తెలంగాణలో మితిమీరి టికెట్ ధరలు పెంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా డబ్బింగ్ సినిమాలకి సైతం భారీ స్థాయిలో టికెట్ ధరలు పెంచుకునేలా ప్రభుత్వం అనుమతి ఇస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

మొన్నటి వరకు ఏపీలో టికెట్ ధరల పెంపుపై రచ్చ జరిగింది. ఇప్పుడు తెలంగాణలో మితిమీరి టికెట్ ధరలు పెంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా డబ్బింగ్ సినిమాలకి సైతం భారీ స్థాయిలో టికెట్ ధరలు పెంచుకునేలా ప్రభుత్వం అనుమతి ఇస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

తాజాగా కేజిఎఫ్ 2 చిత్రానికి మల్టిప్లెక్స్ లలో రూ 50.. సింగిల్ స్క్రీన్ లో రూ 30 పెంచుకునే అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అలాగే మొదటి వారంలో 5 షోలు ప్రదర్శించుకునేందుకు కూడా వీలు కల్పించింది. ప్రస్తుతం మల్టి ఫ్లెక్స్ లలో రూ 295, సింగిల్ స్క్రీన్స్ లో 150 వరకు ధరలు ఉన్నాయి. ఇప్పుడు పెంచిన ధరలు కలుపుకుంటే మల్టి ప్లెక్స్ లలో రూ. 345. మొదటి వారంలో సినిమా చూడాలనుకునే ఫ్యామిలీ ఆడియన్స్ అన్ని ఖర్చులు దాదాపుగా అంచనా వేసుకున్నా 2000 వేల వరకు స్వాహా అవుతాయి. 

అదే విధంగా బీస్ట్ చిత్రానికి కూడా టికెట్ ధరలు పెంచాలని ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనితో తెలంగాణ టికెట్ ధరలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఈ వారం 2000 ఖర్చు పెట్టిన ఫ్యామిలీ ప్రేక్షకులు వచ్చే వారం ఏదైనా చిన్న సినిమా విడుదలైతే థియేటర్ కి వెళ్లే పరిస్థితి ఉండదు. ఖర్చుల విషయంలో ఆలోచనలో పడతారు. 

ఓటిటిలో వస్తే చూసుకోవచ్చులే అని భావించే ప్రమాదం కూడా ఉంది. తొలి వారంలోనే వీలైనంత ఎక్కువగా వసూళ్లు పిండేయాలనే దురాలోచనే టికెట్ ధరలపై విమర్శలకు కారణం అవుతోంది. దీని వల్ల లాంగ్ రన్ దెబ్బ తినే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రానికి టికెట్ ధరలు ఊహకు అందని విధంగా షాక్ ఇచ్చాయి. ఆ తర్వాత వచ్చిన మీడియం బడ్జెట్ మూవీ గని పరిస్థితి ఏమైందో చూశాం. 

గని ఫ్లాప్ టాక్ మూటగట్టుకున్నప్పటికీ వరుణ్ తేజ్ చిత్రానికి అంత దారుణమైన కలెక్షన్స్ ఎవరూ ఊహించి ఉండరు. దీనికి టికెట్ ధరలు కూడా కారణమే. గని పై ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ పడింది అనడానికి ఇదే ఉదాహరణ. ఇప్పుడు ఏకంగా డబ్బింగ్ సినిమాలకు కూడా ఇబ్బడి ముబ్బడిగా టికెట్ ధరలు పెంచేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో ప్రశ్న లేవనెత్తుతున్నారు. భవిషత్తులో ఇదే కొనసాగితే ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తిగా థియేటర్ కి దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు.