యండమూరి 'దుప్పట్లో మిన్నాగు' రివ్యూ!

ఒక తరం పాఠకులకు యండమూరి వీరేంధ్రనాథ్ నవలలంటే ప్రాణం. 

Yandamuri's Duppatlo minnaagu movie review

--సూర్య ప్రకాష్ జోశ్యుల

ఒక తరం పాఠకులకు యండమూరి వీరేంధ్రనాథ్ నవలలంటే ప్రాణం. ఆ తర్వాత తరానికి ఆయన నవలలు రిఫెరెన్స్. ఫిక్షన్ పుస్తకాలకు ఆదరణ తగ్గుతోంది అనుకున్న సమయంలో  తన టోన్ మార్చి పర్శనాలిటీ డవలప్ మెంట్ పుస్తకాలతో,ప్రసంగాలతో ఆయన మళ్లీ ఫామ్ లోకు వచ్చి ఈ తరాన్ని సైతం ఆయన విజయం దిసగా ప్రేరేపిస్తున్నారు. అంతేకాక ఆయనలోని దర్శకుడుని అప్పుడప్పుడూ తట్టి లేపుతూ సినిమాలు, టీవీ సీరియల్స్ చేస్తున్నారు.

ఆ క్రమంలో  తాజాగా యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన  చిత్రం ‘దుప్పట్లో మిన్నాగు’. స్టార్ వాల్యూ ఉన్న నటీనటులెవ్వరూ లేకుండా కేవలం కధనే స్టార్ గా  నమ్మి తీసిన లో బడ్జెట్ సినిమా అని యండమూరి తమ ఫేస్ బుక్ పోస్టుల్లో వివరించారు. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది?‌‌సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది..కథేంటి, ప్లస్ లు ,మైనస్ లు ఏమిటో రివ్యూలో చూద్దాం. 

 

కథేంటి...

కల్యాణి (చిరాశ్రీ) అనే ఒక అనాధ అమ్మాయిని బేకరీ నడుపుకునే గఫార్ ఖాన్ (సుబ్బరాయ శర్మ) అనే ముస్లిం  చేరదీసి ఆమె మతం, నమ్మకాలలో తన జోక్యం లేకుండా స్వేచ్ఛగా పెంచాడు. ఆమె ఇప్పుడొక  IIT గ్రాడ్యుయేట్. మతానికి వ్యక్తి ప్రగతికీ సంబంధం లేదని బలం గా నమ్మే వ్యక్తి. గఫార్ ఖాన్ కల్తీలేని దేశభక్తుడు.  తన ఊహాల్లో జాతీయ పతాకాన్ని ఎగరవేసి  దానికి సెల్యూట్ చేసి పులకించి పోయే నైజం అతనిది. అతనికి మిజ్రాదీన్ అనే ఒక బాల్యమిత్రుడుంటాడు.

ఆ బాల్యమిత్రుడు ఒక సారి అతన్ని కలవటానికి వచ్చాడు.  అతను వచ్చిన రెండు రోజులకి గఫార్ ఖాన్ కనిపించకుండా పోయాడు. అప్పుడు కల్యాణి ఎలా తనకి జీవితాన్ని ఇచ్చిన తండ్రిని వెతికి పట్టుకుంది? అతని ఆచూకి తెలుసుకోవటం కోసం ఎలాంటి త్యాగాలు చేసింది? ఒక పోలీస్ ఆఫీసర్ భార్య అయి ఉండి ఇంట్లో అద్ద్దెకున్న కురాడి బ్లాక్ మెయిల్ కి ఎందుకు లొంగింది? ఎక్కడో ఒక చిన్న పట్టణం లోని ఒక బేకరీ యజమానికీ, కాశ్మీర్ తీవ్రవాదానికి ఉన్న సంబంధం ఏమిటి? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

 

ప్లస్ లు..

కాశ్మీర్ తీవ్రవాద నేపధ్యం లో థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా స్క్రీన్ ప్లేలో  లో వచ్చే ఇంట్రస్టింగ్ మలుపులు. దేశభక్తి గురించి, వ్యక్తిత్వ వికాసం గురించి,  అక్కడక్కడ వినిపించే మంచి మాటలు. వీరేంద్రనాధ్ ఒక పారాగ్రాఫ్ కధ వ్రాసినా దానిలో వాక్యానికో మలుపు పెట్టగల నిపుణుడు కావటం ప్లస్ అయ్యింది. ఈ సినిమా  కూడా అలాగే పావుగంటకో స్క్రీన్ ప్లే మలుపుతో డ్రమెటిక్ గా సాగుతుంది.. శ్రీశైలమూర్తి మాటలు క్లైమాక్స్ లో గఫార్ ఖాన్ కి, మిజ్రాదీన్ కి  మధ్య జరిగే డైలాగుల్లో  భారతదేశాన్ని అమెరికాతో సోమాలియాతో పోలుస్తూ గఫార్ ఖాన్ చెప్పిన మాటలు మనసుకి హత్తుకుంటాయి.

సినిమాలో సాంగ్స్  లేకపోవటం, సినిమా నిడివి తక్కువగా ఉండటం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. సినిమాలో నటించిన వారందరూ తమ పాత్రలకి న్యాయం చేశారు. అయితే ఒక్క సుబ్బరాయ శర్మ తప్ప మిగతా వాళ్ల పేర్లు మనకి తెలియకపోవటం మన తప్పు కాదు. పవన్ ఎడిటింగ్ బాగుంది. సతీష్ బాబు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్ ను ఎలివేట్ చేసింది. 

