'విటమిన్ షి' సినిమా రివ్యూ
ప్రక్క గదిలో ఉన్న కొడుకుని భోజనానికి పిలవాలంటే వాట్సప్ లోనో లేక ఫేస్ బుక్ లోనో మెసేజ్ పెట్టాల్సిన సిట్యువేషన్ నేడు చాలా ఇళ్లల్లో ఉంది. ఆరోగ్యం, చదువు, మానసిక స్థితిపై సెలఫోన్ వాడకం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆధునికీకరణ పేరుతో జరుగుతున్న ఈ సామాజిక నష్టాన్ని వారించేందుకు అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ప్రయత్నించాలని మానసిక శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆ విషయాన్ని సైతం జనాలకి రీచ్ అవ్వాలంటే ఏ ట్విట్టర్ లోనో చెప్పాల్సిన పరిస్దితి. అప్పుడు సోషల్ మీడియాలోనే జనం కలిసికట్టుగా కొన్ని పోస్ట్ లు పెట్టి తమ నిరసన తెలియచేసి, మరో విషయంలోకి అంతే స్పీడుగా వెళ్లిపోతారు.ఇలాంటి పరిస్దితులు ఉన్న ఈ రోజుల్లో విజువల్ మీడియా కొంతవరకూ ఇలాంటి సమస్యలను ఎక్సప్లోర్ చేయగలుగుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడూ జనం సోషల్ మీడియాలోంచి,సెల్ లోంచి బయిటకు వచ్చి సినిమాలు చూస్తున్నారు. అఫ్ కోర్స్ అలా థియోటర్స్ కు వెళ్లి చూసేవాళ్లు తగ్గుతున్నారు కాబట్టే ఓటీటిలతో సెల్ ఫోన్స్ సాయింతో జనం వద్దదే సినిమాని తీసుకువెళ్తున్నారు. ఇలాంటి సిట్యువేషన్ లో సినిమా ద్వారానే ఈ విషయాలను ఎత్తిచూపాలని ఫిక్సైన ఓ దర్శకుడు ఈ లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. టెక్నాలిజీపై ఓ వ్యగ్యాత్మక సినిమాని రూపొందించి వదిలాడు. ఆ సినిమా కథేంటి...దర్శకుడు చెప్పాలనుకున్న మెసేజ్ ఏమిటి..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి...
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ..లియో అలియాస్ లింగబాబు యోగానందం ( శ్రీకాంత్) మనందరిలాగే స్మార్ట్ ఫోన్ అడిక్టెడ్ పర్సన్. అలాగే సెల్ పోన్ తో కాలక్షేపం పోగా మిగిలిన కొంత సమయాన్ని అదే కంపనీలో పనిచేస్తున్న వైదేహి (ప్రాచీ టక్కర్) అనే అమ్మాయిని ప్రేమించే పోగ్రామ్ పెట్టుకుంటాడు. ఆ అమ్మాయికి తన ప్రేమను ఎలా ఎక్స్ ప్రెస్ చేయాలా అని తపన పడిపోతూంటాడు. ఈ లోగా అతని ఫోన్ పోవటం, కొత్త ఫోన్ కొనుక్కోవటం జరుగుతుంది. అయితే కొత్త ఫోన్ అతని చేతిలోకి వచ్చిన మరుక్షణమే అతని జీవితం టర్న్ తీసుకుంటుంది. ఆ కొత్త ఫోన్ లో ఉన్న ‘విటమిన్ షి’ అనే అల్ట్రా మోడరన్ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. దాని నిక్ నేమ్ లైలా. ఆండ్రాయిడ్‌లో గూగుల్ అసిస్టెంట్, ఐఫోన్‌లో సిరి, అమెజాన్ అలేక్సా లాంటిదే లైలా..కానీ నెక్ట్స్ లెవిల్ . ఆ అసెస్టెంట్ లియోకు అన్నివిధాలా సాయిం చేయటం మొదలెడుతుంది. అతనేం తినాలో అదే డిసైడ్ చేయటమే కాకుండా ఆర్డర్ కూడా ఇచ్చేస్తుంది.
అతని ప్రేమను వ్యక్తం చేసేందుకు ధైర్యం ఇవ్వటమే కాకుండా మధ్య వర్తిత్వం చేసేస్తుంది. ప్రక్కనుండే స్నేహితులు కూడా చేయలేని పనులు ఎన్నో అది చేసేస్తుంది. ఎంతలా అంటే ఓ టైమ్ కు లియో ...ఆ వాయిస్ అసెస్టెంట్ లేకుండా ఉండలేని సిట్యువేషన్ కు వచ్చేస్తాడు. అయితే కొంతకాలానికి ఆ వాయిస్ అసెస్టెంట్ లో ఇంకో యాంగిల్ రివీల్ అవుతుంది. అతన్ని బ్లాక్ మెయిల్ చేయటం మొదలెడుతుంది. ఎమోషనల్ గా అతన్ని ఆడుకుంటుంది. లియో ఆ వాయిస్ అసెస్టెంట్ ట్రాప్ చేస్తోందని అర్దం చేసుకునే సరికే పరిస్దితులు తారుమారు అయ్యిపోతాయి. మరో ప్రక్క అతని ప్రేమ కథ సైతం ప్రమాదంలో పడుతుంది. సెల్ ఫోన్ లో ఉండే ఓ వాయిస్ అసెస్టెంట్ ఆ స్దాయి దుర్మార్గమైన పనులు ఎలా చేయగలిగింది. లియో లవ్ స్టోరి చివరకు ఎలా ముగిసింది. ఇవన్నీ తెలియాలంటే ‘విటమిన్ షి’ చూడాల్సిందే.
ఎలా ఉంది..
ఓ పది నిమిషాలు మన మొబైల్ ఆఫ్ అయిపోతే.. నెట్‌వర్క్ కనెక్ట్ కాకపోతే.. ఎక్కడలేని చికాకు.. కోపం.. అసహనం. ఈ లక్షణాలతో కూడిన మానసిక వ్యాధినే ‘‘నోమోఫోబియో’’గా అంతర్జాతీయ పరిశోధకులు గుర్తించారు. ఆ విషయాలని ఈ సినిమాలో గుర్తు చేసే ప్రయత్నం చేసాడు దర్శకుడు. సెల్‌ఫోన్ల నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వరకూ , హోం థింగ్స్ నుంచి హ్యూమనాయిడ్ రోబోల వరకూ విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఉపయోగమో...శ్రుతి మించితే అంతే ప్రమాదం అని నొక్కి చెప్తాడు.ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ మనుగడలో భాగమైపోయింది అని మురిసేలోగా..దాని నుంచి భవిష్యత్తు ఎదుర్కొనే ప్రమాదాలను ఎత్తి చూపుతాడు.ఎంతో అవగాహనతో...జనాలకు టెక్నాలిజీ నుంచి మనం ఎదుర్కొనే ముప్పుని చెప్పాలనే ఈ ప్రయత్నం చేసాడు. టెక్నాలిజీ చివరకు దిగజారి మన కోసం పోర్న్ కూడా చేసి చూపుతుంది. హెల్ప్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ట్రాప్ లో పడేస్తుంది. ఓ రకంగా మనల్ని ఓవర్ రైడ్ చేస్తుంది.
అయితే ఇవన్నీ ఈ చిన్న కథలో దర్శకుడు చెప్పాడు. అయితే అంత ప్రభావవంతంగానూ చెప్పలేదనిపించింది. అది బడ్జెట్ ప్లాబ్లమ్ కావచ్చు. ఎక్కువగా తక్కువ లొకేషన్స్ కథ జరగటం వల్ల కావచ్చు. డైలాగులు ఎక్కువ గా ఉండటం వల్ల అనిపించవచ్చు. ఫస్టాఫ్ ఓ కొత్త పాయింట్ డిస్కస్ చేయటంతో ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. సెకండాఫ్ లో కథ పెద్దగా కదిలినట్లు అనిపించదు. అల్ట్రా మోడరన్ వాయిస్ అసిస్టెంట్ ‘విటమిన్ షి’ తన జీవితంపై,ప్రేమపై నైతిక దాడి చేస్తున్నప్పుడు హీరో ఎదుర్కొనే ప్రయత్నాలు క్లైమాక్స్ దాకా చేయడు. దాంతో కథలో సంఘర్షణ తగ్గి కొన్ని చోట్ల లాగినట్లు అనిపించింది. టెక్నాలిజీ బేస్ మీద హాలీవుడ్ స్దాయిలో కాకపోయనా, రోబో ని దాటలేకపోయినా.. ఆండ్రాయిడ్ కట్టప్ప వంటి అరుదైన సినిమాలు ప్రక్క భాషలో వస్తున్నాయి. వాటి స్దాయిలోకి మనం వెళ్లే ప్రయత్నం చేయగలిగాలి.
డైరక్షన్, మిగతా విభాగాలు..
అయితే ఇదే పాయింట్ ని సరిగ్గా విస్తరించుకుని, పెద్ద హీరో లేదా తెలిసిన హీరోతో సినిమా చేస్తే మరింత బాగుండేది. డైరక్టర్ మనందరికీ అందరికి కనెక్ట్ ఆయె పాయింట్ నే చెప్పాడు spy చేస్తే కనుకుంటారు ..లవ్ చేస్తే తెలుసుకుంటారు,
మనం హ్యాపీ వుండాలి అంటే పక్క వాళ్ళతో కాదు , పాత వాళ్ళతో పోల్చుకోవాలి ..
సొసైటీ అందం గా లేని అమ్మాయి ని , సంపాదన లేని అబ్బాయి ని పట్టించుకోదు అని మాటలు తో పాటు ఇంకా చాలా డైలాగులు బాగునాయి .అలాగే లవ్ స్టొరీ ని మెమరీ చెస్ బోర్డు తో సింబాలిక్ గా చెప్పడం చాలా బాగుంది .. లైలా తో వచ్చిన కాన్వర్షన్స్ బాగున్నా , ఎక్కువ అయ్యాయి. దానికి తోడు స్లోగా నడపకుండా ఉంటే బాగుండేది. దర్శకుడు గా జయశంకర్ స్క్రిప్టుని ప్రక్కన పెడితే నీట్ గా బాగా తీసాడు. క్లైమాక్స్ లో తర్వాత వచ్చిన వాయిస్ ఓవర్ తో thought provoking గా అనిపిస్తుంది.
లియో గా చేసిన శ్రీకాంత్ , వైదేహి గా చేసిన ప్రాచి తమ పాత్రల మేరకు బాగా చేసారు. వరప్రసాద్ కెమెరా వర్క్ ఈ సినిమా హైలెట్స్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది. లైలా వాయిస్ కి డబ్బింగ్ బాగుంది. ఎడిటింగ్ సెకండాఫ్ లో మరింత స్పీడ్ గా ఉండేలా చేసి ఉంటే బాగుండేది.
ఫైనల్ థాట్
పేపర్ బాయ్ తో పరిచయం అయిన ఈ దర్శకుడు రెండో సినిమాకి టెక్నాలిజీ బోయ్ అనిపించుకునే ప్రయత్నం చేసాడు.
--సూర్య ప్రకాష్ జోశ్యల
Rating:2.5
ఎవరెవరు...
నటీ నటులు: శ్రీకాంత్ గుర్రం, ప్రాచీ టక్కర్, రాజశ్రి నాయర్, రంజిత్ రెడ్డి, వికాస్ పొన్నూరు, సంజీవ్ జోషి, మోయిన్, అశోక్
తదితరులు
సంగీతం: పివిఆర్. రాజా
సినిమాటోగ్రఫీ. : శివ శంకర వర ప్రసాద్
ఎడిటర్: నాని లుక్క
ఆర్ట్: శివకాంత్ వంగ
నిర్మాత: రవి పొలిశెట్టి
కథ, స్క్రీన్ ప్లే, మాటలు , దర్శకత్వం: జయశంకర్
విడుదల తేదీ:29-12-2020
ఓటీటీ: MX Player