వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు స్లీపర్ కోచ్‌లో ప్రయాణించకూడదు: స్ఫష్టం చేసిన రైల్వే శాఖ
రిజర్వేషన్ చేయించుకున్నా.. వెయింటింగ్ లిస్టులో ఉండిపోయిన ప్రయాణికులు చాలా మంది స్లీపర్ కోచ్ లు ఎక్కి ప్రయాణించేస్తూ ఉంటారు. టీసీ వస్తే ఫైన్ కట్టడమో, ఖాళీగా ఉన్న సీటు రిజర్వ్ చేయించుకోవడమే చేస్తారు కదా..? అయితే ఇలా వెయింటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులు స్లీపర్ క్లాస్ బోగీల్లో ప్రయాణించడం కుదరదని, ఇలా చేయవద్దని రైల్వే శాఖ తేల్చి చెప్పింది. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
భారతదేశంలో రవాణా వ్యవస్థకు రైల్వే శాఖ వెన్నెముక లాంటిది. దూర ప్రయాణాలు చేసే అత్యధిక శాతం ప్రజలు ట్రైన్లలోనే ప్రయాణిస్తారు. రైళ్లలో ప్రయాణం సౌకర్యవంతంగా, అలసట లేకుండా ఉంటుందని ఎక్కువ మంది రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు.
రైళ్లలో ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు, స్లీపర్ కోచ్‌లు, జనరల్ బోగీలు ఉంటాయి. ఎయిర్ కండిషన్డ్, స్లీపర్ కోచ్‌లలో కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారు మాత్రమే ప్రయాణించాలి. జనరల్ టికెట్ తీసుకున్న వారు సాధారణ బోగీల్లోనే ఎక్కాలి.
కానీ గత కొన్ని నెలలుగా రైళ్లలోని స్లీపర్ కోచ్‌లలో రిజర్వేషన్ లేని ప్రయాణికులు, వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్న ప్రయాణికులు పెరిగిపోయారు. దీనివల్ల కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
ఉత్తర రాష్ట్రాలలో రిజర్వేషన్ లేని ప్రయాణికులు రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణించడం సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు కేరళ, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలలో కూడా వెయిటింగ్ లిస్ట్, రిజర్వేషన్ లేని టికెట్లతో రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది.
స్లీపర్ కోచ్‌లలో రిజర్వేషన్ లేని ప్రయాణికులు ఎక్కకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు రైల్వే శాఖను కోరుతున్నారు. ఇదే విషయంపై ఇటీవల రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత 3 సంవత్సరాలలో రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణించిన వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల వివరాలు రైల్వే శాఖ వద్ద ఉన్నాయా?" అని ఆయన ప్రశ్నించారు.
దీనికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లేవని సమాధానమిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిబంధనల ప్రకారం వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణించే అనుమతి లేదని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా నడిచే అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ స్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, పండుగలు, సెలవుల సమయంలో అదనపు రైళ్లు నడుపుతున్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
దేశంలో చాలా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్ కోచ్‌లను తగ్గించి, ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లను పెంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రిజర్వేషన్ లేని కోచ్‌లు తక్కువగా ఉండటం వల్లే స్లీపర్ కోచ్‌లలో ప్రయాణికులు ఎక్కుతున్నారని, రిజర్వేషన్ లేని కోచ్‌లను పెంచాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.