మీ పేరు మీద ఎన్ని సిమ్‌లున్నాయో తెలుసా? ఇలా చెక్ చేయండి
డిజిటల్ లావాదేవీల్లో మోసాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం కదా.. నేరగాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వారు నకిలీ సిమ్ కార్డుల ద్వారా మోసాలు చేస్తున్న విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆ నకిలీ సిమ్ కార్డులు మీ పేరు మీద కూడా ఉండొచ్చు. మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవండి.
ఈ రోజుల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎంత ఎక్కువగా జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. టీ తాగినా కూడా ఫోన్ పే, గూగుల్ పే వంటి ద్వారా పేమెంట్స్ చేస్తున్నాం. టీ తాగినంత ఈజీగానే డిజిటల్ మోసాలు కూడా పెరిగిపోయాయి. సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఓటీపీ మోసం, ఎస్ఎంఎస్, స్కానర్, లింక్ క్లిక్ చేయడం, వాట్సాప్ మోసం ఇలా రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మోసాల వల్ల చాలా మంది లక్షలాది రూపాయలు కోల్పోతున్నారు.
ఆ విధంగా నకిలీ సిమ్ కార్డ్ ల ద్వారా చేసే మోసాలు పెరిగిపోయాయి. ఇటీవల ఓ డిజిటల్ మోసం కేసులో పోలీసులు ఒక ఆధార్ కార్డుతో లింక్ చేయబడిన 658 సిమ్ కార్డులను గుర్తించారు. దీన్ని బట్టి నకిలీ సిమ్ కార్డుల ద్వారా మోసాలు ఎంత పెద్ద స్థాయిలో జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.
దూరసంచార శాఖ (DoT) నిబంధనల ప్రకారం ఒక ఆధార్ కార్డు ఉపయోగించి ఎన్ని సిమ్ కార్డులు ఉపయోగించవచ్చో మీకు తెలుసా? ఒక ఆధార్ కార్డులో ఒక వ్యక్తి 9 సిమ్ కార్డులను కలిగి ఉండటానికి అనుమతి ఉంది. జాయింట్ ఫ్యామిలీస్, పెద్ద కుటుంబాలకు ఒకే ఆధార్ నంబర్‌ను ఉపయోగించి ఎక్కువ కనెక్షన్‌లను తీసుకొనే వెసులుబాటు కూడా ఉంది.
అయితే ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తూ కొందరు మోసగాళ్లు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. దీని కోసం దూరసంచార శాఖ ఒక వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది.
tafcop.dgtelecom.gov.in (సంచార్ సాథి)ని సందర్శించడం ద్వారా వినియోగదారులు తమ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. పడిపోయిన, దొంగతనానికి గురైన మొబైల్స్ ని కూడా బ్లాక్ చేయవచ్చు.
మీ ఆధార్ కార్డు ఉపయోగించి ఎన్ని సిమ్ కార్డులున్నాయో తెలుసుకోవడానికి ఇలా చేయండి.
- సంచార్ సాథి అధికారిక వెబ్‌సైట్ www.sancharsathi.gov.inను ఓపెన్ చేయండి.
- ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఆప్షన్స్ లో Know the number of connections issued in your name ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- అందులో మీ ఫోన్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి.
- మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.
- మీ ఆధార్ కార్డుతో నమోదై ఉన్న మొబైల్ నంబర్‌ల వివరాలు మీకు కనిపిస్తాయి.
నోట్: దేశవ్యాప్తంగా ఎప్పుడూ ఎవరోఒకరు ఈ సైట్ ను ఉపయోగిస్తుండటం వల్ల బిజీగా ఉంటుంది. అందువల్ల డాటా తీసుకోవడానికి, ఇవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఓపిగ్గా ప్రయత్నించండి.