క‌రోనా వైర‌స్ సినిమా రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇది నిర్మాతల గుండెళ్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. అన్ని బాగున్న రోజుల్లో  సినిమాల‌న్నీ స్టార్ సినిమాలకు... బ‌డ్జెట్ ను ఏమాత్రం ఆలోచించ‌కుండా నిర్మాత‌లు అడిగినంత మేరకు ఓకే అనేశారు. కానీ ఇప్పుడు కరోనా వైర‌స్ లాక్ డౌన్ కార‌ణంగా నిర్మాత‌ల పరిస్దితి అయోమయంగా మారింది. అంత పెడితే అసలు పెట్టిందైనా తిరిగి వస్తుందా అని లెక్కలు వేసుకుంటున్నారు. హీరోలను రెమ్యునేషన్ తగ్గించుకోమని అడగలేక..బడ్జెట్స్ తగ్గించుకోలేక సతమతమవుతున్నారు. మన హీరోలు మాత్రం అది తమకు సంభందం లేని ఇష్యూ అన్నట్లుగా దూరంగా ఉంటున్నారు.

 ఈ క్రమంలో తమిళ సినీ పరిశ్రమలో హీరోలు మాత్రం ముందడగు వేస్తున్నారు. ఇప్పటికే విజయ్ ఆంటోని వంటి వారు తమ రెమ్యునేషన్స్ తగ్గించుకుంటామని బహిరంగంగా ప్రకటన చేసారు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ ...తన కొత్త చిత్రానికి ఏకంగా ఇరవై కోట్లు తగ్గించుకున్నట్లు సమాచారం. ఆ సినిమా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. సాధారణంగా విజయ్ తన చిత్రానికి ఎనభై కోట్లు రెమ్యునేషన్ గా తీసుకుంటారు. ఇప్పుడు ఇరవై కోట్లు తగ్గించుకుని కేవలం అరవైకోట్లు మాత్రమే తీసుకోబోతున్నారట. 

విజయ్ హీరోగా మురుగదాస్ 'కత్తి' .. 'తుపాకి' .. 'సర్కార్' సినిమాలు తెరకెక్కాయి. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాలు, విజయ్ కెరియర్లో చెప్పుకోదగినవిగా నిలిచిపోయాయి. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అది 'తుపాకి' సీక్వెల్ అనేది తాజా సమాచారం.

విజయ్ - మురుగదాస్ కాంబినేషన్లో 2012లో వచ్చిన 'తుపాకి' భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి మురుగదాస్ రంగంలోకి దిగాడట. ఆల్రెడీ విజయ్ తో కథా చర్చలు జరిగినట్టుగా చెబుతున్నారు. 'తుపాకి' సినిమాను నిర్మించిన 'వి' క్రియేషన్స్ వారే సీక్వెల్ ను కూడా నిర్మించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.