శనివారం ఉదయం సీనియర్‌ నటి వాణి శ్రీ కుమారుడి ఆత్మహత్య వార్తతో టాలీవుడ్‌ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కొద్ది గంటల్లోనే టాలీవుడ్‌ను మరో విషాదకర వార్త కన్నీటి పర్యంతం చేసింది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ మిమిక్రీ కళాకారుడు హరికిషన్‌ శనివారం మృతి చెందారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. వేలాది షోస్‌ చేసిన హరికిషన్‌ ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లతో సహా.. కృష్ణ,  శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ లాంటి సీనియర్‌ హీరోలతో పాటు యంగ్ జనరేషన్‌ నటీనటులను కూడా ఆయన అనుకరిస్తుంటారు. దేశ విదేశాల్లో ప్రదర్శను ఇచ్చిన హరికిషన్ రాజకీయ నాయకుల గొంతులను కూడా అనుకరిస్తారు.

హరికిషన్.. 1963 మే 30న వీఎల్ఎన్‌ చార్యులు, రంగమణి దంపతులకు ఏలూరులో ఆయన జన్మించారు. స్కూల్‌ వయసు నుంచి మిమిక్రీ చేయటం ప్రారంభించిన ఆయన ముందుగా ఉపాధ్యాయులను, తోటి విద్యార్థులను అనుకరించేవాడు. పక్షులు, జంతువులు, మెషీన్ల శబ్ధాలను కూడా ఆయన అనుకరించగలరు. తరువాత మిమిక్రీనే ప్రొఫెషన్‌గా ఎంచుకున్న ఆయన సినీ నటుడు, రాజకీయ నాయకులు, క్రీడాకారుల గొంతులను మాత్రమే కాదు గాయకులను గొంతులను కూడా ఆయన అనుకరించేవారు.

1971లో తొలిసారిగా వేదిక మీద మిమిక్రీ ప్రదర్శన ఇచ్చిన ఆయన తరువాత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు. ఈ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన శివారెడ్డి కూడా మిమిక్రీ కళాకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కళారంగానికి విశేష సేవలందించిన హరికిషన్‌ గారి మరణం పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.