`అంబాజీపేట మ్యారేజి బ్యాండు` మూవీ రివ్యూ, రేటింగ్..
సుహాస్ హీరోగా రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఆయన `అంబాజీపేట మ్యారేజి బ్యాండు` చిత్రంతోరాబోతున్నారు. ఈ మూవీ ప్రీమియర్స్ ప్రదర్శించారు. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
యంగ్ హీరో సుహాస్.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్లో హీరోగా నిలబడేందుకు, నటుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు శ్రమిస్తున్నాడు. `కలర్ ఫోటో` వంటి జాతీయ అవార్డు చిత్రంలో నటించి మెప్పించారు. ఆ మధ్య `రైటర్ పద్మభూషణ్` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు `అంబాజీపేట మ్యారేజి బ్యాండు` మూవీతో వచ్చాడు. కంటెంట్‌ని నమ్ముకుని చేసిన సినిమా ఇది. నూతన దర్శకుడు దుశ్యంత్ కటికనేని దర్శకత్వం వహించారు. సుహాస్‌కి జోడీగా శివానీ నాగారం నటించింది. శరణ్, `పుష్ప` జగదీష్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ నేడు శుక్రవారం(ఫిబ్రవరి 2)న విడుదలైంది. ముందుగా ప్రీమియర్స్ ప్రదర్శించారు. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. అంబాజీపేట అనే గ్రామంలో మ్యారేజీ బ్యాండు కొడుతూ, మరోవైపు కటింగ్ షాప్ నడిపిస్తూ ఉంటాడు మల్లీ(సుహాస్). అతను పద్మవతి(శరణ్య) కవలలు. ఆమె స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుంటుంది. మల్లీకి పెద్దింటికి చెందిన వెంకట్ బాబు(నితిన్ ప్రసన్న) చెల్లి లక్ష్మి(శివానీ నాగారం) అంటే చాలా ఇష్టం. రోజూ తన షాప్ నుంచి కాలేజీకి వెళ్తున్న లక్ష్మిని చూస్తూ ముసిముసినవ్వులు నవ్వుతాడు మల్లీ. అతన్ని లక్ష్మి కూడా చూస్తుంది. ఇద్దరు ప్రేమించుకుంటారు. ఆమెకి లవ్ లెటర్ కూడా రాస్తాడు. ఆమె ఒప్పుకోవడంతో ప్రేమ కథ ప్రారంభవుతుంది. తన కటింగ్ షాప్‌నే అడ్డాగా చేసుకుని పిచ్చిపిచ్చిగా ప్రేమించుకుంటారు. అయితే ప్రేమవరకు ఓకే గానీ, పెళ్లి వరకు వెళ్లడం కష్టమని, తమ ఫ్యామిలీ వేరు, మీ ఫ్యామిలీ వేరు పెద్ద గొడవ అవుతుందని లక్ష్మి..మల్లీని హెచ్చరిస్తూనే ఉంటుంది. కానీ అతనంటే చచ్చేంత ప్రేమని లోపల దాచుకుంటుంది. మరోవైపు మల్లీ అక్క పద్మని ఊర్లో పోరగాళ్లు, అలాగే వెంకట్‌బాబు తమ్ముడు అవమానిస్తాడు. అసభ్యంగా మాట్లాడతారు. దీంతో మల్లీకి, అతనికి మధ్య గొడవ అవుతుంది. పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుంది. దీంతో శరణ్యని బట్టలు లేకుండా చేసి అవమానిస్తాడు వెంకట్ బాబు. ఈ విషయంలో తెలిసి కోపంతో వెంకట్బాబుపైకి వెళ్తాడు మల్లీ. ఈ గొడవలో అతని గుండు గీయిస్తారు. ఇది పెద్ద గొడవ అవుతుంది. పోలీస్ స్టేషన్లో జరిగే గొడవలో వెంకట్బాబుని తన్నుతుంది పద్మ. మరోవైపు తన చెల్లి లక్ష్మి, మల్లీ మధ్య ఉన్న ప్రేమ విషయం వెంకట్‌కి తెలుస్తుంది. దీంతో ఓ వైపు అవమానం, మరోవైపు చెల్లిని ప్రేమించడం, అలాగే తమపై తిరుగుబాటు జరుగుతున్న నేపథ్యంలో వెంకట్ బాబు ఏం చేశాడు? లక్ష్మి మల్లీకి సొంతమైందా? శరణ్యకి జరిగిన అవమానం ఏంటి? ఈ విషయంలో ఎలా రియాక్ట్ అయ్యారు? ఈ గొడవలు ఎంత దూరం వెళ్లాయి? వారిలైఫ్లను ఎలా మార్చేశాయి? చివరికి ఏం జరిగిందనేది మిగిలిన కథ.
