బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ మరణం నుంచి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోలేకపోతోంది. అభిమానులు ఇప్పటికీ సుశాంత్‌కు సంబంధించిన విషయాలను తలుచుకుంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆఖరి చిత్రం దిల్ బెచారా ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తు మద్దతు ప్రకటిస్తున్నారు.

డిస్నీ - హాట్‌ స్టార్‌లో రిలీజ్‌ కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌. అందులో భాగంగా చిత్ర ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఇటీవల విడుదలైన ఈ ట్రైలర్‌కు తక్కువ కాలంలోనే 69 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. అంతేకాదు ఈ ట్రైలర్‌కు 10 మిలియన్లకు పైగా లైక్స్‌ సాధించి వరల్డ్ రికార్డ్‌ సృష్టించింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది.

ది ఫాల్ట్ ఇన్ అవర్‌ స్టార్స్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ముఖేష్‌ చబ్రా దర్శకుడు. ఎమోషనల్‌ లవ్‌డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను ఫాక్స్‌ స్టార్‌ స్టూడియో సంస్థ నిర్మించింది. ఈ సినిమాకు మ్యూజిక్‌ లెజెండ్ ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందించాడు. ఈ సినిమా ఈ నెల 24 నుంచి డిస్నీ, హాట్‌ స్టార్‌లో అందుబాటులోకి రానుంది.