ఖతర్‌లో కథ వేరే ఉంటది.. తస్మాత్ జాగ్రత్త! ఈ 5 విషయాలు తూచా తప్పకుండా పాటించాల్సిందే..
FIFA World Cup 2022: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రపంచపు ఫుట్‌బాల్ అభిమానుల కళ్లన్నీ ఇప్పుడు ఖతర్ మీదే ఉన్నాయి.
క్రికెట్ ప్రపంచకప్ తర్వాత ప్రపంచ క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో క్రీడాసంగ్రామం ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్. నవంబర్ 20 నుంచి గల్ఫ్ దేశం ఖతర్ వేదికగా ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కాబోతుంది. ఈ టోర్నీని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఖతర్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో మాదిరిగా ఈ టోర్నీ యూరోపియన్ దేశాలలో కాదు. యూరప్ లో అయితే అక్కడ విచ్చలవిడిగా పార్టీలు, డ్రగ్స్ వినియోగం, సెక్స్ వంటివి సర్వ సాధారణం. ఈసారి ప్రపంచకప్ జరిగేది ఖతర్ లో. అది సంప్రదాయక ముస్లిం దేశం. అక్కడ కథ వేరే ఉంటది.
ఖతర్ ముస్లిం వాద దేశం కావడంతో అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ముస్లిం చట్టం షరియా ప్రకారం శిక్షలు విధిస్తారు. ఖతర్ కు గనక వెళ్లే ప్లాన్స్ ఉంటే ఈ ఐదు విషయాలను తూచా తప్పకుండా పాటించాల్సిందే.. అవేంటంటే..
1. ఆల్కహాల్ : యూరప్ దేశాలలో మాదిరిగా ఎక్కడపడితే అక్కడ మద్యం తాగడం చట్టరీత్యా నేరం. సాధారణంగా లైసెన్స్ పొందిన హోటల్స్, బార్లలో మాత్రమే అక్కడ మద్యం దొరుకుతుంది. రోడ్ల మీద ఇష్టారీతిన తాగుతానంటే మాత్రం కుదరదు. అలా చేస్తే ఖతర్ జైళ్లలో ఊసలు ఎన్ని ఉన్నాయనేది లెక్కించాల్సిందే. కానీ ఈ టోర్నీ నేపథ్యంలో అక్కడ మ్యాచ్ లు జరిగే స్టేడియాలు, ఫ్యాన్ జోన్ లలో ‘బడ్వైజర్’ బీర్స్ తాగడానికి అనుమతి ఉంది. ఫ్యాన్ జోన్ లలో ఈవినింగ్ మాత్రమే తాగాలి. పొద్దస్తమానం తాగుతామంటే కుదరదు. కాగా ఫిఫా ప్రపంచకప్ దృష్ట్యా తాగి రోడ్లమీదకు వచ్చేవారిని చూసీ చూడనట్టు వ్యవహరించాలని ఖతర్ ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలిచ్చింది. చనువిచ్చింది కదా అని తాగి రోడ్లమీద పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేస్తే మాత్రం అంతే సంగతులు.
2. డ్రగ్స్ : ఈ పేరెత్తితేనే ఖతర్ పోలీసులు ఊగిపోతారు. మారు మాట లేకుండా తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. పరిమాణం ఎంత ఉందనేది అవసరం లేదు.. డ్రగ్స్ కనబడితే ఊచలు లెక్కించాల్సిందే. మందు విషయంలో కాస్త చూసీ చూడనట్టు ఉండే పోలీసులు డ్రగ్స్ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించనున్నారు. ఖతర్ విమానాశ్రయంలో దిగినప్పట్నుంచే డ్రగ్స్ మీద అవగాహన ఏర్పరిచే బోర్డులు, హోర్టింగులు, అడ్వర్టైజ్మెంట్ లను విరివిగా ప్రచారం చేస్తున్నారు. డ్రగ్స్ తో పట్టుబడితే స్వంత దేశాన్ని మరిచిపోవడమే..
