ఈ ఏడాది మొదట్లో అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్‌ బస్టర్ హిట్‌ అందుకున్న అల్లు అర్జున్‌, ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాను ఎనౌన్స్ చేశాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొంత షూటింగ్ కూడా పూర్తయ్యింది. ముందుగా ఈ సినిమాలో విలన్‌గా తమిళ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతిని తీసుకున్నారు.

ఈ లోగా కరోనా వైరస్ కారణంగా షూటింగ్‌లకు బ్రేక్‌ పడింది. ఇప్పటికీ పరిస్థితులు చక్కబడకపోవటంతో షూటింగ్ లు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో చెప్పలేని పరిస్థితి దీంతో పుష్ప సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నట్టుగా వార్తలు వినిపించాయి. విజయ్‌ సేతుపతి తప్పుకున్నట్టుగా చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నా.. ఆ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం ఇంత వరకు రాలేదు.

తాజాగా ఓ ఇంగ్లీష్ పేపర్‌తో మాట్లాడిన విజయ్ సేతుపతి, పుష్ప సినిమాతో తప్పుకుంటున్నట్టుగా ప్రకటించాడు. డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతోనే పుష్ప నుంచి తప్పుకున్నట్టుగా చెప్పాడు విజయ్ సేతుపతి. అల్లు అర్జున్‌ సినిమా చేయాలని ఉన్నప్పటికీ తన మూలంగా చిత్రయూనిట్‌కు ఇబ్బందులు కలగకూడాదన్న ఉద్దేశంతోనే సినిమా నుంచి తప్పుకున్నట్టుగా విజయ్‌ చెప్పాడు. విజయ్‌ సేతుపతి తప్పుకోవటంతో ఆ స్థానంలో కన్నడ నటుడు ధనుంజయని తీసుకునే ఆలోచనలో చిత్రయూనిట్‌ ఉన్నట్టుగా తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న అల్లు అర్జున్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. బన్నీ కెరీర్‌లో తొలి పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.