లాక్ డౌన్ టైమ్ లో అనేక విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లే పరిస్దితి లేదు. వెళ్లినా అక్కడవారికి దగ్గరగా మసిలే పరిస్దితి అంతకన్నా లేదు. ఎవరి జాగ్రత్తల్లో వాళ్లు ఉంటున్నారు. అందుకు సామాన్యులు..సెలబ్రెటీలు అనే తేడా లేదు. ఈ నేపధ్యంలో సినిమావాళ్లు తమ తదుపరి ప్రాజెక్టుల కోసం ఈ లాక్ డౌన్ టైమ్ ని సద్వినియోగ పరుచుకుంటన్నారు. అందులో భాగంగా స్క్రిప్టు లు తయారు చేసుకునేవారు కొందరైతే, మరికొందరు షూటింగ్ కు సరపడ ప్రిపరేషన్స్ పేపర్ మీద వర్కవుట్ చేసుకుంటున్నారు. లాక్ డౌన్ ఎత్తేసి, కాస్త పరిస్దితులు చక్కబడగానే షూటింగ్ లు మొదలెడదామనుకునేవారు హీరోలతో టచ్ లో ఉంటున్నారు. అలాంటివారితో త్రివిక్రమ్ ఒకరు.

త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయనున్నాడనే విషయం మనందరికీ తెలిసిందే.  ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పై త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నాడు. గతంలో 'అరవింద సమేత'  సమయంలో ఆయన ఎన్టీఆర్ తో ఎప్పటికప్పుడు స్క్రిప్ట్ గురించి చర్చిస్తూ వచ్చాడట. అయితే ఈ సారి లాక్ డౌన్ కారణంగా ఎవరి ఇంట్లో వారే ఉండిపోవలసి వచ్చింది. దాంతో  తాజా చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ గురించి త్రివిక్రమ్ ఎప్పటికప్పుడు వీడియో కాల్ చేసి ఎన్టీఆర్ కి వివరిస్తున్నాడట. 

ఎన్టీఆర్ కు ఈ స్క్రిప్టు విషయంలో వచ్చే డౌట్స్ ని నివృత్తి చేస్తూ వెళుతున్నాడని అంటున్నారు. ఈ లాక్ డౌన్ పీరియడ్ లోనే  స్కిప్ట్ లాక్ చేయవచ్చని చెబుతున్నారు. రాజకీయాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనీ, బిజినెస్ మేన్ గా ఎన్టీఆర్ కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాకి 'అయినను పోయిరావాలె హస్తినకు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు  హీరోయిన్స్ కు చోటు ఉందట. ఒక  హీరోయిన్ గా శ్రుతి హాసన్ కనిపించనుందని చెబుతున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'రామయ్యా వస్తావయ్యా' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.