3 ఏళ్లు ఆలస్యంగా నడిచిన ట్రైన్ గురించి ఎపుడైనా విన్నారా?
సాధారణంగా రైళ్లు కాస్త ఆలస్యంగా నడుస్తాయి. ఈ విషయం మనకు తెలుసు. అయితే ఒక రైలు తన గమ్యస్థానానికి చేరుకోవడానికి మూడు సంవత్సరాలు పట్టిందంటే మీరు నమ్మగలరా. ఇది నిజం. భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత నెమ్మదిగా ప్రయాణించిన రైలుగా ఈ ట్రైన్ రికార్డుల్లోకెక్కింది. ఆ ట్రైన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రండి.
ఇండియన్ రైల్వే నేడు కొత్త రికార్డులను సృష్టించడానికి సిద్ధంగా ఉంది. రైళ్ల వేగాన్ని పెంచడంతో పాటు, ప్రయాణికులకు విలాసవంతమైన సౌకర్యాలను అందించడానికి భారతీయ రైల్వే వేగంగా పనిచేస్తోంది. అయితే వీటన్నింటి మధ్య కొన్ని రైళ్లు ఇప్పటికీ నెమ్మదిగా కదులుతున్నాయి. అవి ఎప్పుడు గమ్యస్థానాలకు చేరుకుంటాయో వాటికే తెలియని పరిస్థితి నెలకొంది.
సాధారణంగా కొన్ని రైళ్లు రెండు, మూడు గంటలు ఆలస్యంగా నడుస్తాయి. మహా అయితే ఒక రోజు ఆలస్యంగా నడుస్తున్న ట్రైన్ల గురించి కూడా విని ఉంటారు. భారీ వర్షం కురవడం, కొండచరియలు విరిగిపడటం, మరమ్మతు పనుల కారణంగా ఇలా రైళ్లు నెమ్మదిగా ప్రయాణిస్తాయి.
కానీ ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న రైలు.. ఒకటి కాదు, రెండు కాదు, మూడు సంవత్సరాల తర్వాత తన గమ్యస్థానానికి చేరుకుంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ గూడ్స్ రైలును భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత నెమ్మదిగా ప్రయాణించిన రైలుగా పిలుస్తారు.
2014 నవంబర్‌లో విశాఖపట్టణం నుండి ఎరువులతో గూడ్స్ రైలు ఉత్తరప్రదేశ్‌లోని బస్తీకి బయలుదేరింది. ఈ రైలు తన నిర్ణీత మార్గంలో ప్రయాణిస్తోంది. రామచంద్ర గుప్తా అనే వ్యాపారికి చెందిన 14 లక్షల విలువైన 1,361 ఎరువుల బస్తాలు రైలులో ఉన్నాయి.
రైలు బయలు దేరిందన్న సమచారం తెలుసుకున్న రామచంద్ర గుప్తా తన సరుకు తీసుకోవడానికి ఉత్తరప్రదేశ్‌లో వేచి ఉన్నారు. రైలు మాత్రం సమయానికి స్టేషన్ కు రాలేదు. ఇదేంటి రైలు రాలేదని, రామచంద్ర గుప్తా ఆందోళన పడుతూ స్టేషన్ అధికారులను అడిగారు. వారు రైలు ఆలస్యానికి కారణం చెప్పలేకపోయారు. దీంతో రామచంద్ర గుప్తా నిరాశగా స్టేషన్ వద్దే ఎదురు చూశారు.
సరుకు రవాణా రైలు
సాధారణంగా విశాఖపట్టణం నుండి ఉత్తరప్రదేశ్‌లోని బస్తీకి రైలు చేరుకోవడానికి సుమారు 42 గంటల 13 నిమిషాలు పడుతుంది. కానీ ఈ రైలు 1,400 కి.మీ. దూరం ప్రయాణించడానికి మూడు సంవత్సరాలు పట్టింది. రామచంద్ర గుప్తా ప్రతి రోజు స్టేషన్ కు రావడం అధికారులను ఎక్వైరీ చేయడం నిరాశగా వెనుదిరిగి వెళ్లడం దినచర్యగా మారిపోయింది. కొన్ని నెలలకు విసిగిపోయాన రామచంద్ర గుప్తా రైలు గురించి అడగడం మానేశారు.
మూడు సంవత్సరాల తర్వాత రైలు బస్తీకి చేరుకుంది. అందులోని ఎరువులు మొత్తం పాడైపోయాయి. ఈ సమాచారం అందుకున్న రామచంద్ర గుప్తా కూడా ఎరువుల బస్తాలను తీసుకోవడానికి నిరాకరించారు. అయితే ఈ రైలు మూడు సంవత్సరాలు ఎందుకు ఆలస్యమైందో ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోవడం గమనార్హం. 2014 నవంబర్‌లో బయలుదేరిన ఈ రైలు 2018లో గమ్యస్థానానికి చేరుకుంది.