మహారాష్ట్రలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. ముంబైలో కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా విస్తరిస్తూనే ఉంది. తాజాగా పలు హిందీ  సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన నటుడు కిరణ్‌కుమార్‌ కొవిడ్‌-19 బారినపడ్డారు. మే 14న జనరల్‌ చెకప్‌ కోసం ఆస్పత్రికి వెళ్లిన ఆయన కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నారు. ఆ సమయంలో ఆయనకు కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో గత పది రోజులుగా ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. 

ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. తనకి కొవిడ్‌-19 ఉందని వస్తోన్న వార్తలు నిజమేనని తెలిపారు. ‘జనరల్‌ చెకప్‌ కోసం ఆస్పత్రికి వెళ్లిన నేను మే 14న కరోనా టెస్టులు చేయించుకున్నాను. ఆ సమయంలో నాకు కరోనా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కానీ నాకు జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలేమీ లేవు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఇంట్లోనే హోం క్వారంటైన్‌ లో ఉన్నాను. ఇప్పటికే 10 రోజులైంది. కానీ నాలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. ఇంట్లోని మూడో అంతస్తులో నేను, రెండో అంతస్తులో నా కుటుంబం ఉంటోంది. ఒంటరిగా ఉంటే నా స్కూల్‌ డేస్‌ గుర్తుకు వస్తున్నాయి.’ అని కిరణ్‌ కుమార్‌ తెలిపారు.