చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మరో నటి ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్‌ నోట్‌ ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది.

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల వరుసగా టీవీ నటిమణులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో నటి బలయ్యింది. ఒడియాకి చెందిన బుల్లితెర నటి రష్మీ రేఖ(23) ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం(జూన్‌ 18)న ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భువనేశ్వర్‌లోని గదసాహి ప్రాంతానికి సమీపంలోని నాయపల్లిలో ఉన్న తన అద్దే ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది రష్మి రేఖ. 

గత కొంత కాలంగా రష్మీ రేఖ ఆ ఇంట్లోనే అద్దెకు ఉంటుంది. ఇంటి యాజమాని అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న గదిలో ఒక సూసైడ్‌ నోట్‌ లభ్యం కావడం కలకలం సృష్టిస్తుంది. అందులో తన మరణానికి కారణం ఎవరనేది తెలిపింది రష్మి రేఖ. చివరగా `ఐ లవ్‌ యూ సాన్‌` అని రాసుకొచ్చింది. 

23 ఏళ్ల రష్మీ రేఖ కొన్నాళ్లుగా సంతోష్‌ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. రష్మీ మరణానికి సంతోష్‌ కారణమై ఉండొచ్చని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. `శనివారం (జూన్‌ 18) రష్మీకి కాల్‌ చేస్తే లిఫ్ట్‌ చేయలేదు. తర్వాత తను చనిపోయినట్లు సంతోష్‌ మాకు చెప్పాడు. సంతోష్‌, రష్మీ భార్యాభర్తలుగా నివసిస్తున్నట్లు ఇంటి యజమాని చెప్పేంత వరకు మాకు తెలియదు` అని రష్మీ రేఖ తండ్రి తెలిపారు. అతను మోసం చేయడం వల్లే తన కూతురు బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని ఆయన ఆరోపించారు. జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాకు చెందిన రష్మీ 'కెమిటి కహిబి కహా' అనే ఒడియా సీరియల్‌తో గుర్తింపు పొందింది.