కరోనా సినీ రంగాన్ని చాలా రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ లు, సినిమాల రిలీజ్‌లు నిలిచిపొవటంతో ఇండస్ట్రీ వేల కోట్ల నష్టాలను చవిచూస్తోంది. అదే సమయంలో సినీ ప్రముఖుల ఇంట్లో నమోదవుతున్న కరోనా కేసులు ఇండస్ట్రీ వర్గాల్లో మరింత గుబులు పుట్టిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రముఖ నిర్మాత కరీం మొరానీతో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. వారు కోలుకొని ఇంటికి చేరుకొని సరికి మరో నిర్మాత ఇంట్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

తాజాగా బాలీవుడ్‌ బడా నిర్మాత బోని కపూర్ ఇంట్లో కరోనా కేసు నమోదవ్వటం కలకలం సృష్టించింది. బోని ఇంట్లో పనిచేసే 23 ఏళ్ల యువకుడికి కరోనా సోకినట్టుగా నిర్థారన కావటంతో బాలీవుడ్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అదే ఇంట్లో బోని కపూర్‌తో పాటు ఆయన కుమార్తెలు జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌లు కూడా ఉంటున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఇంట్లోని వారందరికీ కరోనా టెస్ట్‌లు చేయించారు. ఈ నేపథ్యంలో బోని కుటుంబ సభ్యులకు కరోనా నెగిటివ్‌ రాగా పనివాళ్లలో మాత్రం మరో ఇద్దరికీ కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయ్యింది.

అంతేకాదు కొత్త పాజిటివ్‌ నిర్థారణ అయిన ఇద్దరికీ ఎలాంటి కరోనా  లక్షణాలు లేకపోవటంతో మరింత ఆందోళన నెలకొంది. ప్రస్తుతం బోనీ కుటుంబం అంతా ముంబైలోని లోఖండ్‌వాలా ఇంట్లో హోం క్వారెంటైన్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం అందరూ బాగానే ఉన్నా.. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తోందో అన్న ఆందోళన బాలీవుడ్‌ వర్గాల్లో కనిపిస్తోంది. ముంబైలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. రోజు వేల సంఖ్యలో కేసుల నమోదు కావటంతో పాటు వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.