కన్నడ సినీ పరిశ్రమని డ్రగ్స్ కేసు కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. సీసీబీ అధికారుల విచారణలో పలువురు కన్నడ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే పలువురిని సీసీబీ  పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. నాలుగు రోజుల క్రితం రాగిణి ద్వివేదిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నటి రాగిణిని ఐదు రోజులు పోలీసుల విచారణ కోసం ఎసిసిఎం కోర్టు రిమాండ్‌కి అనుమతిని ఇచ్చింది. 

ఇక ఈ వ్యవహారంలో నటి సంజన ఇంట్లో సోదాలు చేసిన సీసీబీ, తాజాగా ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె స్నేహితుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాహుల్‌ ఇచ్చిన సమాచారంతో.. సంజన ఇంట్లో సోదాలు చేసిన సీసీబీ, ఆమెను అదుపులోకి తీసుకుంది. కాగా శాండిల్‌వుడ్‌లో డ్రగ్స్‌ కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన రెండో నటి సంజనా.  ఈ నేపధ్యంలో ఆమె అరెస్ట్ పై కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోలు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.

కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, కేజీఎఫ్ హీరో యష్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్లను మీడియావారు ఈ విషయమై ప్రశ్నించారు. రాగిణి ద్వివేది, సంజనలతో గతంలో పనిచేసిన శివరాజ్ కుమార్...వారి అరెస్ట్ పై మాట్లాడటానికి ఇష్టపడలేదు. అయితే దేవుడనేవాడు ఉన్నాడని, తర్వాత ఏం జరుగుతుందనేది ఆయన నిర్ణయం అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఇన్విస్టిగేషన్ జరుగుతున్న సమయంలోనూ ఆయన వ్యాఖ్యానించటానికి ఇష్టపడలేదు.
 
ఇక కేజీఎఫ్ యష్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వలన ప్రపంచం చాలా ఇబ్బంది పడుతోందని అన్నారు. డ్రగ్స్ అనేవి కేవలం కన్నడ పరిశ్రమకు సంభందించినది మాత్రమే కాదని, అన్ని పరిశ్రమల్లోనూ ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యువతీ,యువకులు ఈ డ్రగ్స్ కు బానిస అవ్వుతున్నారని, వారి జీవితం విలువ వారికి తెలియటం లేదని అభిప్రాయపడ్డారు. అయితే సంజన, రాగిణి అరెస్ట్ పై కామెంట్ చేయటానికి నిరాకరించారు.