ఈ కండీషన్స్‌లో ఆడపిల్లలు కూడా తల్లిదండ్రుల పెన్షన్ పొందొచ్చు
ప్రభుత్వ ఉద్యోగి మరణించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు కొన్ని ప్రయోజనాలు అందుతాయి. సాధారణంగా కుమారులకు వారసత్వంగా ఆ ప్రయోజనాలు లభిస్తాయి. మరి ఆడపిల్లలకు ఈ బెనిఫిట్స్ అందుతాయా? ముఖ్యంగా కుమార్తెలు తల్లిదండ్రుల పెన్షన్ పొందడానికి అర్హత ఉందో లేదో వివరంగా తెలుసుకుందాం రండి.
కొడితే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎందుకంటారంటే.. ఆ ఉద్యోగంలో ఉన్నా, రిటైర్ అయినా ఎన్నో ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగి బతికి ఉండగా ప్రభుత్వ క్వార్టర్స్, టీఏ, డీఏ, బోనస్ ఇలా అనేక రకాల అలవెన్సులు అందుతాయి. దురదృష్టవశాత్తూ ప్రభుత్వ ఉద్యోగి మరణించినా ఆయన కుటుంబానికి ప్రభుత్వం నుంచి అనేక ప్రయోజనాలు అందుతాయి. పీఎఫ్, పెన్షన్, ఇన్సూరెన్స్ ఇలా అనేక సేవలు అందుతాయి.
2021 కేంద్ర పౌర సేవల (పింఛను) నియమాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి కొంత పింఛను ఇస్తారు. దీన్ని హౌస్ పింఛను అంటారు. ఈ కుటుంబ పింఛను కోసం ఉద్యోగి తన కుటుంబ సభ్యుల పేర్లను నామినేట్ చేస్తారు. అందువల్ల వారి మరణం తర్వాత కూడా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది.
కేంద్ర పౌర సేవల (పింఛను) నియమాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం చేసే తల్లిదండ్రుల పెన్షన్ పొందడానికి ఆడపిల్లలకు కూడా అర్హత ఉంది. అయితే ఈ పెన్షన్ పొందాలంటే కొన్ని కండీషన్స్ ఉన్నాయి.
ఈ అర్హతలు తప్పనిసరి..
పెళ్లి కాని కుమార్తెలు హౌస్ పెన్షన్ పొందొచ్చు. 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు, సంపాదన లేకుండా జీవిస్తున్న పెళ్లికాని ఆడపిల్లలు తమ తల్లిదండ్రుల పెన్షన్ పొందడానికి అర్హులే. వీరే కాకుండా విడాకులు తీసుకున్న కూతుళ్లు కూడా తమ తల్లిదండ్రుల పెన్షన్ తీసుకోవచ్చు. విడాకులు తీసుకున్న కుమార్తె డైవర్స్ మంజూరు అయిన తర్వాత మాత్రమే హౌస్ పింఛనుకు అర్హురాలు అవుతారు. వికలాంగులైన కుమార్తెలు వయస్సుతో సంబంధం లేకుండా తల్లిదండ్రుల పెన్షన్ పొందే అర్హత కలిగి ఉంటారు.
ఒకవేళ ఉద్యోగం చేస్తున్న తన కుమార్తె పేరును ప్రభుత్వ ఉద్యోగి నామినీగా చేర్చితే మరణానంతరం కుమార్తె సంపాదన, సపోర్ట్, తదితర విషయాలు పరిగణించి అప్పుడు ఆమెకు ఎంత పెన్షన్ లభిస్తుందో ప్రభుత్వ అధికారులు నిర్ణయిస్తారు.
ఆడ పిల్లలు ఇద్దరు, ముగ్గురు ఉంటే వారిలో పెద్ద కుమార్తె, పెళ్లి కాని కుమార్తెకి హౌస్ పింఛన్ పొందడానికి అర్హత ఉంటుంది. ఈ కేస్ స్టడీలో తల్లిదండ్రులిద్దరూ మరణించి ఉంటేనే పెద్ద, అవివాహిత కుమార్తె కు పెన్షన్ వస్తుంది.
ఒకవేళ కవలయితే హౌస్ పెన్షన్ మొత్తాన్ని వారి ఇద్దరికీ సమానంగా పంచుతారు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఇద్దరి పెన్షన్లు వారు పొందొచ్చు.
కుమార్తె దత్తత తీసుకున్న అమ్మాయి అయితే హౌస్ పింఛన్ పొందడానికి అనర్హులు అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈ కేస్ స్టడీలో కుమార్తె ఒరిజినల్ తల్లిదండ్రుల ఆర్థకి పరిస్థితి, ఇతర విషయాలను పరిగణిస్తారు.
ఇలా మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగుల కుమార్తెలు కూడా పెన్షన్ పొందడానికి అర్హులేనన్న మాట.