మెగాస్టార్ చిరంజీవి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తమ వంశానికి చెందిన వ్యక్తి జీవితచరిత్రతో సినిమా తీసినందుకు తమకి కొంత డబ్బు చెల్లించాలని ఉయ్యాలవాడకుటుంబీకులు చిత్రనిర్మాత రామ్ చరణ్ ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

'సైరా' సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి, రామ్ చరణ్ లు తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని వారు ఆరోపణలు చేశారు. ఈ వివాదం అనేక మలుపు తీసుకుంది. 
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులకు ఎవరో రెచ్చగొట్టారని, వారు 23 కుటుంబాల వారు ఒక్కొక్క ఫ్యామిలీకి రెండు కోట్ల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారని అది అన్యాయమని చిరంజీవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

దీనిపై స్పందించిన ఉయ్యాలవాడ కుటుంబం చిరంజీవి చెప్పేవన్నీ అవాస్తవాలని.. తమ వంశీకులు ఒక్కొక్క కుటుంబానికి రెండు కోట్ల రూపాయ‌లు చెల్లించ‌మ‌ని అడ‌గ‌లేద‌ని,  ఆయ‌న అబ‌ద్ధం చెబుతున్నార‌ని అన్నారు. చర‌ణ్ ఇది వ‌ర‌కు చెప్పిన‌ట్లు తాము ఒక్కొక్క కుటుంబానికి రూ.15 ల‌క్ష‌లు అడిగామ‌ని తెలిపారు. సినిమా విడుద‌ల నేపధ్యంలో తాము సినిమాకి సంబంధించి వేసిన కేసులన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు.