టీవీ 9 న్యూస్ రిపోర్టర్ దేవి నాగవల్లి నిన్న బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేటై వెళ్లిపోయారు. ఎలిమినేషన్ కి నామినేటైన ఏడుగురు సభ్యులలో అత్యల్ప ఓట్లు దక్కించుకున్న దేవి నాగవల్లి హౌస్ ని వీడాల్సివచ్చింది. ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించిన చాలా మంది కొత్తవాళ్లు కావడంతో, చాలా కాలంగా ప్రముఖ న్యూస్ జర్నలిస్ట్ గా సుపరిచితురాలైన దేవి నాగవల్లిని స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ప్రేక్షకులు భావించారు. అనూహ్యంగా దేవి మూడో వారానికే హౌస్ ని వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఎలిమినేటై బిగ్ బాస్ వేదికపైకి వచ్చిన దేవి నాగవల్లిని నాగార్జున కారణం ఏమనుకుంటున్నావ్ అని అడిగారు. దానికి దేవి తెలియదు సార్ అని ఆన్సర్ ఇచ్చారు. అంటే టైటిల్ కొట్టాలని, లేడీ బాస్ అవ్వాలని హౌస్ లోకి వెళ్లిన దేవి ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతారని ఆమె ఊహించలేదు. ఎలిమినేటైన తరువాత ఇంటి సభ్యులకు అమూల్యమైన సలహాలు ఇచ్చి తన పరిపక్వత చాటుకుంది దేవి నాగవల్లి. 

ఐతే ఇప్పటి వరకు హౌస్ నుండి ముగ్గురు ఎలిమినేట్ కావడం జరిగింది. మొదటివారం సూర్య కిరణ్, రెండవ వారం కరాటే కళ్యాణి, తాజాగా దేవి నాగవల్లి ఎలిమినేట్ అయ్యారు. వీరి ముగ్గురిలో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. వయసు పరంగా మిగతా కంటెస్టెంట్స్ కంటే పెద్దవారు. అలాగే ఈ ముగ్గురు ఇంటిలో కొంచెం పెద్దరికం ప్రదర్శించాలని చూశారు. అది పెత్తనం అనలేం కానీ ఇతరులకు సలహాలు ఇవ్వడం గైడ్ చేయడం లాంటి పనులు చేయడం జరిగింది. ఈ విషయంలో కళ్యాణి కొంచెం తక్కువే అయినప్పటికీ వయసులో పెద్ద అనే భావన ఐతే ప్రదర్శించారు. ఈ లక్షణాలే ఈ ముగ్గురు ఎలిమినేట్ కావడానికి కారణం అనిపిస్తుంది.