ఇటీవల కాలంలో రీ రిలీజ్‌ సినిమాల ట్రెండ్‌ నడుస్తుంది. అదే సమయంలో అభిమానులు థియేటర్లని ధ్వంసం చేయడం కూడా పెరుగుతుంది. తాజాగా `తొలిప్రేమ` థియేటర్‌లో అలాంటి ఘటన చోటు చేసుకుంది.

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన `తొలిప్రేమ` సినిమా అప్పట్లో ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. 1998లో వచ్చిన ఈ సినిమా ఓ ట్రెండ్‌ సెట్టర్‌, యూత్‌ని బాగా ప్రభావితం చేసిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాతోనే వేలాది మంది యువత పవన్‌కి అభిమానులుగా మారిపోయారు. ఈ సినిమా విడుదలై 25ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శుక్రవారం రీ రిలీజ్‌ చేశారు. ఇటీవల సూపర్‌ హిట్‌ సినిమాల రీ రిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తున్న నేపథ్యంలో నిర్మాతలు `తొలిప్రేమ 4కే` వెర్షన్‌ రీ రిలీజ్ చేశారు. దాదాపు 300లకుపైగా థియేటర్లలో సినిమాని రిలీజ్‌ చేయడం విశేషం. దీనికి మంచి స్పందన లభించింది.

ఇదిలా ఉంటే రీ రిలీజ్ ల సమయంలో థియేటర్లని ధ్వంసం చేయడం ఇటీవల తరచూ జరుగుతుంది. కొంత మంది దుండగులు థియేటర్లలో నానా హంగామా చేస్తున్నారు. సీట్లు చించేయడం, స్క్రీన్లని కోసేయడం, లేదంటే నిప్పు పెట్టడం చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు `తొలి ప్రేమ` సినిమాకి కూడా చోటు చేసుకుంది. విజయవాడ సమీపంలోని కాపర్థి థియేటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి సెకండ్‌ షోలో కొంత మంది యువత సినిమా ప్రదర్శించబడుతున్న మధ్యలోనే స్క్రీన్‌ వద్దకి వచ్చి హంగామా చేశారట. 

స్క్రీన్‌ని చించేసి, సీట్లని ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఆయా విజువల్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. జనరల్‌గా పవన్ ఫ్యాన్స్ ఎక్కువగా ఈ సినిమాని చూస్తారు. వారితోపాటు కామన్‌ ఆడియెన్స్ కూడా వస్తుంటారు. అయితే అలానే కొంత మంది యువకులు థియేటర్లో ఈ దాడికి తెగబడ్డారట. అయితే దీన్ని అడ్డుకోబోయిన సిబ్బందిపై కూడా దాడి చేశారట. సీసీ కెమెరాలను, థియేటర్ అద్దాలను సైతం ధ్వంసం చేసినట్టు థియేటర్‌ యాజమాన్యం వెల్లడించింది. 

పవన్‌ ఫ్యాన్స్ పేరుతో కొందరు యువకులు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు. అయితే దీని వెనకాల రాజకీయ కుట్ర ఏదైనా ఉండొచ్చేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పొగబాంబులు తెచ్చి తెరపైకి విసిరారని, అడ్డుకున్న థియేటర్‌ సిబ్బందిపై దాడి చేశారని కపర్థి థియేటర్‌ మెనేజర్‌ మోహన్‌రావు తెలిపారు. తాను 47ఏళ్లుగా ఎగ్జిబిటర్‌ రంగంలో ఉన్నానని, కాని ఇలాంటి అరాచకం ఎప్పుడూ చూడలేదన్నారు. అభిమానుల పేరుతో ఇలా చేస్తే హీరోకే నష్టమన్నారు. ఈ దాడి వల్ల దాదాపు నాలుగు లక్షల వరకు నష్టం జరిగిందన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేసి ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని, ఇటువంటివి జరగకుండా పవన్ కళ్యాణ్ కూడా తమ అభిమానులను కంట్రోల్ చేయాలని కోరారు.