విశ్లేషణః
గ్రామంలో ధనిక పేద మధ్య వ్యత్యాసాలు, సంఘర్షణ, ఎక్కువ తక్కువ అనే గొడవల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. `ఖైదీ`కి ముందు నుంచి, ఆ తర్వాత కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. ఆత్మాభిమానం కోసం పేద వాళ్లు, తక్కువ కులం వాళ్లు చేసే తిరుగుబాటు, పోరాటం అంతిమంగా సినిమా కథా వస్తువుగా ఉంటుంది. చాలా సినిమాలకు ఇదే మెయింట్ కాన్ల్ఫిక్ట్ పాయింట్. వాటి చుట్టూత ఎమోషన్స్ ని, డ్రామాని క్రియేట్ చేస్తూ సినిమా చేసి మెప్పించారు దర్శకులు. చాలా వరకు ఇలాంటి కథాంశంతో వచ్చిన చిత్రాలు పెద్ద విజయాలు సాధించాయి. ఇది అప్పుడు, ఇప్పుడు సక్సెస్ ఫార్మూలాగానూ మారింది. ఈ క్రమంలో తాజాగా `అంబాజీపేట మ్యారేజి బ్యాండు` అనే మూవీ కూడా అలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కించిన చిత్రం. పెద్దింటి వాళ్లు తక్కువ కులం వారిని అవమానించడం, అప్పుల పేరుతో ఆస్తులు లాక్కోవడం, పేద, ధనికుల మధ్య ప్రేమ అనే పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. కథగా ఇది పాత అంశమే అయినా, దానికి కొత్త ట్రీట్మెంట్ ఇచ్చి, కొన్ని మార్పులు చేసి `అంబాజీపేట మ్యారేజి బ్యాండు` చిత్రాన్ని రూపొందించినట్టుగా అనిపిస్తుంది.
ఇందులోనూ ఎక్కువ కులం అమ్మాయిని మ్యారేజీకి బ్యాండువాయించే అబ్బాయి మధ్య ప్రేమ, లేడీ టీచర్ని అవమానించి, అభాసుపాలు చేయడం ఇందులో జరిగిన మెయిన్ అంశం. దాన్ని చుట్టూనే కథ తిరుగుతుంది, పద్మ అనే పాత్రనే సినిమాని నడిపించే మెయిన్ పాయింట్‌గా మారింది. అయితే ఈ సినిమాలో చేసిన చిన్న మ్యాజిక్ ఏంటంటే ఇతర సినిమాల్లో ప్రేమ కోసం పోరాటం, ఇందులో అత్మాభిమానం కోసం పోరాటం హైలైట్‌గా చూపించారు. మొదటగా సుహాస్ పాత్రతో, ఆయన లవ్ ట్రాక్‌తో సినిమాని నడిపించి, ఇంటర్వెల్ వరకు పద్మ పాత్రలో నటించిన శరణ్యవైపు తిరుగుతుంది. ఆమె పాత్రనే హైలైట్ చేస్తూ తెరకెక్కించారు. మహిళా పాయింట్ ఆఫ్ వ్యూలో కథని చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఇందులో ఎమోషన్స్, డ్రామా యాడ్ అయ్యింది. సినిమా ప్రారంభం ఇంటర్వెల్ వరకు సరదాగా సాగుతుంది. సుహాన్, శివానీల మధ్య లవ్ ట్రాక్నే చూపించారు. అయితే విలేజ్‌లో జరిగే లవ్ స్టోరీ కావడంతో అంతే సహజంగా తెరకెక్కించారు. అప్పటి జనాలకు కనెక్ట్ అయ్యేలా చేశారు. లవ్ ట్రాక్ సీన్లు ప్రతి పల్లెటూరిలో యూత్‌కి ఆకట్టుకుంటుంది. వారిని ఆకర్షిస్తుంది. ఆ తర్వాత సినిమా మొత్తం సీరియస్ డ్రామావైపు టర్న్ తీసుకుంటుంది.
