సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ తన పెద్ద మనసును చాటుకుంటున్నాడు యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌. ఇటీవల కరోనా సహాయార్థం కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన బాహుబలి. తాజాగా గ్రీన్ ఇండియా కార్యక్రమంలోనూ తన వంతు బాధ్యతగా ముందుకు వస్తున్నాడు. ఏకంగా 1650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకొని ఎంతో మంది సెలబ్రిటీలకు ఆదర్శంగా నిలిచాడు. టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్ చొరవతో ఈ నిర్ణయం తీసుకున్న ప్రభాస్‌.

ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభాస్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖుల సమక్షంలో కాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్ కు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ లు పాల్గొన్నారు. దుండిగల్ సమీపంలో ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ప్రభాస్‌ దత్తత తీసుకున్నాడు. తన తండ్రి యూవీఎస్‌ రాజు పేరు మీద ఈ అర్బన్‌ పార్క్‌ను అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు ప్రభాస్.

ఈ మేరకు ప్రభుత్వానికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభాస్‌, అవసరమైతే మరింత డబ్బు ఇచ్చేందుకు సిద్ధమంటు తెలిపాడు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ తో పాటు ఎంపీ సంతోష్‌ కూడా మొక్కలు నాటారు. అక్కడి వ్యూ పాయింట్‌ నుంచి అటవీ అందాలను చూసిన ప్రభాస్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ మాట్లాడుతూ మరిన్ని అర్బన్‌ ఫారెస్ట్‌ల దత్తతకు ప్రయత్నిస్తామని తెలిపాడు.

"