Asianet News TeluguAsianet News Telugu

డైరెక్టర్ పేరుతో నటికి వేధింపులు.. పోలీస్‌ ఫిర్యాదు..

టీవీ నటి పాయల్‌ సర్కార్‌కు సోషల్‌ మీడియాలో ఒక వ్యక్తి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. అతడి ప్రొఫైల్‌లో ప్రముఖ బెంగాలీ దర్శకుడు రవి కినాగి ఫొటోలున్నాయి. దీంతో పాటు అతడి సినిమాలకు సంబంధించిన వివరాలు కూడా ఉండటంతో సదరు వ్యక్తి నిజంగానే దర్శకుడని పాయల్‌ నమ్మేసింది. 

tv actress payal sarkar file compaint director fake account
Author
Hyderabad, First Published Aug 30, 2021, 2:09 PM IST

దర్శకుడు పేరుతో ఓ నటికి వేధింపుల ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ దర్శకుడి పేరుతో ఓ వ్యక్తి తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నారంటూ బెంగాలీ టీవీ నటి పాయల్ సర్కార్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. ఫేక్‌ అకౌంట్‌ ద్వారా సదరు వ్యక్తి తనకు తరచూ నీచమైన మెసేజ్‌లు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొంది. 

ఆ వివరాల్లోకి వెళితే.. టీవీ నటి పాయల్‌ సర్కార్‌కు సోషల్‌ మీడియాలో ఒక వ్యక్తి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. అతడి ప్రొఫైల్‌లో ప్రముఖ బెంగాలీ దర్శకుడు రవి కినాగి ఫొటోలున్నాయి. దీంతో పాటు అతడి సినిమాలకు సంబంధించిన వివరాలు కూడా ఉండటంతో సదరు వ్యక్తి నిజంగానే దర్శకుడని పాయల్‌ నమ్మేసింది. దీంతో ఆదివారం ఆ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేసింది. అతడు మాట కలుపుతూ.. తను తీయబోయే సినిమాలో ప్రధాన పాత్ర ఇప్పిస్తానని నటికి ఆశ చూపించాడు. అందుకు ఆమె సంతోషించేలోపే నీచమైన మెసేజ్‌లు చేయడం ప్రారంభించాడు.

వరుసగా అసభ్యకరమైన సందేశాలు వస్తుండటంతో పాయల్ కి డౌటొచ్చింది. అది డైరెక్టర్‌ అకౌంటేనా? లేదా ఫేక్‌ అకౌంటా? అన్న అనుమానం మొదలైంది. ఆ అనుమానానికి ఆజ్యం పోస్తూ అతడు వరుసగా అసభ్య సందేశాలు పంపాడు. వెంటనే ఆమె ఆ మెసేజ్‌లను స్క్రీన్‌షాట్లు తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. అతడి ప్రొఫైల్‌ చూసిన ఆమె అభిమానులు, స్నేహితులు దాన్ని ఫేక్‌ అకౌంట్‌ అని తేల్చగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. బరక్‌పూర్‌ పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లతో ఆడవారిని వేధించే ఇలాంటి దుర్మార్గులను శిక్షించాలని డిమాండ్‌ చేసింది పాయల్‌.  తన పేరు మీద ఫేక్‌ ఐడీలు క్రియేట్‌ చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని దర్శకుడు రవి సైబర్‌ పోలీసులను కోరినట్లు సమాచారం. అంతేకాకుండా సినిమా అవకాశం కావాలంటే తనకు ఫోన్‌ చేయడమో లేదా కార్యాలయానికి రావాలే తప్ప ఇలా సోషల్‌ మీడియాలో రిక్వెస్టులు పంపకూడదని  సూచించాడు. దీంతో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌ గా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios