టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-6 స్పిన్నర్లు
most wickets in the ICC T20 World Cup : టీ20 ప్రపంచకప్‌లో స్పిన్ బౌలింగ్ కీలక పాత్ర పోషించింది. చాలా మంది స్పిన్నర్లు ప్రతి ఎడిషన్‌లో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. అయితే టీ20 ప్రపంచ కప్ లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసుకున్న టాప్-6 స్పిన్ బౌలర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
షకీబ్ అల్ హసన్ (50 వికెట్లు)
టీ20 ప్రపంచ కప్ లో మూడోసారి రోహిత్ శర్మను ఔట్ చేయడంతో బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ 42 మ్యాచ్‌ల్లో 19.74 సగటుతో 50 వికెట్ల రికార్డును అందుకున్నాడు.
అతని ఎకానమీ రేటు 6.92. టీ20 ప్రపంచ కప్ లలో 39 వికెట్లతో షాహిద్ అఫ్రిది తర్వాతి అత్యుత్తమ బౌలర్ ఇతనే. టీ20 ప్రపంచకప్ చరిత్రలో మూడు సార్లు నాలుగు వికెట్లు తీసిన ముగ్గురు బౌలర్లలో షకీబ్ ఒకడు. అతను 2007 నుండి మొదలైన ప్రతి టీ20 ప్రపంచ కప్ ఎడిషన్‌లో ఆడిన ఘనత కూడా సాధించాడు.
అతను 40-ప్లస్ మ్యాచ్‌లలో ఆడాడు. అంటే ఒక బౌలర్ గా అత్య ధిక మ్యాచ్ లు ఆడింది కూడా ఇతనే. ఓవరాల్‌గా టీ20ల్లో ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 150 వికెట్లు పడగొట్టాడు.
షాహిద్ అఫ్రిది (39 వికెట్లు)
షాహిద్ అఫ్రిది ఒకప్పుడు పాకిస్థాన్ జట్టుకు కీలక ప్లేయర్. 2009లో ట్రోఫీని గెలుచుకోవడంలో, 2007లో పాక్ జట్టు ఫైనల్స్‌కు చేరుకునేలా చేయడంలో అతని పాత్ర చాలా కీలకమైంది.
అఫ్రిది టీ20లు, ముఖ్యంగా టీ20 ప్రపంచ కప్ లలో అద్భుతమైన కెరీర్ తో తాను వీడ్కోలు పలికాడు. అఫ్రిది టీ20 ప్రపంచ కప్ లలో మొత్తం 39 వికెట్లు తీసుకున్నాడు.
రెండు సార్లు నాలుగేసి వికెట్లు తీసుకున్న అతని అత్యుత్తమ బౌలింగ్ 4/11. అతని ఎకానమీ రేటు 6.71. మొత్తంగా తన98 వికెట్లతో అఫ్రిది తన టీ20 కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
Wanindu Hasaranga
వనిందు హసరంగా (37 వికెట్లు)
టీ20ల్లో బలమైన శక్తిగా ఎదిగాడు శ్రీలంక ప్లేయర్ వానిందు హసరంగ. టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన మూడో బౌలర్ గా రికార్డు సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ లో ఈ శ్రీలంక ఆటగాడు అద్భుతంగా రాణించాడు.
కేవలం 19 మ్యాచ్ లలోనే 11.72 సగటుతో 38 వికెట్లు పడగొట్టాడు. ఈ కుడిచేతి వాటం స్పిన్నర్ 20కి పైగా వికెట్లు తీసిన బౌలర్లలో అతనిదే బెస్ట్ సగటు. ఇతని ఎకానమీ రేటు 6. టీ20ల్లో 100కు పైగా వికెట్లు తీసిన ఏకైక లంక స్పిన్నర్ హసరంగ. 15.43 యావరేజితో 110 వికెట్లు పడగొట్టాడు.
ఆడమ్ జంపా (36 వికెట్లు)
ఆడమ్ జంపా టీ20 ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శనలు ఇచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సూపర్ 8, గ్రూప్ 1 మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ రెండు వికెట్లు తీసిన తర్వాత 36 వికెట్లకు చేరుకున్నాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో జంపా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
అతను 13 వికెట్లను తీసుకున్నాడు. ప్రతి మ్యాచ్‌లో కనీసం ఒక్క వికెట్ అయిన తీసుకున్న బౌలర్. మొత్తంగా 20 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లలో 12.55 సగటుతో 36 వికెట్లు తీసుకున్నాడు. అతని ఎకానమీ రేటు 6.10.
మొత్తం 86 టీ20ల్లో 21.21 సగటుతో 105 వికెట్లు తీశాడు. టీ20ల్లో 100 ప్లస్ వికెట్లు తీసిన ఏకైక ఆసీస్ బౌలర్. టీ20 ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా జంపా నిలిచాడు.
సయీద్ అజ్మల్ (36 వికెట్లు)
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ టీ20 ప్రపంచకప్‌లో తన జట్టుకు సమర్ధవంతమైన సేవలను అందించాడు. 23 మ్యాచ్‌లు ఆడిన అతను 16.86 సగటుతో 36 వికెట్లు తీశాడు.
2009లో టైటిల్ విన్నింగ్ క్యాంపెయిన్‌లో అతను 12 వికెట్లు తీసుకోవడంతో పాటు కీలక సమయంలో వికెట్లు తీసుకుని పాకిస్తాన్ జట్టుకు ట్రోఫీని అందించడంలో విజయవంతమయ్యాడు.
ఓవరాల్‌గా అజ్మల్ పాకిస్థాన్ తరఫున టీ20ల్లో 85 వికెట్లు పడగొట్టాడు. అతను సగటు 17.83. ఎకానమీ రేటు 6.36.
రషీద్ ఖాన్ (33 వికెట్లు)
ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 బౌలింగ్ లెజెండ్. అన్ని జట్లపై కూడా అతను ప్రభావం చూపగల ప్లేయర్. రషీద్ 148 వికెట్లతో టీ20ల్లో 150 వికెట్లకు చేరువలో ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్ లలో 23 మ్యాచ్‌లు ఆడిన రషీద్ ఖాన్ 15.75 సగటుతో 33 వికెట్లు సాధించాడు.
అతని ఎకానమీ రేటు 6.31. రషీద్ అత్యంత వేగంగా 150 వికెట్లు పడగొట్టగలిగే రికార్డుకు చేరువగా ఉన్నాడు. ఇప్పటికే వేగంగా 100 టీ20 వికెట్లు తీసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా అన్ని లీగ్, అంతర్జాతీయ టీ20ల్లో రషీద్ 584 వికెట్లు తీశాడు.
అతను టీ20లలో అత్యంత విజయవంతమైన స్పిన్నర్. డ్వేన్ బ్రావో తర్వాత మొత్తం మీద అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్ రషీద్ ఖాన్.