష్భూ, మీనా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. చిత్రానికి వసంత్ దినకరన్ సంగీతం అందించనున్నారు.
‘‘త్వరలో జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ప్రజల ఆదరణతో గెలిచి రాష్ట్రంలో నిజాయితీ, న్యాయమైన, కులమతాలకు అతీతమైన అధ్యాత్మిక రాజకీయాలకు నాంది పలకడం నిశ్చయం. అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతాయి. మారుస్తాం.. అన్నింటినీ మారుస్తాం. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు’’ అని రజనీకాంత్ ట్విటర్లో పేర్కొన్నారు.