FIFA: ఆ ముగ్గురు మహిళలకు ఏ రూల్స్ వర్తించవు.. ఎలా ఉన్నా అడిగేటోడు లేడు..
FIFA World Cup 2022: ఖతర్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ లో ఆతిథ్య దేశం లెక్కకు మించిన నిబంధనలను తీసుకొచ్చింది. మద్యం, డ్రెస్ కోడ్, సెక్స్, గే సెక్స్ వంటివాటిపై నిషేధం విధించింది. కానీ..
సంప్రదాయక ముస్లింవాద దేశమైన ఖతర్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ రోజుకో వివాదంతో వార్తల్లోకెక్కుతున్నది. ఖతర్ కు ప్రపంచకప్ ఆతిథ్యమిస్తుందని తెలిసినప్పట్నుంచి ఈ వివాదాలకు కొదవే లేదు. మద్యపాన నిషేధం, అసహజ శృంగారంపై కొరడా, కఠిన నిబంధనల నడుమ ఖతర్ లో ప్రపంచకప్ సాగుతున్నది. అయితే ఎన్ని నిబంధనలు ఉన్నా ఈ ముగ్గురికి మాత్రం ఎటువంటి బంధనాలు లేవు. ఎవరా ముగ్గురు..? ఏంటి వాళ్ల స్పెషాలిటీ..?
ఖతర్ కు ఫుట్‌బాల్ మ్యాచ్ లు చూసేందుకు వచ్చే ఫ్యాన్స్ ఇక్కడి సంప్రదాయాలను గౌరవించాలని ఆ దేశ ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని, మహిళలు భుజాలు, తొడలు కనిపించే విధంగా బట్టలు వేసుకోరాని ఆదేశించింది. కానీ ఫిఫాకు వచ్చిన ముగ్గురు మహిళలకు మాత్రం ఈ నిబంధనాలేవీ వర్తించవు. ఆ ముగ్గురే మ్యాచ్ రిఫరీలు.
ఫిఫా ప్రపంచకప్ చరిత్ర లో తొలిసారిగా మహిళా రిఫరీలను నియమించారు. జపాన్ కు చెందిన యమషిత యోషిమి, రువాండాకు చెందిన సలీమ ముకనసంగ, ఫ్రెంచ్ మహిళ స్టీఫెన్ ఫ్రెపారి లు ఫిఫా మ్యాచ్ లకు రిఫరీలుగా వ్యవహరిస్తున్నారు. మిగతావారి మాదిరిగా వీరికి ఏ రూల్స్ లేవు. మరీ ముఖ్యంగా బట్టల విషయంలో వీరికి నచ్చినట్టుగా ఉండొచ్చు. ఈ మేరకు ఫిఫా కూడా ప్రత్యేక చొరవ వహించి వారికి మినహాయింపు వచ్చేలా కృషి చేసింది.
మ్యాచ్ అఫీషియల్స్ గనక వీళ్లు సంప్రదాయ దుస్తువులు వేసుకుంటే మ్యాచ్ నిర్వహించడం సాగదు. ఆటగాళ్ల మాదిరిగానే షాట్స్ వేసుకుని గ్రౌండ్ లో వాళ్లతో పరుగెత్తాల్సి ఉంటుంది. దీంతో వీరికి ఫిఫా వీరికి ప్రత్యేక మినహాయింపునిచ్చింది.
అయితే చనువిచ్చింది కదా అని ఎక్కడబడితే అక్కడ ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే కుదరదు. ఈ ముగ్గురు మహిళలు ప్రధానంగా దృష్టి సారించాల్సింది మ్యాచ్ ల మీద. ఇదే విషయమై సలీమ మాట్లాడుతూ.. ‘మేమిక్కడికొచ్చింది ఫుట్‌బాల్ మ్యాచ్ ల కోసం. ఆ విషయం మేం మరిచిపోకూడదు. ఆటను మరో లెవల్ కు తీసుకెళ్లాలి’ అని తెలిపింది. ఫిఫా రిఫరీస్ కమిటీ చైర్మెన్ కొలినా మాట్లాడుతూ.. ‘అవును. ఖతర్ లో నిబంధనలు కఠినంగా ఉన్న మాట వాస్తవమే. కానీ వాళ్లు మ్యాచ్ అఫిషీయల్స్. వారికి బంధనాలు పెడితే మ్యాచ్ నిర్వహణ కష్టం. అందుకే కొన్ని ప్రత్యేక మినహాయింపులిచ్చాం..’ అని తెలిపాడు.