సెకండాఫ్ మొత్తం విలన్‌కి, హీరో ఫ్యామిలీ మధ్య, అక్కతో వారికిగొడవల మధ్య సంఘర్షణ, వార్ ప్రధానంగా సాగుతుంది. దాన్ని నెమ్మిదిగా హై ఇస్తూ క్లైమాక్స్ కి పీక్‌కి తీసుకెళ్లారు. ఎమోషనల్‌గా టర్న్ తీసుకున్నాడు. దీంతో ఆడియెన్స్ హృదయాలను బరువెక్కేలా ఉంటాయి. కథగా సినిమా ఓల్డ్ స్టోరీనే అయినా ట్రీట్మెంట్ బాగుంది. శరణ్య పాత్రని హైలైట్ చేయడం ఈ మూవీ హైలైట్‌లో ఒకటి. లేదంటే ఈ మూవీ కూడా రొటీన్‌గా మారిపోయేది. సెకండాఫ్ తర్వాత శరణ్యనే హీరోగా మారిపోతుంది. రెండు మూడు సీన్లలో ఆమె సుహాస్‌ని డామినేట్ చేసింది. పోలీస్ స్టేషన్లో విలన్ని తన్నే సీన్ హైలైట్‌గా చెప్పొచ్చు. అదే సమయంలో డైలాగులు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. థియేటర్లలో విజిల్స్ వేసేలా చేస్తాయి. అంత బాగా రాసుకున్నారు. ఎమోషన్స్, డ్రామా డోస్ పెంచి ఆడియెన్స్ ని కట్టిపడేసే ప్రయత్నం చేశారు. దీంతో కథగా పాతదే అయినా ఎంగేజింగ్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అదే సినిమాని అందరికి ఆకట్టుకునేలా చేసింది.
నటీనటులుః
`అంబాజీపేట మ్యారేజి బ్యాండు` సినిమాకి నటీనటులే బలం. వాళ్ల అద్బుతమైన నటన సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తున్నారు. మల్లీ పాత్రలో లవర్ బాయ్‌గా, అటు అక్క కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడే పాత్రలో అదరగొట్టాడు. సినిమాకి ప్రాణం పోశాడు. అయితే మొదటి భాగంలో సుహాస్ హీరోగా, సెకండ్ లో శరణ్య హీరోగా కనిపిస్తుంది. పద్మ పాత్రలో శరణ్య అదరొట్టింది. సినిమా అటెన్షన్ మొత్తం తనవైపు తిప్పుకుంది. ఆమె కెరీర్‌కి నెక్ట్స్ లెవల్ ప్రదర్శన ఇచ్చింది. ఇకపై ఆమె లెక్క వేరే అనేలా చేసింది. హీరో ఫ్రెండ్ సంజీవ్‌గా జగదీష్ మెప్పించారు. వెంకట్ పాత్రలో నితిన్ అదరగట్టాడు. తెలుగులో ఆయనకు మంచి ఆఫర్లు క్యూ కడతాయి. గోపరాజు రమణ తనదైన పాత్రతో మెప్పించాడు. ఇతర పాత్రధారులు ఓకే అనిపించుకున్నారు.
టెక్నీషియన్లుః
సినిమాకి శేఖర్ చంద్ర మ్యూజిక్ పెద్ద ప్లస్. అయితే దీనికి `సలార్` రేంజ్ ఎలివేషన్లు లేవు, కానీ బ్యాండ్ బేస్డ్ మ్యూజిక్ వాహ్ అనిపించుకుంది. కొత్తగా ఉంది. ఆకట్టుకుంటుంది. సినిమాకి బ్యాక్ బోన్‌లా నిలిచింది. మరోవైపువాజిద్ బయాగ్ సినిమాటోగ్రాఫర్ వర్క్ చాలా బాగుంది. ఎడిటింగ్ పరంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిర్మాణం విషయంలో రాజీ లేదు. ఇక దర్శకుడు దుశ్యంత్ ఎంచుకున్న కథ బాగుంది, కానీ ఓల్డ్ స్టోరీ. ట్రీట్మెంట్ మాత్రం హైలైట్‌గా నిలిచింది. కథని తీసుకెళ్లిన తీరు ఆకట్టుకుంది. డైలాగులు సినిమాకి మరో ప్లస్ అయ్యాయి. ఆలోచింపచేసేలా, సమాజంలో ఉన్న తేడాలను అద్దం పట్టేలా రాసుకొచ్చాడు. బుల్లెట్ లాంటి డైలాగ్‌లో కేకలు పెట్టించారు.
ఫైనల్‌గాః `అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు` కొడితే రీ సౌండే.
రేటింగ్ః 3
నటీనటులుః సుహాస్, శివానీ నాగారం, శరణ్య, జగధీష్, నితిన్ ప్రసన్న, గోపరాజు రమణ, స్వర్ణకాంత్, వినయ్ మహదేవ్ తదితరులు.
టెక్నీషియన్లుః
మ్యూజిక్ః శేఖర్ చంద్ర, కెమెరామెన్ః వాజిద్ బాయిత్, ఎడిటింగ్ః కోదాటిపవన్ కళ్యాణ్. నిర్మాణంః జీఏ2, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్.