తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ పాలక మండలి తీసుకున్న నిర్ణయం వివాదస్పదమవుతోంది. ఇతర రాష్ట్రాల్లోని పలు స్థిర ఆస్తులను వేలం వేయాలంటూ పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలతో పాటు పలు హిందూ ధార్మిక సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం గతంలో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటూ సర్థి చెప్పే ప్రయత్నం చేసిన విమర్శలు మాత్రం తగ్గటం లేదు. తాజాగా మంచు ఫ్యామిలీ యంగ్ హీరో మనోజ్‌ కూడా ఈ వివాదంలో తలదూర్చాడు. టీడీడీ ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా..? అంటూ ఓ ప్రెస్‌నోట్‌ నే రిలీజ్ చేశాడు మనోజ్‌.

టీటీడీ ఆస్తులు అమ్మ‌మ‌ని దేవుడేమ‌న్నా చెప్పాడా? క‌రోనా సంక్షోభంలో రోజుకు ల‌క్ష మందికి ఆక‌లి తీర్చ‌మ‌ని కూడా దేవుడు ఏమ‌న్నా చెప్పాడా? చేసేది, చెప్పేది అంతా టీటీడీ పాల‌క మండ‌లి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఆస్తుల‌ను, కొండ‌కి వ‌చ్చిన ల‌క్ష‌లాది మందిని, సుప్ర‌భాత సేవ‌కి టైమ్ అయ్యింది నిద్ర లేవాలి.. అని శ్రీ‌హ‌రిని సైతం కంట్రోల్ చేసేది టీటీడీ పాల‌క మండ‌లి. కొండ‌పైన ఉన్న వ‌డ్డీ కాసుల‌వాడి ఆస్తులు అమ్మ‌కానికి వ‌చ్చాయి అంటే `గోవిందా గోవిందా` అని అర‌చిన ఈ గొంతు కొంచెం త‌డ‌బ‌డింది. మోసం జ‌ర‌గ‌ట్లేదు అని తెలుసు.

ఎందుకంటే ఇన్‌సైడ్ ట్రేడింగ్ లాగా కాకుండా వేలం వేసి అంద‌రి ముందూ అంద‌రు చూస్తుండ‌గానే అమ్మ‌కం జ‌రుపుతారు. కానీ, ఎందుకు అమ్ముతున్నారు?.. అని పాల‌క మండ‌లిని కాస్త వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వివ‌ర‌ణ మాత్ర‌మే. ఏమీ లేదు సార్‌. ఇంత పెద్ద కొండ మాకు అండ‌గా ఉంది అని చూస్తూ మురిసిపోయే తిరుప‌తి వాడిని కాబ‌ట్టి ఆపుకోలేక అడుగుతున్నా సార్‌.. అంతే` అంటూ ఓ ప్రెస్‌నోట్‌ను రిలీజ్‌ చేశాడు. గతంలోనూ పలు రాజకీయ అంశాల్లో తలదూర్చి నాలిక్కరుచుకున్నాడు మనోజ్‌. అప్పట్లో ఒకసారి ఇక సినిమాలకు గుడ్‌ బై, ప్రజాసేవకే ఈ జీవితం అంటూ భారీ నిర్ణయం తీసుకొని కూడా మళ్లీ మాట మార్చాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. చాలా ఏళ్ల క్రితమే హీరోగా పరిచయం అయిన మనోజ్‌ ఒకటి రెండు సక్సెస్‌లు సాధించినా స్టార్‌ ఇమేజ్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో సినిమాలకు లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. అదే సమయంలో వ్యక్తిగత జీవితంలోనూ ఇదబ్బందులు ఎదుర్కొన్నాడు మనోజ్‌. తాజాగా అన్నింటిని నుంచి బయటకు వచ్చి అహం బ్రహ్మాస్మి అనే భారీ చిత్రాన్ని ప్రారంభించాడు. పాన్ ఇండియా లెవల్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.