సినీ ఇండస్ట్రీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీలోని లుకలుకలు బయటపడ్డాయి. గురువారం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా బసవతారకం హాస్పిటల్‌లో మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సినీ పెద్దలు తలసానితో కలిసి భూములు పంచుకుంటున్నారని, రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.

అయితే ఈ వ్యాఖ్యలపై ఇండస్ట్రీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సీ కళ్యాణ్‌, నాగబాబులు ఖండించారు. తలసాని కూడా ఈ వ్యాఖ్యలపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో శుక్రవారం సీసీసీ సభ్యులు మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో మరోసారి సమావేశం కావటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా కాలంలో ఇబ్బందుల్లో ఉన్న సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరంజీవి స్థాపించిన సీసీసీ (కరోనా క్రైసిస్‌ చారిటీ) కార్యక్రమాల గురించి చర్చించేందుకే ఈ మీటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఈ మీటింగ్‌లో చిరంజీవితో పాటు తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్‌ శంకర్‌, సీ కళ్యాణ్‌, బెనర్జీ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీసీసీ ద్వారా ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అయితే ఈ సందర్భంగా బాలకృష్ణ వ్యాఖ్యలపై కూడా చర్చించారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. బాలయ్య వ్యాఖ్యలతో ఇప్పటికే వేడి మీదున్న సినీ రాజకీయం తాజాగా చిరంజీవి ఇంట్లో మరో మీటింగ్ జరుగుతుండటంతో మరింత వేడెక్కుతుందని భావిస్తున్నారు.