కొద్ది రోజుల్లోనే సౌత్‌ ఇండియాలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి. హీరోగా చేస్తూనే క్యారెక్టర్ యాక్టర్‌, విలన్‌గా అన్ని రకాల పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. కేవలం తమిళ్‌లో మాత్రమే కాదు. తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు విజయ్ సేతుపతి. ఒక్కో సినిమాతో తన రేంజ్‌ను పెంచుకుంటూ వస్తున్న కోలీవుడ్‌ స్టార్ విజయ్ సేతుపతి ఇప్పుడు నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడట. తను పెట్టే కండిషన్స్‌కు ఏం చేయాలో పాలుపోక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.

ముఖ్యంగా రెమ్యూనరేషన్‌ విషయంలో విజయ్ సేతుపతిని భరించటం కష్టమని భావిస్తున్నారట. క్యారెక్టర్‌తో సంబంధం లేకుండా తెలుగు సినిమాలో నటించాలంటే ఏకంగా 8 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట విజయ్ సేతుపతి. అంతా ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు వచ్చినా తను నటించిన తెలుగు సినిమాలు కోలీవుడ్ లో రిలీజ్ చేయవద్దంటూ మరో కండిషన్‌ పెడుతున్నాడట విజయ్ సేతుపతి. ఈ విలక్షణ నటుడికి అంత పేమెంట్ ఇచ్చి మరీ తీసుకునేదే మల్టీ లాంగ్వేజ్‌ రిలీజ్ కోసం. అలాంటి తమిళ రిలీజ్ వద్దంటూ విజయ్ కండిషన్ పెట్టడంతో ఇక ఎందుకని ఫీల్ అవుతున్నారట.

తమిళ్‌లో రిలీజ్ చెయ్యోద్దన్న కండిషన్ కారణంగానే నిర్మాతలు పుష్ప సినిమా నుంచి విజయ్ సేతుపతిని తప్పించినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాలపై చిత్రయూనిట్ మాత్రం ఇంత వరకు స్పందించలేదు. అయితే విజయ్ సేతుపతి స్థానంలో మరో బహు భాషా నటుడు బాబీ సింహాను తీసుకోవాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.