 

టైటిల్ తోనే..ఇబ్బంది

ఈ చిత్రానికి ఉన్న పెద్ద బలహీనత దీని టైటిల్. “దుప్పట్లో మిన్నాగు” అన్న పేరు వలన కొందరు ఇదేదో బీ గ్రేడ్ సెక్స్ చిత్రం అనుకుంటే, కొందరు దాదాపు దశాబ్దం క్రితం యండమూరి వ్రాసిన దుప్పట్లో మిన్నాగు అన్న పుస్తకానికి అనుసరణ అనుకుని డిజపాయింట్ అవుతారు. ‘దుప్పట్లో మిన్నాగు’...ఈ టైటిల్ వినగానే చాలా మందికి అప్పట్లో యండమూరి రాసిన నవల ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఆ నవల ఆ స్దాయిలో సక్సెస్ అయ్యింది.

ఇదే టైటిల్ తో ...అదే యండమూరి సినిమా చేస్తున్నాడంటే...ఆ నవలనే సినిమా చేసారనుకున్నారు. కానీ వాస్తవానికి ఆ నవల కథ వేరు..ఈ సినిమా కథ వేరు. దాంతో పోల్చి చూడకుండా ఉంటే ఇదో కొత్త కథగా , ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. అయితే సినిమాకు ఈ టైటిల్ కొంచెం ఇబ్బంది కరంగా అనిపించేదే. కాకపోతే స్టార్స్ లేని సినిమా కాబట్టి..నావల్టి ఉంటుందని, నలిగిన టైటిల్ అని పెట్టినట్లున్నారు. 

వాస్తవానికి ఇది తండ్రీ కూతుళ్ళ ప్రేమకి, దేశభక్తికీ, తీవ్రవాదానికి సంబంధించిన కధ. కానీ ఆ  విషయం మనకి హాల్లోకి వచ్చి కొంత సినిమా చూస్తే తప్ప బోధపడదు. పోస్టర్స్ కూడా కంఫ్యూజింగ్ గా ఉన్నాయి.  కధనం నాన్ లీనియర్ కావటం తో హాలీవుడ్ లేదా హిందీ చిత్రాలతో పరిచయం లేని ప్రేక్షకుడికి సినిమా కొంచెం ఆలస్యం గా అర్ధమవుతుంది. 

ప్రధాన పాత్రధారి లక్ష్యం  మనకి ఇంటర్వెల్  అయ్యాక గానీ అర్దం కాదు. అందువలన ఫస్ట్ హాఫ్ లో కల్యాణి ప్రవర్తన ప్రేక్షకుడు ఏ విధం గా చూడాలో అర్ధం కాక కంఫ్యూజ్  అవుతాడు. దాంతో  ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ ఎవరు? అన్న విషయం లో దర్శకుడికి స్పష్టత లొపించిందేమో అనిపించంటం సహజం.  సినిమా చూస్తుంటే ఇది డబ్బింగ్ చిత్రమో,  స్ట్రెయిట్ తెలుగు సినిమానో అర్ధం కాదు. పబ్లిసిటీలో ఆ విషయం ఎక్కడా చెప్పలేదు. 

 

టెక్నికల్ గా...

ఎడిటింగ్, రీరికార్డింగ్  బాగున్నా, వాటికి తగిన స్థాయిలో నిరంజన్ బాబు ఫోటోగ్రఫీ లేకపోవటం కొన్ని చోట్ల ఇబ్బందిగా అనిపిస్తుంది. డీ ఐ వర్క్, సీజీ వర్క్ చాలా నిర్లక్ష్యం గా చేసారని అనిపిస్తుంది.  దర్శకుడుగా యండమూరి తనకున్న పరిమిత ఆర్దిక వనరులను దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా సీన్స్ డిజైన్ చేసుకుని తెరకెక్కించినట్లు అర్దం అవుతుంది. డైలాగులు బాగున్నాయి. క్యారక్టరైజేషన్స్  దృష్టిలో పెట్టుకుని, సీన్ కంటెంట్ రివెల్ అయ్యేలా జాగ్రత్తగా,పొదుపుగా మాటలు శ్రీశైల మూర్తి రాసారు. ఎక్కడా పంచ్ కోసం, ప్రాస కోసం  పాకులాడకపోవటంతో అవి సహజంగా ఉన్నట్లు అనిపిస్తాయి. నటీనటుల్లో హీరోయిన్ చిరాశ్రీ బాగా చేసింది. మిగతా వాళ్లు సోసో. 

 

ఫైనల్ థాట్

ఇలాంటి చిన్న సినిమాలను  ప్రోత్సహిస్తే మరిన్ని కంటెంట్ డ్రైవన్ ఫిల్మ్ లు వచ్చే అవకాశం ఉంటుంది. 

Rating: 2/5 

ఎవరెవరు

బ్యానర్: చిరంజీవి క్రియేషన్స్ 
నటీనటులు :  చిరాశ్రీ ,విశ్వజిత్, నవీన్ తీర్దహళ్ళ, సుబ్బరాయ శర్మ,సుథీర్ కుమార్ ,మఢథా చిరంజీవి, అమర్ ప్రసాద్ తదితరులు 
మాటలు: శ్రీశైల మూర్తి,
 కెమెరా: నిరంజన్ బాబు, 
ఎటిడింగ్: పవన్ ఆర్.ఎస్. , 
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: సతీష్ బాబు, 
సౌండ్ ఇంజనీర్ : శ్రీరామ్,
పి.ఆర్.ఓ: సాయి సతీష్‌,
బ్యానర్: చిరంజీవి క్రియేషన్స్,
నిర్మాత : చల్లపల్లి‌అమర్,
రచన- దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాథ్.
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios