విజయ్‌ దేవరకొండ తాజాగా కరోనా వైరస్‌ సంక్షోభంతో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న సామాన్యులను చేయూతనివ్వడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని కోసం ఆయన రెండు చారిటీ సంస్థలను ఏర్పాటు చేశారు. ఈ సంక్షోభ సమయంలో నిత్యవసరాలు కూడా లేక ఇబ్బంది పడుతున్న వారికోసం 25లక్షల రూపాయలతో ‘మిడిల్‌ క్లాస్‌ ఫండ్‌(ఎం.సి.ఎఫ్‌) ఏర్పాటు చేశారు. అలాగే యువతకు ఉద్యోగాలు ఇప్పించేందుకు ‘ది విజయ్‌ దేవరకొండ ఫౌండేషన్‌(టి.డి.ఎఫ్‌)’ను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన తాజా వివరాలను తెలియజేస్తూ విజయ్ దేవరకొండ ఓ ప్రకటన చేశారు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... ఈ ఫండ్ ద్వారా రెండు వేల కుటుంబాలకు పైగా సాయం చేయాలనుకున్నామని, ఆ లక్ష్యాన్ని ఈ రోజుతో చేరుకున్నామని చెప్పారు. దాతలు తమ వితరణతో తాము ఊహించిన దాని కంటే ఎక్కువ కుటుంబాలకు.. దాదాపు ఆరువేల ఫ్యామిలీలకు సాయం చేయగలిగేలా చేశారని అన్నారు. తమకు సాయం చేయాలని కోరుతూ గత ఐదు రోజులుగా 77,000 రిక్వెస్ట్ లు తమకు అందాయని తెలిపారు.

ఎంసీఎఫ్ లో మిగిలి ఉన్న నిధుల మేరకు అభ్యర్థించిన అందరికి సాయపడలేమని చెప్పాల్సి రావడం దురదృష్టకరంగా భావిస్తున్నానని అన్నారు. అందుకని, ప్రస్తుత తరుణంలో కొత్త రిక్వెస్ట్ ను స్వీకరించడం లేదని స్పష్టం చేశారు. ఫండ్ లో ఉన్న నిధుల లభ్యత మేరకు ఇప్పటికే రిక్వెస్ట్ చేసిన వారికి సాధ్యమైనంత మేరకు సాయపడే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇబ్బంది పడుతున్న మరిన్ని కుటుంబాలకు తాము సాయం అందించాలంటే, తమతో చేతులు కలిపి, విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

ఇక లాక్‌డౌన్‌ వేళ కనీస అవసరాలు తీర్చుకోలేక అవస్థలు పడుతున్నవారి కోసం. www.thedeverakondafoundation.org లాగిన్ అయి తమ వివరాలను నమోదు చేసుకుంటే ఫౌండేషన్ సభ్యులు స్వయంగా వారికీ నిత్యావసర సరుకులు అందిస్తారు. దగ్గరలోని కిరాణ షాపుకు వెళ్లి సరకులను కొనుగోలు చేస్తే డబ్బులను పౌండేషన్‌ సభ్యులు చెల్లిస్తారు. ఈ 25లక్షలతో 2000 కుటుంబాల అవసరాలు తీర్చాలని లక్ష్యం పెట్టుకున్నట్లు విజయ్‌ దేవరకొండ మొదట తెలిపారు.