సాధారణంగా సినిమా ఓ నెల ఉందనగా ప్రమోషన్స్ మొదలెడుతూంటారు. బాహుబలి లాంటి భారీ చిత్రాలు మినహాయిస్తే మిగతావన్నీ ఇదే స్కూల్ ఫాలో అవుతూంటాయి. ఎందుకంటే ప్రమోషన్స్  రిలీజ్ చాలా రోజులు ఉందనగా మొదలెడితే..రిలీజ్ డేట్ వచ్చేసరికి చల్లారిపోతాయి. బోర్ కొట్టేస్తాయి అని దర్శక,నిర్మాతలు భావిస్తూంటారు. ఈ మధ్యన సైరా కూడా అదే స్కూల్ లో వెళ్లింది. మెగా ఫ్యాన్స్ ఎంత కంగారుపడినా రిలీజ్ దగ్గర పడ్డాకే ప్రమోషన్స్ పరుగు ప్రారంభించింది. దాంతో రిలీజ్ రోజు దాకా ఈ సినిమా హీట్ పెరుగుతూనే ఉంటుంది.  అయితే త్రివిక్రమ్ మాత్రం ఎందకునో ఈ దారిలో ప్రయాణం పెట్టుకోక అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠపురములో చిత్రం రూపొందుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను జరుపుకుంది. కానీ రిలీజ్ సంక్రాంతికి. అంటే మరో నాలుగు నెలలు ఉంది. కానీ  తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ గా ఒక సాంగ్ ను వదిలారు.

సామజవరగమన .. నిను చూసి ఆగగలనా .. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా అంటూ ఈ పాట సాగుతోంది. నాయకుడు .. నాయకి వెంటపడుతూ, ఆమె పట్ల తనకి గల ప్రేమను వ్యక్తం చేసే సందర్భంలో వచ్చే పాటగా ఇది అనిపిస్తోంది. ఈ పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారింది. సొగసైన అర్థాలు వచ్చే పదునైన పద ప్రయోగాలు చేస్తూ ఆయన పాటను అందించారు. తమన్ బాణీ .. సిద్ శ్రీరామ్ ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి.

టబు కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతిని విడుదల చేయనున్నారు. ఇంకా నాలుగు నెలలు ఉండగా అప్పుడే ఈ ప్రమోషన్స్ ని ప్రారంభించటం చాలా చిత్రంగా చెప్పుకుంటున్నారు. అన్నీ ప్రమోషన్ ఆయుధాలు ఇప్పుడే వదిలేస్తే ..రిలీజ్ నాటికి ఏమి మిగిలుతాయి అని సందేహం వ్యక్తం చేస్తున్నారు సినీ విశ్లేషకులు. కానీ త్రివిక్రమ్ మాస్టర్ మైండ్ లో ఏముందో ఎవరికి తెలుసు కనుక.