3. సెక్స్ : వివాహం కాని పురుషుడు, స్త్రీ సెక్స్ చేసుకోవడం అక్కడి చట్టాల ప్రకారం నేరం. అందుకు చట్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ముస్లిం దేశాలలో ఈ నేరానికి శిక్షలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. యూరోపియన్ దేశాల మాదిరిగా రోడ్లమీదే ముద్దులు, పొదలచాటున పని కానిచ్చేయడాలు ఇక్కడ కుదరవు. సాధారణ సమయాల్లో అయితే పెళ్లి కాని అమ్మాయి, అబ్బాయి ఒకరి చేతిని ఒకరు పట్టుకుని నడిచినా ఖతర్ లో తీవ్ర పరిణామాలుంటాయి. కానీ ఫిఫా ప్రపంచకప్ కారణంగా అక్కడి ప్రభుత్వం ఈ విషయంపై మరీ అంత కఠినంగా వ్యవహరించొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. హోటల్ లలో పెళ్లికాని యువతీ యువకులు రూమ్ లు షేర్ చేసుకోవచ్చు. కానీ పబ్లిక్ ప్లేస్ లలో మాత్రం ‘నో టచింగ్స్, నో కిస్సింగ్స్..’. ఇక గే, లెస్బియన్ ల విషయంలో మాత్రం ఖతర్ ప్రభుత్వం ‘తగ్గేదేలే’ అన్నట్టుగా వ్యవహరిస్తుంది. ఇలాంటివి పోలీసుల దృష్టిలోకి వస్తే చిప్పకూడే గతి.
4. డ్రెస్ కోడ్ : సంప్రదాయ ముస్లిం దేశమైన ఖతర్.. ఫిఫా చూడటానికి వచ్చే పర్యాటకులు ఇక్కడి సంస్కృతిని గౌరవించాలని అభ్యర్థిస్తున్నది. జబ్బలు, తొడలు కనిపించేలా డ్రెస్సులు వేసుకోకూడదని.. స్థానిక సంప్రదాయాలను గౌరవించాలని కోరింది. మసీదులు, ప్రార్థనా స్థలాలకు వెళ్లే వాళ్లు మాత్రం తప్పనిసరిగా అక్కడి డ్రెస్ కోడ్ ను పాటించాలి.
5. చిన్నచిన్నవే కదా అని చేస్తే : ఖతర్ లో పోలీసులకు గానీ ఇతరులకూ ‘మిడిల్ ఫింగర్’ చూపించడం పెద్ద నేరం కిందే లెక్క. ఇతరదేశాలలో దీని గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఖతర్ లో అలా కాదు. ఇలాంటి నేరానికి పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు. అపోజిట్ సెక్స్ (పురుషులు, స్త్రీలు) కు వాళ్ల అనుమతి లేకుండా షేక్ హ్యాండ్ ఇవ్వడం.. ఇతరుల అనుమతి లేకుండా వాళ్లను ఫోటోలు తీయడం.. ప్రార్థనాస్థలాలు, మిలిటరీ ప్రదేశాలలో సెల్ఫీలు తీసుకోవడం.. స్థానికుల గురించి రాజకీయాల గురించి చర్చలు పెట్టడం.. రాజ కుటుంబీకులను తులనాడటం వంటివి నేరాల కిందే లెక్క.. పర్యాటకులుగా వెళ్లినవాళ్లు ఏదో వెళ్లామా.. చూశామా.. వచ్చామా.. అన్నట్టు ఉండాలే తప్ప అక్కడి ప్రభుత్వవ్యవస్థపై కించిత్ విమర్శ చేసినా, ఫేక్ న్యూస్ ప్రచారం చేసినా ఖతర్ జైలు గోడల్లో ఏండ్లకేండ్లు గడపాల్సిందే.
అందుకే ఖతర్ లో కథ వేరే ఉంటది.. తస్మాత్ జాగ్రత్త..!!